– సమీపిస్తోన్న అధ్యక్ష ఎన్నికలు
– బుధవారం రాత్రి ఢిల్లీకి రాహుల్
– ఇప్పటికే అధ్యక్ష పదవికి ఇద్దరు కీలక నేతలు సై
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీలో సమీకరణాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ పోటీ చేయటంపైనే చర్చ జరిగినప్పటికీ, చివరికి ఆయనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు రాహుల్‌ను బుజ్జగిస్తూనే, మరోవైపు రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర పీసీసీలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తే, రాహుల్ బరిలో నిలుస్తారని ఊహగనాలు వినిస్తోన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను ఢిల్లీకి అకస్మాత్తుగా పిలిచారు. మంగళవారం నాడిక్కడ సోనియాగాంధీ నివాసం(జన్‌పథ్10)లో ఆమెను కెసి వేణుగోపాల్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్ష ఎన్నికలపై చర్చించారు. అనంతరం కెసి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధ్యక్ష పదవికీ రాహుల్ గాంధీ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.