‘ఎయిర్‌ ఇండియా’ ఒప్పందం మరో రఫేల్‌డీల్‌ కాకూడదు!

ఎయిర్‌ ఇండియా కంపెనీ పూర్తిగా టాటా గ్రూపు సంస్థల హస్తగతమైన ప్రయివేట్‌ కంపెనీ. అలాంటి కంపెనీ అమెరికాకు చెందిన బోయింగ్‌ అనబడే విమానాల ఉత్పత్తి సంస్థతో 350 విమానాలు కొనడానికి, ఫ్రాన్స్‌ దేశంతో మరిన్ని ఎయిర్‌ బస్సులను కొనడానికి ఒప్పందం చేసుకున్నది. ఇది ఇరు కంపెనీల మధ్య సర్వ సాధారణ వ్యాపార ఒప్పందం. రోజూ అనేక సంస్థల్లో, అనేక దేశాలలోని వ్యాపార వ్యవహారాల్లో ఇట్లాంటి అగ్రిమెంట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఎయిర్‌ ఇండియా చేసుకున్న ఈ ఒప్పందం సందర్భంగా భారతదేశంలోని మీడియా సంస్థలు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ సోషల్‌ మీడియా విభాగం, అన్నింటికి మించి వాట్సప్‌లను, ఫేస్‌బుక్‌ను అత్యంత పవిత్రంగా భావించి వచ్చిన మెసేజర్లు ఉన్నతడవే అందరికీ ఫార్వర్డ్‌ చేసి అదే దేశభక్తి అనుకునే మధ్యతరగతి మేధావులు ఎయిర్‌ ఇండియా కొనుగోలు వ్యవహారాన్ని విపరీతంగా పొగుడు తున్నారు. భారతదేశంలో యుద్ధాన్ని గెలిచినంత స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నారు. అంతే కాకుండా దానికి సహకరించారని, ప్రోత్సహించారని ప్రధానమంత్రిని ఆకాశానికి ఎత్తారు. ఈ పరిణామాలన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇతర అనేక రంగాలలో భవిష్యత్తులో కుదిరే ఒప్పందాలన్నీంటికీ కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సహకరించగలదా? ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎయిర్‌ ఇండియా సంస్థను టాటా గ్రూపునకు ఆమ్మేనాటికి దాని విలువ రూ.52,000 కోట్లు. దానిని కేవలం రూ.18వేల కోట్లకి టాటా సంస్థకు అమ్మేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వైభవంగా నడవవలసిన ఎయిర్‌ ఇండియా సంస్థ, ప్రభుత్వం చేతకాక టాటా గ్రూపునకు అమ్మిందా లేక వాస్తవ విలువకు అమ్మకపు విలువకు మధ్యన ఉన్న తేడాను పంచుకున్నారా? అనే సందేహం సహజంగా కలుగుతుంది. ప్రభుత్వం చేయలేని పని ఒక ప్రయివేటు కంపెనీ ఎలా చేయగలుగుతుంది అన్న అంశాన్ని ప్రజలకు వివరించాలి. టాటా సంస్థ చేతిలో మాయా దండం (మ్యాజిక్‌ వ్యాండ్‌) ఏమైనా ఉన్నదా? ప్రభుత్వం నడపలేని సంస్థకు ప్రభుత్వమే దగ్గర ఉండి వేల కోట్ల రూపాయల విలువచేసే విమానాలను కొనేలా సామ్రాజ్య వాద దేశాలను ఒప్పించడం ఎందుకు? ఎలా సాధ్యమైంది? అనగా ఇలా కుదిర్చిన ఒప్పందా లలో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆశ్రిత పెట్టుబడిదారులకు ఉపయోగపడు తున్నారనే సందేహం కలగడంలో తప్ప ఏమీ లేదు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఒప్పందం పట్ల స్పందిస్తూ, తమ దేశంలో రాబోయే రోజులలో టాటా గ్రూపుకు ఇవ్వవలసిన విమానాల తయారీ సందర్భంగా పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, ఇలాంటి అవకాశం కల్పించిన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఇమ్మానుయేల్‌ కూడా ఇదే రకమైనటువంటి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఒప్పందాలు మా దేశంతో కూడా జరగనున్నాయన్న సంకేతానిస్తూ బ్రిటన్‌ ప్రధాని రిషీ సునక్‌ అభినందనలు తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ఉత్పాదక రంగాన్ని విస్తరించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచ వలసింది పోయి, కేవలం విదేశాలలో ఉత్పత్తి కాబడుతున్న విమానాలను కొనుగోలు చేయడం తిరోగమన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. దేశంలో పెట్టుబడులకు కొదవ ఏమీ లేనప్పుడు కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహ్వానించి ఇక్కడే ఉత్పత్తి చేసే ప్రయత్నాలు ఎందుకు చేయలేదో ప్రజలకు వివరిస్తే బాగుండేది.
