కార్పొరేట్ల కోసమే…

– కేంద్రం సహకార సంఘాల ముసాయిదా బిల్లు
– తక్షణమే ఉపసంహరించుకోవాలి: రౌండ్‌టేబుల్‌ సమావేశంలో టి సాగర్‌, నంద్యాల డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశంలోని సహకార వ్యవస్థ మొత్తాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం ‘బహుళ రాష్ట్ర సహకార సంఘాల బిల్లు-2022ను తీసుకొచ్చిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ బిల్లులోని సహకార సంఘాల నమూనా నియమ నిబంధనలను కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా రూపొందించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇదే అంశంపై రౌండ్‌ టేబుల్‌ నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సాగర్‌, నంద్యాల మాట్లాడుతూ రాష్ట్ర జాబితాలో సహకార సంఘాలను తమ చేతిల్లోకి లాక్కునేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. ఉనికిలో ఉన్న ప్రాథమిక సహకార సంఘాలు బహుళ రాష్ట్ర సహకార సంఘాల్లో కలిసేలా ఈ బిల్లు అవకాశం కల్పించిందన్నారు. సహకార సంఘాల ఎన్నికలకు కేంద్రమే యంత్రాంగాన్ని సిద్ధం చేస్తుందన్నారు. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం రాష్ట్రాలను సంప్రదించలేదని విమర్శించారు. సహకార బ్యాంకుల్లో ఉన్న లక్షల కోట్ల డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. వ్యవసాయ, మత్స్య, గొర్రెల మేకల పెంపకం, పాడి రైతుల సహకార సంఘాలన్నింటిలోనూ సామాన్య రైతులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం 18శాతం వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కనీసం 10 నుంచి 12శాతం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈనేపథ్యంలో రైతులకు ఉపయోగకరంగా ఉన్న సహకార బ్యాంకులను కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై జిల్లా, మండల స్థాయిలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సదస్సులు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాదరావు, సహకార విద్యాపీఠం నాయకులు భూమన్న, డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్‌రాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు ఎండీి సర్దార్‌,ఏఐకేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. ధర్మానాయక్‌, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అమీర్‌పేట్‌ మల్లేష్‌ తదితరులు మాట్లాడారు.

Spread the love