కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన

– 43.83 లక్షల మందికి కంటి పరీక్షలు
– 8.42 లక్షల మందికి కండ్లద్దాల పంపిణీ
– రాష్ట్ర సమాచార,పౌర సంబంధాల శాఖ కమిషనర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం నాటికి 43.83 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి, వారిలో 8.42 లక్షల మందికి రీడింగ్‌ కండ్లద్దాలను పంపిణీ చేశారు. 40 ఏండ్లు పైబడిన వారిలో ఎక్కువగా దగ్గరి చూపు కనిపించని వారు శిబిరాలకు వస్తున్నారు. మరోవైపు వైద్యులు రీడింగ్‌ గ్లాసెస్‌ ఇవ్వడంతో పాటు ఇతర కంటి సమస్యలతో బాధ పడుతున్న వారికి విటమిన్‌ ఏ, డీ, బీ కాంప్లెక్స్‌ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏండ్లు పైబడిన వారిలో ఎక్కువగా మోతబిందు (కాటరాక్ట్‌) సమస్య ఉన్నట్టు గుర్తించారు. వీరిని శస్త్రచికిత్స చేసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. తమ వద్దకే కంటి పరీక్షలను తీసుకురావడం పట్ల పేద ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దినసరి కూలీలు, వయస్సు మళ్లిన వారికి ప్రయాస లేకుండా పరీక్షలు చేసి అక్కడే కండ్లద్దాలు ఇచ్చే ఏర్పాటు బాగుందని ప్రశంసిస్తున్నారు. శస్త్రచికిత్సకు అవసరమైన పేర్లను నమోదు చేసుకుంటూ వారిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నారు. వెలిమనేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్యశిబిరంలో ఎక్కువ మంది కాటరాక్టు, టెరిజీయం సమస్యతో బాధ పడుతున్నట్టు వారు గుర్తించారు.

Spread the love