– ఆ తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలి :తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్న వాల్మీకి, బోయలతో పాటు బేదర, కిరాత, మాలి, తలయారి, చుండు వాళ్ళు, కాయత లంబాడా, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీ తెగల జాబితాలో చేర్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం(టీజీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మా నాయక్, ఆర్. శ్రీరాం నాయక్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఎస్టీ జాబితాలో ఇతర కులాలను కలిపేందుకు ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు రిజర్వేషన్లు పెంచకుండానే గత నెలలో కొత్తగా 15 బీసీ కులాలను ఎస్టీ జాబితాలో కలిపి గిరిజనులకు ద్రోహం చేసిందని పేర్కొన్నారు.
వాల్మీకి బోయలను ఎస్టీలో కలిపేందుకు 2004 లో వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రా యూనివర్సిటీ ఆంత్రో పాలజీ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించారని తెలిపారు. వాల్మీకి బోయలకు గిరిజన తెగల లక్షణాలు లేవంటూ ఆ నివేదిక తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సైతం 2017 లో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఆంత్రో పాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మరోసారి సర్వే చేయించినా గిరిజన తెగల లక్షణాలు లేవని ఆ నివేదిక విశదీకరించిందని పేర్కొన్నారు. ఆయా కులాలను బలవంతంగా ఎస్టీ జాబితాలో కలిపేందుకు మరోసారి తీర్మానం చేయడం గిరిజనులను మోసం చేయడమేననీ విమర్శించారు.