కన్నీటి వెన్నెల

ఫ్లైట్‌ దిగి లగేజితో బైట అడుగుపెట్టిన కిరణ్‌ని అమాంతం చుట్టేశాడు శ్రీకాంత్‌.
ఎన్ని రోజులైంది రా చూసి. డిగ్రీ కాగానే ఎం.ఎస్‌ కని పోయావు. పెద్ద ఇంజనీరువై అయిదేళ్ల తర్వాత వచ్చావు అన్నాడు ఎడ్మెరింగ్‌గా చూస్తూ చేతిలోని సూట్‌కేస్‌ అందుకున్నాడు .
అమ్మా నాన్నేవన్నా కనిపించారా? ఆసక్తిగా అడిగాడు.
లేదురా. తమ్ముడు కూడా కనిపించలేదు. అసలు ఇవ్వాళ్ల వస్తున్నట్లు చెప్పావా? ప్రశ్నించాడు.
ఈ వారంలో వస్తున్నానని చెప్పాను కానీ, ఇవ్వాళ్లే వస్తున్నట్లు చెప్పలేదురా. అందుకే కాబోలు రాలేదు అబద్దమాడాడు.

కానీ ఇవ్వాళ్ల దిగుతున్నట్లు చెప్పాడు ఇద్దరికీ ఫోన్‌లో. నాన్న వయసురీత్యా రాలేక పోవచ్చు. కానీ, తమ్ముడికేమైంది? వాడికి అన్నకంటే – ఆస్తి ముఖ్యం. అది అమ్మ పేరునుంది. యాభై లక్షలైనా చేస్తుంది. అమ్మను తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటే, ఆ బల్డింగంతా తన పేరుమీదే రాయించుకోవచ్చు. నాన్న ఎట్లాగూ ఖమ్మంలోని బిల్డింగ్‌ చెరిసగం అన్నాడు వీలునామాలో. అది కోటి రూపాయలైనా చేస్తుంది. అందులో యాభై లక్షలు. మొత్తానికి కోటి రూపాయల ఆస్తి దక్కబోతుంది. అమ్మను నా దగ్గరకు రానిస్తే – తన పేరు మీదున్న బల్డింగ్‌ చెరిసగం అంటుంది. దాంతో వాడికి పాతిక లక్షలు తగ్గుతాయి. రక్త సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైపోతున్నాయి అనుకుని చిన్నగా తనలో తనే నవ్వుకున్నాడు.
ఎటు వెళ్తాంరా? అమ్మకాడికా? ఆశ్రమానికా? అడిగాడు శ్రీకాంత్‌. ఎక్కడికీ వద్దురా. అమ్మ మీద నాన్న నాన్న మీద అమ్మ – ఇద్దరి మీద తమ్ముడి ఫిర్యాదులు వినలేక చచ్చిపోతున్న ఫోన్‌లో చిన్నపిల్లల్లా కీచులాడుకుంటారు ఇప్పటిక్కూడా నాన్నకు కోపమెక్కువ అమ్మకు సహనం తక్కువ. మాతృభూమికొచ్చానన్న మనశ్శాంతే ఉండదు. ఓ వారం రోజులు గడిచాక – తిరిగి వెళ్లిపోయే ముందు కలుస్తా. భారతి మేడంని కలవాల్రా ముందు.
ఓ సారి.. చెప్పావు గదా. నువ్వింత కావడానికి తనే కారణమని. ఎక్కడుందిరా ఇప్పుడు? అడిగాడు.
అదే తెలీదురా. కలవక ఏడేండ్లు పైనవుతోంది. హైస్కూల్‌ ఫ్రెండ్స్‌ కూడా ఎవరూ కాంటాక్ట్‌ లేరు. భద్రాచలంలోనే ఉందేమో వెళ్లి కనుక్కోవాలి.
వెళదాంరా. రాముడ్ని కూడా దర్శనం చేసుకోవచ్చు అన్నాడు ఉత్సాహంగా శ్రీకాంత్‌.
