ఒరిగామి అనేది ప్రాచీన జపాన్ కళ. కాగితాలను మడిచి జంతువుల ఆకృతో పువ్వుల ఆకృతో కలగజేస్తే దానిని ‘ఒరిగామి’ అంటారు. ఈ ఒరిగామి కళలో కాగితాలను వివిధ ఆకృతుల్లో మడవటమే ఉంటుంది. కానీ కాగితాల కత్తిరింపులు ఉండవు. జపాన్ భాషలో ‘ఒరి’ అంటే మలచడం అనీ, ‘కమి’ అంటే కాగితం అని అర్థం. అందుకే ఈ కాగితాల కళకు ‘ఒరిగామి’ అనే పేరు వచ్చింది. పూర్వకాలపు కళలు ఏమైనా ఒక తరం నుంచి మరో తరానికి అందేవే. ఒరిగామి గురించి రాసిన పుస్తకం 1797వ సంవత్సరంలోనే ప్రచురింబడింది. దీనిలో ఒరిగామి చిత్రకళకు సంబంధించిన ఎన్నో సూత్రాలు సూచనలు ఉన్నాయి. కాగితంతో కళాకృతులు ఎన్నో రకాలుగా మలచవచ్చు. ఐరోపా, చైనాలలో కూడా ప్రత్యేకమైన కాగితపు మడతల సంప్రదాయాలు ఉన్నాయి. జపాన్‌లో 7వ శతాబ్దం నాటికే కాగితం తయారీ తెలిసింది. బాగా అభివృద్ధి చేయబడిన కాగితం తయారీ సాంకేతికతను ‘నాగషిసుకి’ అంటారు. ఒరిగామితో తయారైన క్రేన్ బొమ్మ ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపబడింది. ‘యున్హాలీ’ రచించిన ‘ఘోస్ట్వెయిట్’ అనే ఫిక్షన్లో కథాంశం అంతా ఒరిగామి చుట్టూ తిరుగుతుంది. అయితే మనం ఈరోజు అలాంటి కొన్ని అలంకరణ వస్తువులు చేసుకుందాం…
ఒక వాల్ హ్యాంగింగ్ చేద్దాం
ఇది చెయ్యడం కష్టంగా ఏమీ ఉండదు. చిన్నప్పుడు స్కూల్లో గాల్లోకి, పక్కనున్న పిల్లల మీదకి ఎగురవేసే రాకెట్లు మనమే చేశాం గుర్తుందా! పుస్తకంలో కాగితం చించి నాలుగు మడతలు వేసి రాకెట్‌ను చేసి పైకి ఎగురవేశాం కదా. అలాగే ఇప్పుడు పొడుగ్గా ఉన్న గట్టి పేపర్‌ను తీసుకోవాలి. దానిని దగ్గరదగ్గరగా చీర కుచ్చిళ్ళలా మడిచి వదిలి విసనకర్ర వలె వస్తుంది. ఎంత వెడల్పు కావాలో చూసి సరిపోకుంటే మరో పేపర్‌ను మడిచి దీనికి కలిపి అతికించుకోవాలి. అప్పుడు అర్థచంద్రాకారంలో ప్రిల్స్ పేపర్లా వస్తుంది. ఇలా తయారయ్యాక ఒక అట్టపెట్టెలో నుంచి అర్థచంద్రాకారపు పేపర్‌కు సరిపోయేలా కత్తిరించాలి. ఈ అట్టను కాగితం కింద పెట్టి అతికించాలి. దీనివల్ల అది గట్టిగా ఉంటుంది. పేపర్‌ను మడిస్తే అర్ధ చంద్రాకారపు ప్రిల్స్ వచ్చినట్టుగా చిన్న పేపర్‌ను మడిస్తే చిన్న అర్థచంద్రాకారం వస్తుంది. ఇలా చిన్న అర్థ చంద్రాకారాలు మూడు తయారు చేయాలి. ఇప్పుడు పెద్ద అర్థ చంద్రాకారానికి కిందుగా వేలాడేలా మూడు రిబ్బన్ల వంటి కాగితాలు అతికి, వాటికి అర్థ చంద్రాకారాలు అతకాలి. వేలాడుతూ ఇవి చక్కగా కనిపిస్తాయి. దీనిని గోడకు అతికించుకుంటే అందంగా కనిపిస్తాయి.
