కరెంటు చార్జీలపై ఫిబ్రవరి 20 నుంచి బహిరంగ విచారణలు

– అభ్యంతరాలను జనవరి 31లోపు పంపాలి-టీఎస్‌ఈఆర్సీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) సమర్పించిన 2023-24 వార్షిక ఆదాయ అవసరాల ప్రతిపాదనలు (ఏఆర్‌ఆర్‌), 2016-17 నుంచి 2022-23 వరకు ఇచ్చిన కరెంటు కొనుగోళ్ల ట్రూఅప్‌ చార్జీలపై 2023 ఫిబ్రవరి 20 నుంచి బహిరంగ విచారణలు చేపట్టనున్నారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే 2023 జనవరి 31వ తేదీలోపు సమర్పించాలని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) పేర్కొన్నది. సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం (సెస్‌)పై బహిరంగ విచారణ ఫిబ్రవరి 20వ తేదీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరుగుతుంది. ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) ప్రతిపాదనలపై ఫిబ్రవరి 22వ తేదీ హన్మకొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బహిరంగ విచారణ జరుగుతుంది. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ప్రతిపాదనలపై ఎర్రగడ్డలోని టీఎస్‌జెన్‌కో ఆడిటోరియంలో జరుగుతుంది. పై బహిరంగ విచారణలు అన్నీ ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయని టీఎస్‌ఈఆర్సీ తెలిపింది.

Spread the love