కారు రిలయన్స్‌ మార్టు ముందాపాడు శ్రీకాంత్‌. కొన్నావారా ? బాగుంది స్కోడా. నాదీ బ్లాక్‌ కలరే కంపెనీ మాత్రం రేంజ్‌ రోవర్‌.
రేంజ్‌ రో …వ …రా..? ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. ఆ కారు మా దగ్గర సినిమా యాక్టర్లకే ఉంటదిరా. కోటి రూపాయల ఖరీదు.
ఆశ్చర్యపడకు. డల్లాస్‌లో ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కూడా తీసుకున్నా. అదో రెండు కోట్లుంటది. స్మూత్‌గా చెప్పాడు కిరణ్‌.
చాలా ఎదిగి పోయావురా. ఈ ఐదేండ్లల్లో ఓ పది కోట్లు సంపాదించి ఉంటావా?
అటీటుగా. అయినా డబ్బుతోనే సుఖం, శాంతి దొరకదురా. తను అనుకున్నవాళ్లు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మనకూ తప్తిగా ఉంటుంది. అమ్మా, నాన్నను చూసినప్పుడల్లా నాకదే దిగులు చెప్పాడు విచారంగా.
గాఢంగా నిట్టూర్చి కొంతమంది ముందు పంచభక్ష్య పరమాన్నాలుంటాయి. కానీ తినే ముందు కాలదన్నుకుంటారు. మీ పేరెంట్స్‌ అవసరాలకు డబ్బు పంపిస్తావు. తన పెన్షన్‌ ఎలాగూ వస్తుంది. హాయిగా ఒకరికొకరు అన్నట్లుగా ఉంటే ఎంత బాగుంటుందిరా అన్నాడు శ్రీకాంత్‌.
అప్పుడంటే ఏదో గడిచిపోయింది. ఇప్పుడు వద్ధాప్యం. ఒకరికొకరు అవసరం. అడ్జస్టు కావాలి గదా అన్నాడు కిరణ్‌ .
అవును కొంతమంది జీవితాంతం మరొకరితో అడ్జెస్ట్‌ కాలేరు అన్నాడు.
ముందు ఇంటికెళ్లి, స్నానం చేసి లంచ్‌ చేద్దాంరా. దగ్గర్లో మంచి మెస్సుంది. రాత్రికి ఫ్రండ్స్‌ వస్తారు. అందరం కలిసి హైద్రాబాద్‌ బిర్యాని తిందాం ఓకేనా…..? అన్నాడు శ్రీకాంత్‌ ఉత్సాహంగా .
సరే ….. ముందు రూంకెళ్లి రెస్టు తీసుకోవాల్రా. బాగా అలసటగా వుంది అన్నాడు సీట్లో వెనక్కు వాలుతూ.
ఉదయమే కారు హైద్రాబాద్‌ నుంచి బయలు దేరింది. శ్రీకాంత్‌ డ్రైవింగ్‌లో ఉన్నాడు. వెనకసీట్లోంచి పెరిగిన నగరాన్ని ఆసక్తిగా చూడసాగాడు కిరణ్‌.
ఒక మాటంటాను ఏమనుకోకురా. నాక్కూడా ఎంతోమంది ఎల్‌ కే జి కాడ్నించి కాలేజి దాకా చెప్పారు అయినా నేనెప్పుడూ వాళ్లని వెళ్లి కలవలేదు. అది వాళ్ల డ్యూటి. మనం ఫీజులు పే చేశాం. వాళ్లు చదువు చెప్పారంతే. దానికే ఏదో ఋణ పడున్నట్లు వెదుక్కుంటూ వెళ్లడం అవసరమంటావా? వచ్చినందుకు ఆ దైవ దర్శనం చేసుకుని, వచ్చేస్తే పోలే అన్నాడు కిరణ్‌ వైపో లుక్కేసి.