పక్షిని ఎగరేద్దాం
ఇవన్నీ చేయడానికి పది నిమిషాల కన్నా ఎక్కువ సయమం తీసుకోవు. చిన్నప్పుడు మనం వంటింట్లో వాడే నాలుగు గిన్నెల సెట్, మడుచుకుని ఉన్న కమలం, రాకెట్లు ఎన్నో చేశాం. అప్పుడు దాని పేరు ఒరిగామి అని తెలియదు. కానీ అందరూ చేసిన వాళ్ళే. ఇంకా పడవ, కత్తిపడవ, మనీ పర్సు కూడా చేసే వాళ్ళం. ఇప్పుడు పాత వాటిని గుర్తు చేసుకుంటుంటే ఎన్నో బాల్య జ్ఞాపకాలు. సాధారణమైన ఒక కాగితాన్ని జంతువుగానో, బుట్టగానో ఒక వస్తువుగానో, పువ్వుగానో మార్చడం ద్వారా మనసు ఎంతో ఆనందానికి లోనవుతుంది. ఒరిగామి పిల్లలకు నేర్పించడం ద్వారా వాళ్ళకు మ్యాథ్స్‌లోని సూత్రాలు ఈక్వేషన్స్ అర్థమవుతాయి. వ్యాసం, వ్యాసార్థం, కోణాలు, ఐ మూలగా మడవడం వంటివెన్నో తెలుస్తాయి. రెండు రంగుల్లో రెండు పక్షుల్ని చేద్దాం. ఒకటి పింక్ కలర్ కాగితంతో, మరొకటి వంకాయి రంగు కాగితంతో చేద్దాం. ఫొటోను చూస్తే పేపర్‌ను ఎలా మడవాలో తెలిసిపోతుంది. పేపర్‌ను పక్షి ఆకారంలో మడిచాక కన్ను అతికించుకోవాలి. ఒరిగామి కళలో చాలా రకాల పద్ధతులున్నాయి. యాక్షన్ ఒరిగామి, ప్యూర్లాండ్ ఒరిగామి, మాడ్యులర్ ఒరిగామి అనే పద్ధతులున్నాయి. వీటిలో ఇంకా వెట్ఫోల్డింగ్, కిరిగామి, స్ట్రిప్ ఫోల్డింగ్ అని మరికొన్ని రకాలున్నాయి.
సీతాకోక చిలుకలు
వీటిని తయారు చేసి గోడమీద అతికిస్తే సీతాకోక చిలుకలు వచ్చి వాలినట్టుగా కనిపిస్తాయి. వీటికి ఏ రంగు కాగితాలనైనా ఉపయోగించవచ్చు. సీతాకోక చిలుకలు బహువర్ణాలలో ఉంటాయి. కాబట్టి ఏ రంగైనా వాడవచ్చు. నేను నిండు బులుగు రంగులో కాగితాన్ని తీసుకుని కుచ్చులుగా మడిచాను. ఈ కుచ్చులు సీతాకోక చిలుక రెక్కలుగా పనికొస్తాయి. శరీరం కొరకు కాగితం నిలువుగా కొద్దిగా మడిస్తే చాలు. దీనికి చివర కళ్ళను దిద్దాలి. రెండు రెక్కలను తయారు చేసి రెండు వైపులా అతికించుకోవాలి. ఇవన్నీ అయ్యాక తల భాగంలో రెండు యాంటిన్నాలను పెట్టుకోవాలి. రెండు మూడు సీతాకోక చిలుకల్ని చేసుకుని గోడకు అతికించుకోవాలి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదిగా చేసుకుంటే బాగుంటుంది. కేవలం మడతల ద్వారానే ఒరిగామి కళను చూపించవచ్చు.
ఒరిగామి చేప
ఒరిగామి కళలో కత్తెర, కత్తిరింపు రెండూ ఉండవు, చైనా, యూరోప్‌లకు కూడా ఈ కళ వ్యాపించింది. ఈ కళ గురించి చరిత్రకారులు చక్కని గుర్తింపులతో రాశారు. అన్ని కళలకు వలెనె ఒరిగామిలో కూడా సంప్రదాయితకు తోడుగా ఆధునికత వచ్చి చేరింది. 20వ శతాబ్దం వచ్చే వరకు ఎన్నో మార్పులకు లోనయింది. మత పరమైన పండుగలకు ఇళ్ళు గుళ్ళు అలంకారాలలో పేపర్ బొమ్మలనే వాడేవారు. పిల్లలు ఆడుకోవడానికి పేపర్ బొమ్మలను వాడేవారు. వాటిలో ఎంతో కొత్తదనం వచ్చి నూతన హంగులతో ఈ కళ విలసిల్లడం మొదలయింది. నలుచదరంగా ఉన్న పేపరును మడిచి చేపను చేయవచ్చు. ఇక్కడ చేప శరీరం నలుచదరంగా ఉంచి తోక రెక్కలు వచ్చేలా మడుచుకుంటే సరిపోతుంది. రెండు చేపల్ని చేసి ఎదురెదురుగా పెట్టుకుంటే బాగుంటుంది.
గౌను చేద్దాం
గబ్బిలాలు, కుందేళ్ళు, ఒంటెలు, రామచిలుకలు ఇలా ఎన్ని జంతువులనయినా ఒరిగామిలో చేయవచ్చు. అయితే ఇప్పుడు గౌనును కాగితాల మడతలతో చేద్దాం. నడుము భాగం దగ్గర మాత్రం నలుపు స్కెచ్ పెన్నుతో ఒక గీత గీసుకుంటే బాగుంటుంది. ఈ ఫొటోను చూస్తేనే ఎలా మడవాలో తెలిసి పోతుంది. పేపర్ గౌన్లను తయారు చేసి అద్దాల షోకేస్‌లో పెట్టండి. ఈ మధ్య స్కూళ్ళలో వెరైటీ కాన్సెప్ట్‌లతో డ్రెస్సుల పోటీలు పెడుతున్నారు. ఆయా సమయాల్లో పేపర్ డ్రెస్సు, క్యారీ బ్యాగుల డ్రెస్సులు తయారు చేసి పిల్లలకు వేస్తూ పోటీలలో పాల్గొంటున్నారు. అలాగే ఈ పేపర్ గైనును తయారు చేయండి.
– డాక్టర్ కందేపి రాణీప్రసాద్