– విద్యాశాఖ కార్యదర్శికి ఆర్యూపీపీటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన 40 రోజుల కార్యాచరణపై అభ్యంతరాలున్నాయని ఆర్యూపీపీటీఎస్ తెలిపింది. సీసీఈ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేయడం సరైంది కాదని విమర్శించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి జగదీశ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలకు తేడా ఉంటుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ ప్రకటించిన కార్యాచరణ విద్యార్థుల పాలిట శరాఘాతంగా ఉందని విమర్శించారు. ఆదివారం, రెండో శనివారం కూడా వదిలిపెట్టకుండా ఏదో యుద్ధానికి పిల్లలను తయారు చేస్తున్నట్టు సీసీఈ పద్ధతికి వ్యతిరేకంగా ఈ కార్యాచరణ ప్రకటించడాన్ని ఖండించారు. ఉత్సాహపూరిత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలకు తయారు కావాలనీ, భయం ఉండొద్దని సీసీఈ చెప్తున్నదని గుర్తు చేశారు. పిల్లలకు భయం లేకుండా విరామం ఉండేలా చదువుకునే అవకాశం కల్పించాలని సూచించారు. విద్యార్థుల ఆహారవిషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకే బడులకు రావాలనీ, తిరిగి సాయంత్రం 5.30కు వెళ్లాలని పేర్కొన్నారు. అమ్మాయిలు ఉదయం, సాయంత్రం వారి ఇండ్ల నుంచి రావడం, తిరిగి వెళ్లేందుకు అనేక చోట్ల రక్షణ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వల్పంగా రవాణా సౌకర్యం ఉంటుందనీ, మహిళా ఉపాధ్యాయులు సెలవుల్లో ఒంటరిగా ప్రయాణించడం ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కార్యాచరణ మొక్కుబడిగా హడావుడిగా చేసినట్టుగా ఉందనీ, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుందని పేర్కొన్నారు. ప్రయివేటు స్కూళ్లను చూసి ప్రభుత్వ బడులు అనుకరిస్తున్నట్టుగా ఉందనీ, ఎక్కడా నాణ్యత కనిపించడం లేదని విమర్శించారు.