మరోసారి ఆ మాటనకురా భారతి టీచరంటే నాకు అమ్మకంటే ఎక్కువరా అసలు నేను ఫీజు కట్టిందెక్కడరా? మా స్కూలు ఐకాన్‌ అని నా నుంచి ఎప్పుడూ ఫీజు తీసుకోలే. జాయినింగ్‌లో ఏం కట్టాడో నాన్న. నాకు చదువుతో పాటు సంస్కారం, పెద్దల ఎడల పాటించవలసిన గౌరవం, సంఘంలో మెలగ వలసిన తీరు, భవిష్యత్తును దిద్దుకోవలసిన తెలివి – ఇలా ఒక్కటి కాదు – నా ప్రతి అడుగులో, ప్రతి నిర్ణయం వెనుక మా భారతి టీచర్‌ చెప్పిన మాటలు, చూపించిన మార్గమే ఉంది . ఇంట్లో అమ్మా,నాన్న గొడవలతో వేదనపడితే టీచర్‌ వద్ద శాంతి దొరికేది. నా నిద్ర లేని రాత్రులకు తన దగ్గరే ఓదార్పు కలిగేది. అందుకే తనంటే అంత భక్తిరా అన్నాడు. కిరణ్‌ కనుకొనకుల్నుండి రెండు కన్నీటి చుక్కలు రాలి చెంపల మీద పడ్డాయి.
సారీరా. హర్ట్‌ చేశానా? మరెప్పుడూ టీచర్‌ గార్ని తక్కువ చేసి మాట్లాడను సరేనా ? అన్నాడు అప్పాలజికల్‌టగా.
నా జీవితంలో తన ఇంపార్టెన్స్‌ తెలీదు కదా… చెబుతా విను. మా అమ్మ కంటే ముందే పెద్దమ్ముండేది. తనకూ, నాన్నకూ తగాదా అయి విడిపోయారు పెద్దమ్మ ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తరువాత నాన్న వయసు బాగా తక్కువ చెప్పి అమ్మను పెండ్లి చేసుకున్నాడట. అమ్మమ్మ వాళ్లు బీదవాళ్లు గావడంతో గవర్నమెంట్‌ ఉద్యోగం ఉందని, కట్నం అడగడం లేదని ఇచ్చి చేశారు. దాదాపు ఇరవై ఏండ్ల తేడా. దాంతో ఆలోచనల్లో కూడా తేడానే. అమ్మ మూడో తరగతి చదివిందంతే. నాన్న సెవెన్త్‌ వరకూ చదివాడు. ఉద్యోగం చేసేవాడు కనుక లోక జ్ఞానం ఎక్కువ. ఎంక్వయిరీ చేసి, భారతి పబ్లిక్‌ స్కూల్లో చేర్చాడు మొదట నన్ను తర్వాత రెండేండ్లకు తమ్ముడ్ని. రెండో తరగతిలో మొదటిసారి మా క్లాసుకొచ్చింది టీచర్‌. ఆరోజే నాలోని స్పార్క్‌ను కనిపెట్టి, క్లాసు లీడర్ని చేసింది. నేను ఎప్పుడూ క్లాసు ఫస్టే.
ఐదో తరగతిలోననుకుంటా …. మా ఇంట్లో ఫిలిప్స్‌ రేడియో ఉండేది. దాంట్లోంచి పాటలు వస్తుంటే అందులో మనుషులు న్నారేమోననుకునే వాడ్ని. వాళ్లను చూడాలనుకుని స్క్రూ డ్రైవరు తీసుకుని వెనకాల స్క్రూలు విప్పాను. అందులో ఎవరూ కనబడలేదు కానీ నాన్న కనపడ్డాడు ఎదురుగా అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి నేను చేస్తున్న పని చూశాడు. పట్టలేని కోపంతో వీపు మీద రెండు దెబ్బలేశాడు. నేను ఏడుస్తూ, అమ్మ చాటుకు వెళ్లాను. ఉన్న కాడ ఉండడు. మొన్న పంపూడబీకాడు. ఇంకోటి అంటించండి అంది ఎగదోస్తూ నాన్న కొట్టబోగా, కేకలు పెట్టుకుంటూ బజార్న పడ్డాను. నాన్న వెంట పడ్డాడు బూతులు తిడుతూ. అప్పుడే స్కూలు నుండి వస్తోంది భారతి టీచర్‌. తనుండేది మా ఇంటికి రెండ్లిడ్లవతల్నే. భయంతో ఏడుస్తూ వెళ్లి తన చాటున దాక్కున్నాను.