ఎయిర్‌ ఇండియా సంస్థ ఒరిజినల్‌గా టాటా గ్రూపునకు చెందినదే కానీ స్వతంత్రానంతరం బలవంతంగా అప్పటి ప్రభుత్వం లాక్కుని దానిని సరిగ్గా నడప లేక పోయింది, ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా అదే విధంగా విఫలమయ్యాయి… అనే వాదనను బహు ప్రచారంలో కుహనా మేధావులు పెడుతున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే స్వాతంత్రానికి పూర్వమే ‘బాంబే ప్లాన్‌’ అనబడే వ్యూహకర్తలలో ఒకరుగా జే.ఆర్‌.డి టాటా ఉన్నారు. ఎయిర్‌ ఇండియా విస్తరణకు తమ దగ్గర నిధులు సరిపోవని, మహలనోబిస్‌ అనబడే అప్పటి వ్యూహకర్త ప్రణాళిక ప్రకారం చిన్న మొత్తాలను సమీకరించి ప్రభుత్వ రంగాలను విస్తరించే భాగంలో ఎయిర్‌ ఇండియా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని వారు సూచించినట్లుగా, టాటా ఒప్పుకున్నట్లుగా చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత కాలంలో అంతర్జాతీయ సెక్యూరిటీ దృష్ట్యా ఎయిర్‌ ఇండియా ప్రభుత్వ రంగంలోనే కొనసాగి దినదినాభివృద్ధి చెందింది. కానీ భారత విమానయాన రంగాన్ని ప్రయివేటీకరించిన తర్వాత ఎయిర్‌ ఇండియాను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, ప్రయివేటు రంగానికి ఎక్కువ ప్రోత్సాహాన్ని ప్రభుత్వాలు ఇచ్చాయి. అంతేగాకుండా ఎయిర్‌ ఇండియాను ప్రభుత్వాలు తమ సొంత పనులకు వినియోగిస్తూ సరైన చెల్లింపులు చేయలేదు. భారత ప్రజాస్వామ్యపు ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టంగా మారి ఎన్నికలన్నీ పూర్తిగా డబ్బుమయమై చెదలు పట్టిన సందర్భంలో బూర్జువా పార్టీలన్నీ ప్రయివేటు పెట్టుబడిదారుల కొమ్ము కాయడం ప్రారంభించాయి. దీనిని అదునుగా చేసుకుని ఇట్లాంటి అనేక రంగాల్లోని పెట్టుబడిదారులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన మౌలిక వసతులపై (ఇన్ఫ్రాస్ట్రక్చర్‌) ఆధారపడి తమ కంపెనీలను అందలమెక్కించుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఎయిర్‌ పోర్టులను నిర్మించాయి. ఆ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అత్యంత చౌకధరకు భారతదేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అనేకమంది పేదలు తమ భూములను ధారదత్తం చేశారు. ‘కన్స్ట్రక్ట్‌ అండ్‌ కలెక్ట్‌’ అనే పేరు మీద ఎన్నో రాయితీల నిచ్చి ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టులను నిర్మించాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ నిర్మించిన వేల టవర్లను ప్రయివేటు కంపెనీలు వాడుకునేలా అవకాశం ఇచ్చి అదే బిఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి నెట్వర్కు ఇవ్వకుండా దానిని కూలదోసిన వాస్తవం మన కళ్ళ ఎదుట ఉన్నది. బ్యాంకు రుణాల ఎగవేతదారులకు ఇన్సాలెన్సీ బ్యాంక్రఫ్టసి అనే పేరు మీద అత్యంత తక్కువ రోజులలో తమను తాము రుణ విముక్తులను చేసుకునేలా చట్టాలను మార్చి మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్మును కాజేసే పథకాలు రూపొందిస్తున్నదీ ప్రభుత్వాలే.
ప్రభుత్వ రంగాలు నష్టపోవడానికి అందులో పని చేస్తున్న ఉద్యోగులే కారణమని ప్రచారంలో పెడతారు. దీనిని బలపరుస్తూ ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్‌ చేస్తుంటారు. ఇది ఆత్మహత్య సదృశమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో కొందరిలో అలసత్వం ఉండవచ్చు, దానిని కచ్చితంగా తప్పుబట్టాలి, అధిగమించాలి. కానీ ఒక సంస్థ లాభాలకు ప్రధాన కారణం దాని విధానం, అమలుపరిచే సామర్థత, ప్రభుత్వ జోక్యంలేని స్వతంత్రత ప్రధానమవుతాయి. ప్రభుత్వ రంగాలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించి సరైన విధంగా మానిటర్‌ చేస్తే మూడు లాభాలు కలుగుతాయి. ఒకటి, వచ్చిన ప్రతిఫలం అంతా ప్రజలకే చెందుతుంది, రెండు, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, మూడు, ఆ సంస్థ అభివృద్ధికి కారకులైన ఉద్యోగుల జీవితాలు ఉన్నత ప్రమాణాల్లో సాగుతాయి. ప్రయివేటు రంగం విరాజిల్లినచోట దీనికి భిన్నమైన ఫలితాలు ఉంటాయి. భద్రతలేని ఉపాధి వలన కార్మికుల జీవన విధానంలో అనిశ్చితి ఎల్లప్పుడూ రాజ్యమేలుతుంది. స్టాక్‌ మార్కెట్లను ఉపయోగించుకొని ప్రజల పొదుపును సమీకరించుకొని ప్రయివేట్‌ యాజమాన్యాలు విపరీతంగా లాభాలు ఆర్జించి తాము మాత్రమే అందలమెక్కుతారు. తమకు సహకరించిన ప్రభుత్వాలకు ఎన్నికల నిధులు సమకూర్చి లబ్ధి పొందుతారు. నేటి ఎయిర్‌ ఇండియా వ్యవహారం మరో రఫేల్‌ డీల్‌లా మారి వేల కోట్ల కుంభకోణంగా మారదని చెప్పలేం. అందుకే కీలక రంగాలను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, ప్రయివేటు కంపెనీలకు విధి విధానాల రూపకల్పనకు గాక మరెక్కువ జోక్యం చేసుకుంటే అపవాదు మూటగట్టుకోవాల్సిందే!
– జి. తిరుపతయ్య
9951300016

Spread the love