కథ ముగిసింది

–  సెమీస్‌లో పోరాడి ఓడిన భారత్‌
– ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా
– ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌
కథ ముగిసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో భారత అమ్మాయిలు పోరాడి ఓడారు. ఉత్కంఠ సెమీస్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో టైటిల్‌ పోరుకు చేరుకుంది. 173 పరుగుల ఛేదనలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (52), జెమీమా రొడ్రిగస్‌ (43) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో మోత మోగించినా.. అదృష్టం ఆస్ట్రేలియా వైపు నిలిచింది!. అనూహ్యంగా హర్మన్‌ప్రీత్‌ రనౌట్‌తో మ్యాచ్‌ భారత్‌ చేజారింది. మూనీ (54), లానింగ్‌ (49) మెరుపులతో తొలుత ఆస్ట్రేలియా 172 పరుగులు చేసింది.
నవతెలంగాణ-కేప్‌టౌన్‌
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్‌ నిష్క్రమించింది. తొలి సెమీఫైనల్లో భారత్‌పై 5 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా ఫైనల్లోకి ప్రవేశించింది. 173 పరుగుల భారీ ఛేదనలో భారత్‌ 167 పరుగులే చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (52, 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), జెమీమా రొడ్రిగస్‌ (43, 24 బంతుల్లో 6 ఫోర్లు) ఛేదనలో కదం తొక్కారు. 28/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న భారత్‌కు గెలుపు ఆశలు కల్పించారు. హర్మన్‌, జెమీమా ఇన్నింగ్స్‌లతో భారత్‌ ఫైనల్స్‌పై కన్నేసినా.. చివర్లో కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా హర్మన్‌ రనౌట్‌గా నిష్క్రమించటంతో మ్యాచ్‌ ఆసీస్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 172 పరుగుల భారీ స్కోరు చేసింది. సులువైన క్యాచులు నేలపాలు కావటంతో బెత్‌ మూనీ (54, 37 బంతుల్లో 7 ఫోర్లు,1 సిక్స్‌), మెగ్‌ లానింగ్‌ (49 నాటౌట్‌, 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టారు. ఫీల్డింగ్‌ లోపాలకు తోడు చివరి ఐదు ఓవర్లలో 61 పరుగులు కోల్పోవటం భారత్‌ను దెబ్బతీసింది.
హర్మన్‌, జెమీమా పోరాడినా.. : భారీ ఛేదనలో ఓపెనర్లు విఫలమయ్యారు. షెఫాలీ (9), మంధాన (2) సహా యస్టికా భాటియా (4) చేతులెత్తేశారు. 28 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న భారత్‌ ఓటమికి సిద్ధమైంది. కానీ జెమీమా (43), హర్మన్‌ప్రీత్‌ (52) ఒత్తిడికి లోనవలేదు. ఎదుర్కొన్న తొలి బంతులనే బౌండరీలుగా మలిచి ధనాధన్‌ను తెరలేపారు. ఈ ఇద్దరు క్రీజులో ఉండగా భారత్‌ గెలుపు దిశగా దూసుకెళ్లింది. అర్థ సెంచరీ ముంగిట జెమీమా నిష్క్రమించినా.. రిచా ఘోష్‌ (14) తోడుగా హర్మన్‌ప్రీత్‌ చెలరేగింది. సులువైన రెండో పరుగు ముగించే క్రమంలో క్రీజు ముంగిట బ్యాట్‌ స్ట్రక్‌ కావటంతో హర్మన్‌ప్రీత్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. దీప్తి శర్మ (20 నాటౌట్‌),  రానా (11) పోరాడినా ఫలితం దక్కలేదు. 20 ఓవర్లలో 167 పరుగులే చేసిన భారత్‌ 5 పరుగు తేడాతో ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూరమైంది.
మూనీ, లానింగ్‌ మెరిసే : తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. కొత్త బంతితో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసినా.. అలీసా హీలే (25), బెత్‌ మూనీ (54) తొలి వికెట్‌కు 52 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలోనే 43 పరుగులు పిండుకున్న ఓపెనర్లు భారీ స్కోరు గట్టి పునాది వేశారు. ఏడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన మూనీ నిష్క్రమించినా.. మిడిల్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (49 నాటౌట్‌), ఆష్లె గార్డ్‌నర్‌ (31) ధనాధన్‌ జోరు చూపించారు. ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండరీలు సాధించారు. 18.5 ఓవర్లలో 150 పరుగుల మార్క్‌ దాటిన ఆస్ట్రేలియా.. చివరి ఓవర్లో 18 పరుగులు పిండుకుంది. రేణుక సింగ్‌ ఠాకూర్‌ తొలి, చివరి బంతికి సిక్సర్లు సమర్పించుకుంది. మెగ్‌ లానింగ్‌ కెప్టెన్సీ విధ్వంసం చూపించగా, గార్డ్‌నర్‌ ఐదు బౌండరీలతో చెలరేగింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి, రాధ యాదవ్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా మహిళలు : అలీసా హీలే (స్టంప్డ్‌) ఘోష్‌ (బి) రాధ 25, బెత్‌ మూనీ (సి) షెఫాలీ (బి) శిఖా 54, మెగ్‌ లానింగ్‌ నాటౌట్‌ 49, గార్డ్‌నర్‌ (బి) దీప్తి 31, గ్రేస్‌ హారిస్‌ (బి) శిఖా 7, ఎలిసీ పెర్రీ నాటౌట్‌ 2, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172.
వికెట్ల పతనం : 1-52, 2-88, 3-141, 4-148.
బౌలింగ్‌ : రేణుక సింగ్‌ 4-0-41-0, దీప్తి శర్మ 4-0-30-1, శిఖా పాండే 4-0-32-2, రాధ యాదవ్‌ 4-0-35-1,  రానా 4-0-33-0.
భారత మహిళలు : షెఫాలీ వర్మ (ఎల్బీ) స్కాట్‌ 9, మంధాన (ఎల్బీ) గార్డ్‌నర్‌ 2, భాటియా (రనౌట్‌) 4, రొడ్రిగస్‌ (సి) హీలే (బి) బ్రౌన్‌ 43, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రనౌట్‌) 52, రిచా ఘోష్‌ (సి) మెక్‌గ్రాత్‌ (బి) బ్రౌన్‌ 14, దీప్తి శర్మ నాటౌట్‌ 20, రాధ యాదవ్‌ (బి) జొనాసెన్‌ 11, శిఖా పాండే నాటౌట్‌ 1,
ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167.
వికెట్ల పతనం : 1-11, 2-15, 3-28, 4-97, 5-133, 6-135, 7-157, 8-162.
బౌలింగ్‌ : గార్డ్‌నర్‌ 4-0-37-2, మేఘన్‌ స్కాట్‌ 4-0-34-1, డార్సీ బ్రౌన్‌ 4-0-18-2, ఎలిసీ పెర్రీ 1-0-14-0, జొనాసెన్‌ 3-0-22-1, జార్జియా 3-0-29-0, తహ్లియ 1-0-13-0.

Spread the love