ఏం చేశాడో తెలుసాండీ. చక్కగా పాడే రేడియోని విప్పి పాడు చేశాడు. ఇప్పుడది వందలేందే బాగుకాదు అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లు. ఆమెకు అర్ధమైపోయింది సమస్య. ఇలాంటి పిల్లలేనండి రేపటిరోజు సైంటిస్టులయ్యేది. బుర్ర ఉన్నోడే ఆలోచిస్తాడు. మీ వాడు ఎంత తెలివైనోడని… అన్ని సబ్జెక్టుల్లోనూ ఫస్టే. టీచరలా అనేసరికి నాన్న కోపం తగ్గిపోయింది. శంకరం గారూ మీ రిపేరు డబ్బులైతే నేనిస్తా కానీ, బాబును కొట్టకండి. మంచి పిల్లవాడు అని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది.
నాన్నకు మొదట్నుంచే పిచ్చి కోపం. చేతిలో ఏదుంటే, అది తీసుకుని విసిరేసేవాడు. అమ్మకోసారి చెక్కపీట తీసుకుని విసిరేస్తే తలకు చిల్లి పడ్డది. మా బాల్యమంతా అమ్మా నాన్న తగాదాలతోనే గడిచింది. అందుకే ఎక్కువగా టీచర్‌ గారింట్లోనే ఉండేవాడ్ని. హోం వర్కు చేసుకుంటూ అక్కడే నిద్రపోయేవాడ్ని టీచర్‌ లేపి, అన్నం తినిపించి, తన దగ్గర పడుకోబెట్టుకునేది. లింకన్‌ గురించి, వివేకానందుడి గురించి చెప్పి, జీవితంలో సాధించాలనుకున్న లక్ష్యం ముందు అన్నీ చిన్నవే. గొప్పవాళ్లంతా కన్నీళ్లు కార్చే పైకొచ్చారని చెప్పేది నేను బాధపడ్డప్పుడు. ఆమె చెప్పే ప్రతి వాక్యం భగవద్గీతలా నాకు మార్గదర్శకం అయింది. ఎక్కడ డిబేటింగ్‌, ఎస్సే, క్విజ్‌ పోటీలున్నా నన్ను వెంటబెట్టుకుని వెళ్లేది. పాల్గొన్న ప్రతి ఈవెంట్లో ప్రైజ్‌ తీసుకొని వచ్చేవాళ్లం.
తనకు పిల్లల్లేరు. సారు వాళ్ల చెల్లెలు కూతుర్ని తెచ్చి పెంచుకున్నారు. నేను సిక్త్స్‌లో వున్నప్పుడు తను నైంత్‌లో వుంది టౌన్‌లో చాలా కాలం రెండే ప్రైవేటు స్కూళ్లున్నాయి. స్ట్రెంత్‌ బాగుండేది మా హైస్కూల్లో మేడం భర్త వాసు గారు ఫిజిక్స్‌, మేథ్స్‌ బాగా చెప్పెవాడు. తనక్కాస్తా మందలవాటుండేది. సిగరెట్‌ కూడా కాల్చేవాడు.
