కథా రచయిత బాలమురుగన్‌ ఇకలేరు

ప్రముఖ తమిళ, తెలుగు కథా రచయిత బాలమురుగన్‌ (86) ఇకలేరు. గత కొన్నాళ్ళుగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుది శ్వాస విడిచినట్లు ఆయన తనయుడు, తెలుగు, తమిళ సినీ రచయిత భూపతిరాజా తెలిపారు.
బాలమురుగన్‌ తమిళంతోపాటు తెలుగులోనూ పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు. వీటిలో ధర్మదాత, అదృష్టజాతకుడు, కోడలు పిల్ల, బంట్రోతు భార్యః, సోగ్గాడు, ఆలుమగలుః, సావాసగాళ్ళు, జీవన తీరాలు, కాలయముడు, పుణ్యంకొద్దీ పురుషుడుః, భార్యాభర్తలు వంటివి ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌ తొలి ప్రయత్నంగా నిర్మించిన బంట్రోతు భార్య సినిమాకి కూడా బాలమురుగనే కథ అందించారు. ఇక శోభన్‌బాబు నటించిన సోగ్గాడుః చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అలాగే ప్రముఖ తమిళ స్టార్‌ హీరో శివాజీ గణేశన్‌కి దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్‌ కథలు అందించారు. బాలమురుగన్‌కు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వీరిలో తండ్రి మాదిరిగానే సినీ రచయితగా భూపతిరాజా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. బాలమురుగన్‌ మృతిపట్ల తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Spread the love