ఏఈ పరీక్ష ప్రశాంతం : టీఎస్‌పీఎస్సీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్‌ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ), మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ అండ్‌ జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఆదివారం నిర్వహించిన రాతపరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 74,478 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. వారిలో 68,257 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం ఏడు జిల్లాల్లో 162 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. పేపర్‌-1కు 55,189 (74.10 శాతం) మంది, పేపర్‌-2కు 54,917 (73.73 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ బి జనార్ధన్‌రెడ్డి, ఇతర సభ్యులు పర్యవేక్షించారని పేర్కొన్నారు. 837 పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్‌ 12న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Spread the love