– సాగునీటి ప్రాజెక్టులకు సహాయ నిరాకరణ
– పోయే పన్నులెక్కువ..వచ్చే రొక్కం తక్కువ ొ కేసీఆర్ ప్రభుత్వం గరంగరం – అప్పులకూ మోడీ సర్కారు ససేమిరా
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కారు వైఖరీతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ నుంచి పోయే పన్కులెక్కువ కాగా, ఢిల్లీ నుంచి వచ్చే రొక్కం మాత్రం చాలా తక్కువగా ఉంటున్నది. అంతేగాక సాధారణ కేటాయింపులు సైతం అత్తెసరే. దీంతో గులాబీ ప్రభుత్వం కేంద్రంపై గుర్రుమంటున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్రం ఉత్తచేయి చూపిస్తుండటంతో సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంలో ఉన్నారు.
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రతిష్టాత్మంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఇతర పథకాలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలంటూ పలుమార్లు స్వయంగా సీఎం, మంత్రులు ప్రధాని మోడీతోపాటు ఇతర కేంద్ర మంత్రులనూ కలిశారు. పదే పదే వినతులూ ఇచ్చారు. అయినా కేంద్రం కనీకరించలేదు. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి ప్రతియేటా వచ్చే నిధులకు గండీ కొట్టింది. రాష్ట్రాల ఆదాయాన్ని తన నియంత్రణలోకి తీసుకుని సమాఖ్య స్వభావాన్ని దెబ్బతిసింది. కేంద్రం ఇవ్వకపోగా, అప్పులు చేయడానికి సైతం ఎఫ్ఆర్బీఎం నిబంధనల పేర ఆటంకాలు సృష్టిస్తూ రాజకీయ కక్షకు పూనుకుంది.
కేటాయింపులు …ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం గత ఏనిమిదేండ్లుగా సాగునీటి పథకాలకు భారీ కేటాయింపులు చేస్తూ వస్తున్నది. అయితే కేంద్రం సహకారం లేకపోవడంతో అనుకున్న మేర ఖర్చు చేయలేకపోయింది. నిధుల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రుణాలు తెస్తున్నది. 2014-15 నుంచి 2022-23 దాకా 153508.97 కోట్లు కేటాయించి, రూ.118647.48 కోట్లు ఖర్చు చేసింది. అంటే దాదాపు 34861.49 కోట్లు తక్కువగా చేసింది. బడ్జెటేతర రుణాలను సైతం తెస్తున్నది. కాళేళ్వరం కార్పొరేషన్, పాలమూరు ఎత్తిపోతల, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర కార్పొరేషన్ల ద్వారా అప్పులు సమకూర్చుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం సంబంధించి 2015-16 సంవత్సరానికి రూ.80,190.46 కోట్లుగా అంచనా వేయగా, వాస్తవంలో రూ. 2020-21లో ఈ అంచనాలు రూ.105790.72 కోట్లుగా పెంచారు. దాదాపు రూ. 25000 కోట్లు అధికంగా రివైజ్ చేశారు. 2020 మార్చి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.63,541.70 కోట్లు. ఇందులో బడ్జెట్ నుంచి రూ.23901.66 కోట్లు ఖర్చు చేశారు. మిగతావి కార్పొరేషన్ ద్వారా రూ.39,640.04 కోట్లు రుణాలు తెచ్చుకున్నవే. కాగా ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మొత్తం బడ్జెట్ నుంచి రూ.59,413.30 కోట్లు ఖర్చు పెట్టాలని భావించారు. అలాగే రూ.46377.42 కోట్లు రుణాలు తేవాలని ప్రణాళిక.
మూడే కీలకం
కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం ప్రస్తుతం పెట్ ప్రాజెక్టులుగా పరిగణిస్తున్నది. ఈ మూడింటిని రీడిజైన్ చేసి పాత నీటి విధానానికి స్వస్తి చెప్పింది. కాళేశ్వరానికి సంబంధించి 18,25,700 ఎకరాలను కొత్తగా ఆయకట్టు కోసం ప్రాజెక్టును ప్రారంభించారు. ఏడు సెగ్మెంట్లుగా ప్రాజెక్టును నిర్మించారు. పాత ఆయకట్టు స్థీరీకణకు ఎస్ఆర్ఎస్పీ కింద 968640 ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీటిని అందిస్తామని చెప్పారు. శ్రీరామసాగర్ వరదకాలువ నుంచి రెండు లక్షల ఎకరాలు, రెండో దశ నుంచి 4.40 లక్షల ఎకరాలు, నిజాంసాగర్ 2.34 లక్షల ఎకరాలు, సింగూరు కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నుంచి సాగునీటిని సమకూరుస్తామన్నారు. మొత్తం 38 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ ఆయకట్టుకు 225 టీఎంసీల వినియోగంలోకి తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం 20 ప్రాజెక్టులు కట్టారు. నీటి నిల్వ సామర్థ్యం 147.71 టీఎంసీలుగా ఉంది. ఆ మధ్య అనుకోని అవాంతరాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి పంపకాలపై పెట్టిన తగాదాల మూలంగా శ్రీశైలం నుంచి అదనపు నీటిని తీసుకోవడం వల్ల కేంద్రం ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కాగా కార్పొరేషన్ల ద్వారా అప్పులు సమకూర్చుకుని పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది. అయినా సాధ్యంకాలేదు. అప్పులు తిరిగి చెల్లించే గడువు సమీపించింది. సర్కారుకు బ్యాంకులు నోటీసులు సైతం ఇచ్చినట్టు తెలిసింది. అయినా కేంద్రానికి నిధులు ఇచ్చేందుకు మనస్సు రావడం లేదు.
కేంద్రానికి మేమే ఇస్తున్నాం : రాష్ట్ర ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు
రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి నిధులు ఇస్తున్నది. గత ఏనిమిదేండ్ల కాలంలో దాదాపు రూ. 3. 5 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే, తిరిగి ఇచ్చింది. రూ. 1.5 లక్షల కోట్లు కూడా లేదు. అలాగే ఆయా పథకాల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన రూ. 45 వేల కోట్లను కేంద్రం అపేసింది. బోరుబావులకు మీటర్లు పెట్టడం లేదని ఏడాదికి రూ.6 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలోపు రూ. 30 వేల కోట్లు ఇవ్వలేదని ఇటీవల సంగారెడ్డిలో వ్యాఖ్యానించారు.
అనుమతులు తొందరగా ఇవ్వాలి : సాగునీటి శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్
రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. కొత్తవాటికి అనుమతులూ రావడం లేదు. దీంతో రోజురోజుకూ ఖర్చులు పెరిగిపోతున్నాయని రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇటీవల జీఆర్ఎంబీ భేటీలో ఈ విషయమై స్పష్టంగా మాట్లాడారు. ఇతర సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని విజప్తి చేశారు.