కదం తొక్కిన అంగన్‌వాడీలు

–  సమస్యలు పరిష్కరించాలంటూ భారీ నిరసన ర్యాలీలు
–   కలెక్టరేట్లు, ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా
–  అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి :
–  అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌ కదం తొక్కారు. ఐసీడీఎస్‌ను ప్రయివేటీకరించే కుట్రను నిరసిస్తూ.. తమ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. మూడ్రోజులపాటు సమ్మె చేపట్టారు. గురువారం రెండో రోజు భారీ నిరసన ర్యాలీలు తీశారు. అనంతరం కలెక్టరేట్లు, ఐసీడీఎస్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.
నవతెలంగాణ- విలేకరులు
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, సీఐటీయూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్య దర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట వందలాది మందితో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. 4 లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఐసీడీఎస్‌కు కేంద్రం బడ్జెట్‌ పెంచాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్‌, ఇఎస్‌ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని, జీఓ నెం 14, 19, 8ను వెంటనే సవరించాలని కోరారు.
ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి
అంగన్‌వాడీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని, ఈ విషయంపై ఈరోజే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని మాజీ ఎమ్మెల్యే జూలకటి రంగారెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ చెన్నయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడిలను తగ్గించాలని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలకే ఫుడ్‌ సరఫరా చేయాలన్నారు. నల్లగొండ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహించారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో అంగన్‌వాడీలు ధర్నా లు, ర్యాలీలు, నిరసనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలకేంద్రంలో ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. ఆమనగల్‌లో సీఐటీయూ జిల్లా నాయకులు కురుమయ్య ఆధ్వర్యంలో ఐసీడీఎస్‌ కార్యాలయం నుంచి స్థానిక బస్టాండ్‌ వరకు భారీ ర్యాలీ తీశారు. మాడ్గుల, కడ్తాల్‌, తలకొండపల్లి, ఆమనగల్‌ ఐసీడీఎస్‌ పరిధిలోని సుమారు 300 మంది అంగన్‌వాడీలుఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రాజేంద్ర నగర్‌ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. అనంతరం చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అంద జేశారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. హన్మకొండ కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన చేశారు. ములుగు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా అంగన్వాడీ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.పద్మ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌ నుండి తాసిల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జనగామ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట బైటాయించి ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పు, భోజనాలు చేసి తమ బాధలను వెలిబుచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ ప్రారంభించారు. ఈ దీక్షలో ఓ టీచర్‌ తన చంటి బిడ్డతో వచ్చి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఎదుట రెండో రోజు దిక్షా శిబిరాన్ని కొనసాగించారు. నిర్మల్‌ జిల్లా కలెక్టరేట్‌, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఐసీడీఏఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు నిరసన తెలిపారు.

Spread the love