ఓసారి టౌన్‌ కాన్వెంట్‌ స్కూల్లో హైస్కూల్స్‌ మీట్‌ జరిగింది. దాదాపు 23 స్కూల్స్‌ పాల్గొన్నాయి. మా స్కూలు నుంచి నేనూ, మరో ఆరుగురం పాల్గొన్నాం. నాకు నచ్చిన జాతీయ నాయకుడు అనే అంశం మీద మాట్లాడినప్పుడు ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. క్విజ్‌లో కూడా మా స్కూల్‌ టీంకే చివరి రోజు కలక్టర్‌ వచ్చాడు బహుమతి ప్రధానోత్సవానికి. నాన్న కూడా వచ్చాడు చూద్దామని. అప్పటికే క్విజ్‌లో, వ్యాసరచనలో, వాలీబాల్‌లో ప్రైజులు తీసుకున్న నన్ను ఆశ్చర్యంతో చూశాడు. డిబేటింగ్‌కు బహుమతి ఇచ్చేప్పుడు ఏ టాపిక్‌ మీద మాట్లాడావు అనడిగాడు. చెప్పాను. ఏదీ ఇక్కడ మాట్లాడు అన్నాడు. నేను గాంధీ గారి గురించి ఇంగ్లీషులో అనర్ఘళంగా మాట్లాడాను. వెంటనే చప్పట్లు కొడుతూ, కుర్చీలోంచి లేచొచ్చి షేక్‌ హేండిచ్చాడు. నాన్నను వేదిక మీదకు పిలిచి, మెమెంటో సర్టిఫికెట్‌తో పాటు తన జేబులోని వెయ్యి రూపాయలు ఇచ్చాడు. ముగ్గురం ఫొటో దిగాం కలక్టర్‌తో. వేదిక దిగాక నాన్న భారతి టీచర్‌ చేతులు పట్టుకుని నా కొడుకుని రత్నంలా తయారు చేశావమ్మా. మిమ్ము జీవితాంతం మరిచిపోము అని కంట నీరు పెట్టుకున్నాడు.
మీ వాడు పుట్టుకతోటే రత్నమండీ. నేను పైనున్న మసి తూడ్చానంతే. వీడు గొప్పవాడవుతాడు. చదువునాపకండి అని హిత బోధ చేసింది. టెన్త్‌ స్టేట్‌ సెకండ్‌ ర్యాంకు వచ్చింది. స్కూల్లో ఘన సన్మానం జరిగింది. టీచరప్పుడు నాకు కోటు ప్రజంట్‌ చేసింది. ప్యూచర్‌లో నువ్వు కోటు వేసుకునే స్థాయి ఉద్యోగమే చేయాలని చెబుతూ. అందరం కలిసి ఫేమిలీ ఫొటో తీసుకున్నాం. ఇప్పటికీ అది భధ్రంగా ఉంది నా దగ్గర.
ఇంటర్‌కు కార్పొరేటు స్కూల్లో ఫ్రీ సీటు వచ్చింది నాకు. భారతి మేడం పెంచుకున్న సరళ పెళ్లి కోసం స్కూలు కాగితాలు బ్యాంక్‌లో పెట్టి అప్సు తెచ్చి మరీ పెళ్లి చేశారు. బీదవాళ్లన్నా, బాగా చదివే పిల్లలన్నా ఫీజు తీసుకునేది కాదు టీచర్‌. దీంతో చాలా మంది పేరెంట్స్‌ బీద వాళ్లమనే కథలు వినిపించి ఫీజులు ఎగ్గొట్టేవారు. అందుకే పెద్దగా ఏమీ సంపాదించలేదు స్కూల్‌ మీద. కొద్దికాలం తర్వాత మరో మూడు ప్రైవేటు స్కూళ్లు వెలిశాయి హంగూ ఆర్భాటాలతో. నేను చదివిన స్కూలుకు స్ట్రెంత్‌ తగ్గింది. స్కూల్‌లో టీచర్స్‌కు జీతాలు ఇవ్వడం కూడా కష్టమైంతుందని, మా ఇంటి పక్కన రెంటుకున్న సుబ్బారావు వద్ద లక్ష రూపాయలు వాసు సారే స్వయంగా వచ్చి వడ్డీకి తీసుకుని వెళ్లడం స్వయంగా చూశాను. స్కూలు కష్టాల్లో ఉండగానే వాసు సార్‌కు థ్రోట్‌ కేన్సర్‌ ఎటాకైంది. స్కూలు నిర్వహించడం కష్టమై పోతుందని అమ్మేశారు. అందులో పనిచేసే మాస్టారే కొన్నాడు చౌకగా ఎకరం విస్తీర్ణంలోని పాఠశాలను పద్దెనిమిది లక్షలకే. బ్యాంక్‌లోను, అప్పులు పోను ఎనిమిది మిగిలాయంట. వాసు సార్‌ వైద్యం కోసం ఆ మొత్తం క్రమేపీ ఖర్చు చేస్తున్నట్లు నాన్నతో టీచర్‌ చెబుతుంటే విన్నాను.
