ఎల్‌ఐసీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు విరమించుకోండి

– కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ ఫ్రంట్‌ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హిండన్‌బర్గ్‌ నివేదికలో పేర్కొన్నట్టు అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టినందువల్ల ఎల్‌ఐసీ సంస్థకు నష్టాలు వచ్చాయనే ప్రచారంలో వాస్తవం లేదని ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ ఫ్రంట్‌ స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్‌పార్టీ ఈనెల 6వ తేదీ దేశవ్యాప్తంగా అన్ని ఎల్‌ఐసీ కార్యాయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని అనుకుంటున్నట్టు తెలిసిందనీ, దీన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫెడరేషన్‌ ఆఫ్‌ క్లాస్‌ 1 ఆఫీసర్స్‌ అసోసియేషన్స్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ రాజ్‌కుమార్‌, ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యూ సెక్రటరీ జనరల్‌ వివేక్‌సింగ్‌, ఏఐఐఈఏ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా, ఏఐఎల్‌ఐసీఈఎఫ్‌ ప్రధాన కార్యదర్శి రాజేష్‌కుమార్‌ శనివారంనాడొక సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగే రీతిలో దేశంలోని ఏ పారిశ్రామిక గ్రూపునకు రాజకీయ దన్ను అందినా దాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. హిండన్‌ బర్గ్‌ నివేదికలోని వాస్తవాలను బయట పెట్టడానికి, ప్రభుత్వం నిష్పాక్షిక విచారణకు ఆదేశించాలని తాము కోరుతున్నామన్నారు. ఎల్‌ఐసీ దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌ అనీ, పాలసీదారుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దష్టిలో పెట్టుకొని మాత్రమే పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. దీనికోసం సంస్థలో ప్రత్యేకంగా ఇక పెట్టుబడుల బోర్డు ఉన్నదనీ, దాని విధానాల ప్రకారం, 80 శాతం పెట్టుబడులను ప్రభుత్వ సెక్యూరిటీల్లో, బాండ్లలోనూ పెట్టి, మిగిలిన 20 శాతం మాత్రమే షేర్లలో పెడుతుందని స్పష్టంచేశారు. దీనివల్ల ఎల్‌ఐసీ పాలసీదారుల పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని తెలిపారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎల్‌ఐసీకి నష్టం వచ్చిందనే ప్రచారం పూర్తిగా ఊహాత్మకమైనదని చెప్పారు. నష్టాలు రావడానికి అదానీ సంస్థల్లోని తన షేర్లను ఎల్‌ఐసీ అమ్మలేదని వివరణ ఇచ్చారు. దీనిపై ఎల్‌ఐసీ జనవరి 31న ఇచ్చిన పత్రికా ప్రకటనలో అదానీ గ్రూప్‌ సంస్థల్లో తాము రూ.36,474.78 కోట్ల పెట్టుబడులు పెట్టామనీ, వాటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.56,142 కోట్లని ప్రకటించింది. ఆ రకంగా ఎల్‌ఐసీ రూ. 20వేల కోట్ల ఊహాత్మక లాభాలను సంపాదించిందని వివరించారు. ఊహాత్మక నష్టాల మాదిరే, ఊహాత్మక లాభాలను కూడా ఎల్‌ఐసీ సాధించిందన్నారు. అదానీ గ్రూపులో పెట్టిన పెట్టుబడులు కేవలం 7 శాతమేననీ, ఆ గ్రూపు సంస్థల మొత్తం క్యాపిటలైజేషన్‌ విలువలో ఎల్‌ఐసీ వాటా 3.91 శాతమేనని తెలిపారు. టాటా సంస్థల్లో ఎల్‌ఐసీ వాటా 3.98, రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీల్లో 6.45శాతం నిబంధనలకు లోబడే పెట్టుబడులు పెట్టినట్టు వివరించారు. ఎల్‌ఐసీ గొప్ప సంస్థ అనీ, దాని కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించడం, సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తుందని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. అందువల్ల నిరసనల నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు.

Spread the love