ఏది ధర్మం?

– పొద్దస్తమానమూ ఆ టి.వి. చూస్తూ పండిత ప్రవచనాలు వినటమేనా… కాస్త వంటింట్లోకి వచ్చి సాయపడేది ఏమన్నా ఉందా..?
– నీకు ప్రవచనాలు అంటే లెక్కేలేదు సుమీ…. ధర్మ రహస్యాలను వారుకాకపోతే లోకానికి ఎవరు చెపుతారు?
– దేవుడు ఏమన్నా వారిని తన ప్రతినిధులుగా పంపించడాఏమిటి? ఉపదేశాలు చేయమనీ…
– ఏమేవ్‌! ఎంతబడితే అంత వాగేస్తున్నావ్‌… అసలిది నీ పుర్రెకు పుట్టిన బుద్దేనా..?
– విషయం చెప్తాను వినండి. నయేమా అనే రేడియో జాకీ, ఒక ముస్లిం స్కాలర్‌ ఆల్‌ వజీద్‌ను పట్టుకుని దుమ్ము దులిపేసింది. ఇతరుల మీద తీర్పులు చెప్పడానికి అల్లా మిమ్మల్ని నియమించారా? ఏమిటి? మేము అల్లాకు జవాబుదారీ కానీ, మీక్కాదు. ఎవరైనా ఏదైనా అభిప్రాయం అడిగేవరకు దానిని మీ వద్దే అంటిపెట్టుకోండి. తగుదునమ్మా అంటూ ప్రతిదాంట్లో తల దూర్చమాకండి. ఎప్పుడు బడితే అప్పుడు ఎలా అయితే అలా ఇతరుల జీవితాలపై వ్యాఖ్యానం చేయకండి. మంచి ముస్లిం పెద్దల్లా మీ మర్యాదను కాపాడుకోండి అని ఘాటుగా సమాధానమిచ్చింది.
– ఏమిటీ ఆ మతంలో కూడా అలా మత పెద్దల్ని ఎదిరించే మహిళలు ఉన్నారా?
– అయ్యో మీ మతిమండా… పాకిస్థాన్‌ మత ఛాందస ఉగ్రవాదుల హుకుంను ధిక్కరించి, ప్రాణాలకు తెగించి మొత్తం మహిళా విద్యను తన ఆచరణలో ముందుకు నడిపిన మలాలా గురించి తెలియకపోతే నేనేం చేసేది?
– అవునవును మర్చిపోయా. మన భారతీయుడు కైలాస్‌ సత్యర్థితో పాటు ఆమెకు కూడా నోబుల్‌ బహుమతి వచ్చిందిగా.
– అంతే కాదు, అతిపిన్న వయసులో నోబుల్‌ బహుమతి గెలుచుకున్న ధీరవనిత మలాలా… తెలుసా.
– ఊ… ఊ… మహిళా సాహసం మాట వస్తే చాలు నీలో ఆవేశం తెగ పొంగుకొచ్చేస్తుంది సుమీ.
– ఉప్పు కారం తింటున్నాముగా. ఉన్నది ఒప్పుకోవడానికి గుటకలు మింగడం దేనికీ..?
– సరే దారి మళ్ళకు. అసలు విషయానికి రా.
– బాలివుడ్‌ నటి స్వరా భాస్కర్‌. సమాజ్‌ వాదీపార్టీ నేత పహాద్‌. వారిద్దరు ఇటీవలే వివాహం చేసుకున్నారు. సాధారణ వ్యక్తులు కాదు వారివురు. మంచి వక్తలు. వారి అద్భుత ప్రసంగాలతో జనాల్ని ఉర్రూతలూగిస్తారు. భావజాలాలు ఒకటి కావడంతో వారి మధ్య స్నేహం చిగురించి, చివరకు పెళ్ళయింది.
మంచిదేగా.
– అందరూ అంత తేలిగ్గా అంగీకరించరు కదండీ! కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తున్నారు.
– ఏమిటా వేళాకోళం సూటిగా చెప్పొచ్చుగా.
– వారిద్దరిదీ ఒకటే కులమేనా, ఒకటే మతమేనా, వయసు తేడా ఏంటి? ఇద్దరికీ మొదటి పెళ్ళేనా ఇది… అంటూ ఆరాలు తీస్తున్నారు.