ఇంతలో నాన్న ఆఫీసులో పరిస్థితులు మారాయి. తను ఫోర్త్‌ క్లాసు యూనియన్‌కు మొదట్నుంచీ లీడరుగా ఉండేవాడు. క్లర్కులు పని చెప్పాలంటేనే భయపడేవారు. ఆఫీసర్లు చెప్పినా లెక్క చేసేవాడు గాదు. ఏదో ఒక వీక్నెస్‌ పట్టుకుని బెదిరించేవాడు డబ్బులు ఆఫీసు వాళ్లకు వడ్డీకిచ్చి, కఠినంగా వసూలు చేసేవాడు. అప్పుడే కేరళ నుంచి కొత్తగా, బదిలీ మీద జిల్లా అటవీ శాఖాధికారి వచ్చాడు. చాలా స్ట్రిక్ట్‌ ఆఫీసరు. ఇన్‌స్పెక్షన్‌కొచ్చినప్పుడు నాన్న లేడు. అదే అదనుగా నాన్న మీదున్న కోపాన్నంతా ఆఫీసరు ముందు వెళ్లగక్కారు. వెంటనే సస్సెండ్‌ ఆర్డర్స్‌ ఇచ్చి వెళ్లాడు. జీతం లేక దివాలుగా తిరిగేవాడు. అప్పుడే నాకు ఎంసెట్‌లో మంచి రేంక్‌ వచ్చి, అనంతపురం జెఎన్‌టియూలో సీటోచ్చింది. నాన్న సంతోషంగా వెళ్లి చెప్పాడు. నాకు తెలుసు తప్పక వస్తుంది అని స్వీటు ఇచ్చింది టీచర్‌ ఇద్దరికి.
ఓ నాడు ఉదయమే నన్ను వెంటబెట్టుకుని వెళ్లి సస్పెండై నాలుగు నెల్లు జీతం లేదు. బాబును జాయిన్‌ చేయాలి. ఓ పదివేలు బదులు ఇవ్వగలరామ్మా. జీతం వచ్చాక ఇస్తాను అనడిగాడు. డబ్బు తేవడానికి వెంటనే లోపలకు వెళ్లింది మరో మాట మాట్లాడకుండా.
ప్రస్తుతం నా దగ్గర అంత క్యాష్‌ లేదు కానీ, ఈ చంద్రహారం అమ్మి ఫీజు కట్టు అని మెళ్లో గొలుసు తీసి ఇచ్చింది. నాన్న ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టాడు. ఇంటికి తెచ్చి దాన్ని అమ్మ మెళ్లో వేశాడు. తన దగ్గరున్న డబ్బుతోనే యూనివర్సిటీలో ఫీజు కట్టాడు.
మరుసటి రోజు అనంతపురంలో జాయిన్‌ కావడానికి వెళ్లేప్పుడు టీచర్‌ దగ్గరకు వెళ్లాం. నన్ను గుండెలకు హత్తుకుని కంట నీరు పెట్టుకుంది. మేము ఇక్కడ్నించి వెళ్లిపోతున్నాం కిరణ్‌. మళ్లీ కలుస్తామో లేదో అంది బాధగా.
నేను బేరమని ఏడ్చాను. మీరిక్కడ్నించి వెళ్లొద్దు టీచర్‌. నేను డిగ్రీ కాగానే ఉద్యోగం తెచ్చుకుంటా. అందరం కలిసే ఉందాం టీచర్‌ అన్నాను.
