ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09కోట్లు

– రూ.951కోట్లకు వియకామ్‌ 18 సొంతం
– మహిళల ఐపిఎల్‌ ప్రసార హక్కులు
ముంబయి: మహిళల ఐపిఎల్‌ ప్రసార హక్కులకూ భారీ ధర లభించింది. బిసిసిఐ సెక్రటరీ జే షా సోమవారం ట్విటర్‌ వేదికగా మహిళల ఐపిఎల్‌ ఐదేళ్ల ప్రసార హక్కులను వియాకామ్‌-18 కొనుగోలు చేసినట్లు తెలిపారు. 2023-27సర్కిల్‌ పరిధిలో భాగంగా వియకామ్‌ ఒక్కో ఐపిఎల్‌ మ్యాచ్‌కు రూ.7.09కోట్లు చొప్పున బిసిసిఐకి చెల్లించనుంది. ఈ ఐదేళ్ల కాలంలో వియకామ్‌-18 ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్‌ ప్రసార, డిజిటల్‌ హక్కులు కలిగి ఉంటుంది. ప్రసార హక్కులు కొనుగోలుకు డిస్నీ స్టార్‌, సోనీ, జీ కూడా పోటీపడ్డాయి. ఈ ఏడాది నుంచి మహిళల ఐపిఎల్‌లో బిసిసిఐ కొత్త మార్పులకు తెరలేపనుంది. జట్ల సంఖ్యను ఐదుకు పెంచనుంది. మహిళల ఐపిఎల్‌లో ఆడే క్రీడాకారిణులు రూ.10 నుంచి రూ.50లక్షలకు రూపాయలు బేస్‌ ధరతో వేలం బరిలో నిలవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రీడాకారిణులు మాత్రం రూ.30, 40, 50లక్షల బేస్‌ ధరను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మిగతా వారంతా మినిమమ్‌ రూ.10 నుంచి 20లక్షలు మాత్రమే కోట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక మహిళల ఐపిఎల్‌ వేలం జనవరి 26న జరగనుంది.

Spread the love