కుల వివక్షపై తొలి అడుగు

–  వివక్షను నిషేధిస్తూ ప్రవాస భారతీయురాలి ప్రతిపాదన..ఆమోదం
– అమెరికా చరిత్రలోనే ప్రథమ నగరంగా నిలిచిన సియాటెల్‌
వాషింగ్టన్‌ : అమెరికాలో చారిత్రక సందర్భానికి సియాటెల్‌ నగరం తొలి అడుగువేసింది. కుల వివక్షను చట్ట విరుద్ధంగా ప్రకటించిన తొలి అగ్రరాజ్య నగరంగా సియాటెల్‌ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నది. సియాటెల్‌ వివక్ష వ్యతిరేక చట్టాల్లో ఇప్పుడు కుల వివక్ష కూడా చేర్చింది. సియాటెల్‌ నగరంలో వివక్ష వ్యతిరేక చట్టాల్లో కులాన్ని జోడించాలని ప్రవాస భారతీయురాలు, సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. అమెరికాలో వివక్ష చట్టాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కులతత్వానికి సంబంధించిన చట్టాలు మాత్రం స్పష్టంగా లేవని పేర్కొన్నారు. కాగా క్షమా సావంత్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి సియాటెల్‌ నగరంలో మంగళవారం జరిగిన ఓటింగ్‌లో సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో ఆమోదించింది.కుల వివక్షను చట్ట వ్యతిరేకంగా ప్రకటించడం వల్ల దక్షిణాసియా ప్రవాసులకు, ముఖ్యంగా భారతీయులు, హిందూ సంఘాల ముఖ్యమైన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కౌన్సిల్‌ అభిప్రాయపడింది. కుల వివక్ష వ్యతిరేక పోరాటం అన్ని రకాల అణచివేతల వ్యతిరేక పోరాటంతో ముడిపడి ఉన్నదని క్షమా సావంత్‌ తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలు, ఉద్యోగ కార్యాలయాల్లో దక్షిణాసియా అమెరికన్లు, వలస కార్మికులు కుల వివక్ష ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. భారత్‌లో 70 ఏండ్ల కిందట కుల వివక్షను నిషేధించారని.. అయినా ఇప్పటికీ పక్షపాతం కొనసాగుతూనే ఉన్నదని ఆమె గుర్తు చేశారు. కుల వివక్షపై సియాటెల్‌ నగరం చారిత్రక నిర్ణయం తీసుకున్నందున ఈ విజయాన్ని దేశవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉన్నదని క్షమా సావంత్‌ వ్యాఖ్యానించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి 200 సంస్థలు మద్దతు తెలపగా అందులో 30 కంటే ఎక్కువ అంబేద్కరైట్‌ సంస్థలు ఉన్నాయి. అమెరికాలో ప్రవాస భారతీయులు రెండో అతిపెద్ద విదేశీ సమూహంగా ఉన్నారు. 2018 గణాంకాల ప్రకారం అమెరికాలో 42 లక్షల మంది భారత సంతతి ప్రజలు జీవిస్తున్నారు.మిగతా చోట్లా ఇలాంటి ప్రతిపాదనలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

Spread the love