చాలు నాన్నా. పెంచినవాళ్లు అనకున్నా, నా కడుపున పుట్టిన కొడుకులా అభయమిచ్చావు. సారుకు ఆరోగ్యం బావోలేదు. హాస్పిటల్‌కు తిరగలేక పోతున్నాం. అందుకే విజయవాడ వెళ్లి పోతున్నాం అన్నది. గబగబా ఇంట్లోకి వెళ్లి, నా జ్ఞాపకంగా ఈ పార్కర్‌ పెన్‌ ఉంచుకో. నాకిది టెన్త్‌ ఫస్టొచ్చినప్పుడు మా అమ్మ కొనిచ్చింది. ఇప్పుడు అమ్మ కాని అమ్మను ఇస్తున్నాను తీసుకో అంది కన్నీళ్లు తుడ్చుకుంటూ. టీచర్‌ భుజంపై తలవాల్చి చాలా సేపు ఏడ్చాను. తనే కన్నీరు తుడిచి యూని వర్సిటీకి సాగనంపింది.
మరుసటి రోజే వాళ్లు ఇల్లు ఖాళీ చేసి, సామానుతో వెళ్లిపోయారు. మేము తిరిగి వచ్చేసరికి ఇంటికి టులెట్‌ బోర్డు వేలాడు తోంది. చాలా రోజుల దాకా మనిషిని కాలేకపోయాను. అప్పుడప్పుడూ ఫోన్‌లు మాత్రం చేసి ధైర్యం చెబుతుండేది. తర్వాత, ఎందుకో తనే చేయడం మానే సింది. నేను చేస్తే ముభావంగా సమా ధానం చెప్పేది. తర్వాత సారు పోయాడని తెలిసింది. వెళ్లి చూడలేక పోయాను – పరీక్షల టైం తన ఫోన్‌ నెంబర్‌ కూడా మారింది. ఎక్కడుందో తెలీదు. తెలిసిం దల్లా ఒకే ఒక్క ఆధారం స్కూలు పేపర్స్‌ మీదేవో సంతకాల కోసం శ్రీనివాసు సార్‌ వెళ్లి వచ్చాడట. వెళ్లి కలిస్తే ఏవన్నా ప్రయో జనం ఉంటుందేమో? చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడు.
ఓ విద్యార్థిని ఇంతగా ప్రేమించే టీచరుందంటే నమ్మలేక పోతున్నాను సారీరా….. అన్నాడు శ్రీకాంత్‌.
ఇట్సాల్‌రైట్‌ అన్నాడు కిరణ్‌.
భద్రాచలం రావడంతో గోదావరి ఒడ్డున కారు నిలిపి, స్నానం చేసి దైవ దర్శనం చేసుకున్నారు. తనుపుట్టి పెరిగిన ఇల్లునోసారి ఆప్యాయంగా చూసుకు న్నాడు. రెవిన్యూ డిపార్ట్మెంట్‌ ఉద్యోగి కిరా యికి ఉంటున్నాడు. అక్కడ్నించి స్కూలుకు వెళ్లారు. లక్కీగా హెచ్‌.ఎం. ఉన్నాడు.
సంతకం కోసం వెళ్లిన మాట వాస్తవమే. సింగ్‌ నగర్‌లో చెల్లెలు ఇంట్లో ఉంది నే వెళ్లినప్పుడు. బాగా చిక్కిపోయింది. మనిషేం బాగలేదు. చెల్లెలు భర్త రైల్వేలో చేస్తాడట. వాళ్లకూ వైజాగ్‌ ట్రాన్సఫరైంది. రిలీవ్‌ కావడమే తరువాయి అన్నారు. బహుశా మీరు వెళ్లినా కలవక పోవచ్చు అన్నాడు శ్రీనివాసు.
నిరాశగా తిరిగొచ్చి, గోదావరి ఇసుక తిన్నెల మీద కూర్చుని ఆలోచించ సాగారు ఇద్దరూ.
ఒకటే మార్గంగా. పేపర్‌లో యాడ్‌ ఇవ్వడం. అన్ని వాట్సప్‌ గ్రూపుల్లోనూ టీచర్‌ ఫొటో పెట్టి పార్వర్డ్‌ చేయడం. తప్పక సమాచారం వస్తుందనే నా నమ్మకం అన్నాడు శ్రీకాంత్‌.
రేపు ఆ పని చేద్దాం కిరణ్‌ అనడంతో ఇద్దరూ కారు వైపు నడిచారు.