– తీయరా ఏమిటి? పెద్దలన్నాక. మనమంతా ఒక నాగరిక సమాజంలో జీవిస్తున్నాముగా…
– నేనూ అనేది అదే. వారేమీ పసిపిల్లలు కాదుకదా! వారి వారి రంగాల్లో ముఖ్యులు. ఒక విధంగా సెలబ్రిటీలు. 31ఏండ్ల పహాద్‌ కన్నా స్వరాభాస్కర్‌ మూడేండ్ల పెద్ద. కేంద్రం తెచ్చిన పౌరసత్వ చట్టం (సి.ఎ.ఎ.)కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో వారిద్దరూ పాల్గొన్నారు. వారి వివాహానికి ప్రాతిపదిక ఉద్యమం. ఈ సత్యం గుర్తించక ఆంక్షలు పెడితే ఎలా?
ఎవరేమన్నారు ఏమిటి?
– అదే ఆ ముస్లిం పెద్ద ఆల్‌ వజీద్‌, ఇది చెల్లని పెళ్ళి అని అంటున్నాడు. స్వరా భాస్కర్‌ ముస్లిం కాక, ఆమె భర్త ముస్లిం అయితే ఈ పెళ్ళి చెల్లదట. పవిత్రారాధకురాలైన మహిళ ‘విశ్వాసి’ కానంతవరకు వివాహం చేసుకోకూడదని అల్లా చెప్పాడట. కేవలం వివాహం కోసమే ఆ ఇస్లాంను స్వీకరించినా దానిని కూడా అల్లా అంగీకరించడని ఈయనగారు అంటున్నారు.
ఇక్కడే నా అభ్యంతరం. ఆ ‘విశ్వాసి’ అన్న పదం మహిళలకే వర్తిస్తుందా..? పురుషులకు వర్తించదా ఏమిటి? దేవుని దృష్టిలో మహిళలకో ధర్మం, పురుషులకో ధర్మమా… ఏమిటి?
– అవన్నీ మన కెందుకే… వారి మతం వారి గొడవ.
– అదేమటండీ అలా అంటారు. వారూ మనలాంటి మనుషులేగా.
– నీతో నేను వాదించలేనుగాని ఎవరి ధర్మాలు వారివి.
– ధర్మాలు కాదు, ఎవరి జీవితాలు వారివి అనండి ఒప్పుకుంటాను. ధర్మం పేరుతో అణచాలని చూస్తే నేను తగ్గేదేలే ఆ…
– ఏమిటోరు, ఇంకా కుతకుతలాడుతున్నావ్‌, నేను చేతులెత్తేసానుగా…
– ఇలా రండి. కూర్చోండి. సుప్రీంకోర్టు అంటే ఏమిటి? మన దేశ అత్యున్నత ధర్మాసనం కదా! మన రాజ్యాంగాన్ని, మన సుప్రీం కోర్టును మనమే కదా నిర్మించుకున్నది. ఇప్పుడు వాటికి కూడా కళంకాన్ని ఆపాదిస్తూ కొందరు రాతలు రాస్తున్నారు. కూతలు కూస్తున్నారు. అదే నా బాధ. ఉగ్రవాదులను కాపాడేందుకు దేశ వ్యతిరేక శక్తులు సుప్రీం కోర్టును ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాయట. ఎంత అబద్ధం? రాజ్యాంగాన్ని, ధర్మాసనాన్ని ఇలా తెగనాడుకుంటూ పోతే ఓ భారతీయురాలిగా నేనెందుకు సహించాలి? మనల్ని మనం అవమానించుకోవడం కాదా ఇది. అదీ ధర్మం పేరిట.
ఇంతకీ ఏమంటావ్‌?
– ప్రవచన కారులు అంధవిశ్వాసాలు, అసత్యాలు చెబుతూ అదే అసలైన ధర్మం అంటే నేనెందుకు అంగీకరించాలి. నా దృష్టిలో ధర్మం అంటే పాటించేది. పరోపకారం పుణ్యం. పరపీడనం పాపం. ఏమంటారు?
– ఏమంటాను. నీవుచెప్పింది రైటంటాను.
– కె. శాంతారావు
9959745723

Spread the love