ఐటీ నిబంధనల సవరణలు సరికాదు

న్యూఢిల్లీ : ఐటీ నిబంధనలు, 2021కు కేంద్రం తీసుకొచ్చిన సవరణల ముసాయిదాపై జర్నలిస్టు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మోడీ సర్కారు నిర్ణయంపై ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు ప్రముఖులు, సామాజికవేత్తలు, నిపుణులు ఆందోళనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జాబితాలో మరో రెండు జర్నలిస్టు సంఘాలు చేరాయి. ది నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఏజే), ఢిల్లీ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (డీయూజే) ఈ సవరణల ముసాయిదాను తప్పుబట్టాయి. అలాగే, 2002 గుజరాత్‌ అల్లర్ల విషయంలో మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ లభ్యతను, ప్రదర్శనను నిరోధించడానికి కేంద్రం ఎమర్జెన్సీ అధికారాలను ప్రయోగించడాన్ని విమర్శించాయి. ఎమర్జెన్సీ కాలంలో మీడియాను అణచివేసిన విధంగా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) అనేది ” పోలీస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో” గా కాకుడదని డీయూజే అధ్యక్షులు ఎస్‌.కె.పాండే, డీయూజే జనరల్‌ సెక్రెటరీ సుజాత మధోక్‌, ఎన్‌ఏజే సెక్రెటరీ జనరల్‌ ఎ. కొండయ్య, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జనరల్‌ సెక్రెటరీ జి. ఆంజనేయులు లు నొక్కి చెప్పారు. ప్రభుత్వ వార్తలను మీడియాకు అందించే పాత్రను పీఐబీ కొనసాగిచాలని వారు తెలిపారు. ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉండే ఏదైనా ‘నకిలీ వార్తలు’ గుర్తించడానికి, మీడియాను సెన్సార్‌ చేసే పర్యవేక్షణ బాధ్యతను దీనికి అప్పగించకూడదని అన్నారు. పీఐబీ తన పాత కీర్తిని త్యజించడమనేది విచారించదగిన విషయమని డీయూజే, ఎన్‌ఏజే లు ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇటీవల ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ) వెలువర్చిన ఆందోళనలనే డీయూజే, ఎన్‌ఏజే లు వెల్లడించాయి. బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనల విషయంలో విద్యార్థుల, విద్యార్థి సంఘాలపై పెరుగుతున్న దాడులపై ఈ రెండు జర్నలిస్టు సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పత్రికా స్వేచ్ఛ, హక్కులపై జరుగుతున్న దాడులలో భాగమని తెలిపాయి.

Spread the love