ఎవరినీ వదిలిపెట్టం

– నవీన్‌ హత్య కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోంది: సీపీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్‌ హత్య కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతోందని రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. నవీన్‌ హత్య కేసులో మరిన్ని విషయాలను రాబట్టేందుకు నిందితుడు హరిహరకృష్ణను శుక్రవారం పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, శనివారం ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సీపీ మాట్లాడారు. నవీన్‌ హత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని తెలిపారు. అమ్మాయి పాత్రపై ఎలాంటి సమాచారమూ లేదన్నారు. హత్య తర్వాత, అంతకు ముందు నిందితుడు ఎవరెవరిని కలిశాడని ఆరా తీస్తున్నామన్నారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంతమంది ఉన్నారనే కోణంలో విచారణ జరుగుతోందని తెలిపారు. ఎవరికైనా నిందితుడితో సంబంధాలున్నట్టు తెలిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తేలేదన్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం కేసును సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్నారా అన్న ప్రశ్నకు విచారణలో ఉన్న సమయంలో అదనపు వివరాలు వెల్లడించలేమని సీపీ స్పష్టం చేశారు.

Spread the love