ఎన్నికల సీజన్ షురువైంది. స్థానిక నాయకుల సామాజిక కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. టికెట్ దక్కించుకునేందుకు నాయకులు అపసోపాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల మధ్య సంభాషణ ఇలా జరిగింది. ‘అన్న మీకు టికెట్ వస్తుందంటావా? సీఎం సార్ టికెట్ ఇస్తాడో, లేదో అనే అనుమానం కలుగుతుంది?’ అదేంది తమ్మి అట్లా అంటావు? ‘నీకు రాకపోతే ఇంకెవ్వరికి వస్తుంది?’ ఏమో అన్న సిట్టింగులకు ఇస్తామని సీఎం కేసీఆర్ గారు చెప్పిండు. ‘కానీ ఆయనపై ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి.’ అదేంది తమ్మి ఆయన సీఎం… ఆయనపై ఏం ఒత్తిడి ఉంటుంది? ‘అయ్యో అన్న ఎందుకుండదు.’ ప్రతి నియోజకవర్గానికి ఐదారు మంది నాయకులు పోటీకి రెడీ అవుతున్నారు. అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. సీట్లకు మించి కూర్చొవడంతో కారు బరువెక్కిపోయింది. కారులో ఇర్కటంగా కూర్చోవడంతో టైర్లలో గాలి తగ్గిపోయి బండి ఊగుతుంది. ఎప్పుడు టైర్లు బ్లాస్ట్ అవుతాయో తెలియదు.కారు ఇంజిన్ వేడికెక్కి పొగలు కమ్ముతుంది. అంటూ స్థానిక పరిస్థితిని వివరించాడు. సిట్టింగులకు సీట్లు ఇస్తే కొంత మంది కారు దిగిపోయే ప్రమాదం ఉందని చెప్పకనే చెప్పాడు. దిగకపోతే కారుకు ఇబ్బంది కల్గుతుంది. ఈ పరిస్థితుల్లో కారు నుంచి ఒక్కరిద్దరైనా దిగకపోతారా? అనే ఆశతో కొన్ని పార్టీలు గుంటనక్కలా కాచుకుని కూర్చున్నాయి. గులాబీకారులో పోటీ ఎక్కువాయే. టికెట్ వస్తుందో, రాదో ఏమీ అర్థం కావడం తమ్మీ. అంటూ సీరియెస్గా చర్చించుకున్నారు.
– గుడిగ రఘు