మరుసటి రోజు కారేసుకుని హడా విడిగా వెళ్లాడు కిరణ్‌ తండ్రి ఫోన్‌ చేయడంతో ఓల్డేజీ హోంకు.
ఏడి డాడీ ? అర్జంటుగా రమ్మని ఫోన్‌ చేశాడు అన్నాడు.
శంకర్రావుగారి అబ్బాయి మీరే కదా? రండి చూడండి. మీ నాన్న వెళ్లేముందు ఏం చేశాడో? రెండు కుండీల్ని పగల గొట్టాడు. మా వర్కర్ని కొట్టాడు. మమ్మల్ని బూతులు తిట్టాడు నిర్వాహకుడు ఎదురు గా వచ్చి వెళ్లబోసుకున్నాడు.
ఇంతకూ ఏం జరిగింది?
అందరికి చేసిన టిఫిన్‌ పెడతామా? అది నచ్చదు. ఇది గాడిదలు కూడా తిన వంటాడు. ఇక్కడ తినేవాళ్లంతా గాడిద లాండి? వర్కరు రూం క్లీన్‌ చేడానికి వెళితే, మందు తెమ్మంటాడు. ఇక్కడ అలాం టివి అనుమతించరని చెబతే చెంపమీద కొట్టాడు. మేము హోం పెట్టి పన్నెండేళ్లయింది. కానీ మీ నాన్నలాంటి టిపికల్‌ కేసు ఇంతవరకూ చూడ్లేదు. అందుకే దండం పెట్టి సాగ నంపాము. మాకున్న గుడ్‌ విల్‌ చూసి వెంటనే రూమ్స్‌ ఫిల్లవుతాయండి. మీ నాన్న అలా వెళ్లాడా? ఆ మేడం వచ్చి జాయినైంది అన్నాడు. ఆమె వైపు చూడాలనిపిం చలేదు వాళ్ల నాన్న గురిం చలా నెగెటివ్‌గా మాట్లాడేసరికి.
లగేజి తీసుకెళ్లి పోయాడా? అడిగాడు కిరణ్‌ దాలు వేస్తూ.
మొత్తం తీసుకెళ్లాడు కానీ, బి పి మిషన్‌ మర్చిపొయ్యాడు. రండి రూం చూసుకుందురు కానీ” వైపు దారి తీశాడు నిర్వాహకుడు.
అని వరండా రూంలోకి వెళ్తున్నవా డల్లా టేబుల్‌పైన అప్లికేషన్‌, దాని మీద ఫొటో చూసి హఠాత్తుగా ఆగిపోయాడు.
”భారతి మేడం అప్లికేషన్‌ ఇక్కడుం దేంటి?” అడిగాడు నిర్వాహకుడ్ని .
”తను మీకు తెలుసా? వారం క్రితం వరకూ పక్కనున్న లేడీస్‌ హోంలోనే వుండేది. అది కూడా మాదేననుకోండి. నెలవారి డబ్బు కట్టలేదు. బైటకు పంపించాం. అప్పటికీ వారం గడువి చ్చాం. వైజాగ్‌ నుంచి డబ్బులు వస్తాయం టుంది మాకూ ఖర్చులుంటాయి కదండీ? వర్కర్లకు జీతాలు, కరెంటు బల్లులూ…” చెప్పుకు పోతున్నాడు.
”ఎటు వెళ్లిందో చెప్పగలరా?” ఆతుర తగా అడిగాడు కిరణ్‌ కండ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా.
”తెలీదండీ. లగేజి కూడా ఎక్కువేం లేదు. చిన్న సంచిలో రెండు చీరలంతే. ఇక్కడ్నించి పంపించి వేయబడ్డ వాళ్లంతా ఆ మూల మీద రామాలయం మెట్ల మీద….” నిర్వాహకుడి మాట పూర్తి కాకుండానే, కిరణ్‌ బైటకు పరిగెత్తాడు కన్నీళ్లు వర్షిస్తుండగా. అతనికి వెళ్లే మార్గామంతా మసక మసకగా కనిపించ సాగింది.

– పుప్పాల కృష్ణమూర్తి, 9912359345

Spread the love