– జిల్లా కలెక్టర్లతో మంత్రి హరీశ్ రావు సమీక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి అన్ని శాఖలు సహకరించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. ఖమ్మం నుంచి ఆయన కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారనీ, జనవరి 19 నుంచి జిల్లాల్లో శిబిరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రజలు షెడ్యూల్ ప్రకారం వచ్చేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలనీ, ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రిక అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాట్సప్ గ్రూపుల ద్వారా సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షించాలనీ, క్యాంపులకు వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించారు. జిల్లాల్లో ఈ నెల 19న ఉదయం తొమ్మిది గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి సూచించారు. ఉదయం 8.45 గంటల వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు ప్రాంతానికి చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమం కోసం 15,000 మంది సిబ్బందిని నియమించినట్టు, పరీక్షలకు అవసరమైన పరికరాలు, కండ్లద్దాలు ఇది వరకే సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీజీపీ అంజనీ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.