నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అబద్ధాలనైనా ఎప్పుడూ ఒకేలా చెప్పేలా కేంద్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోడీకి రాష్ట్ర మంత్రి కేటీఆర్ హితవు పలికారు. తెలంగాణకు నూతన వైద్య కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. తొమ్మిది వైద్య కళాశాలలిచ్చామంటూ కిషన్‌రెడ్డి, అసలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలే రాలేదంటూ మన్‌సుఖ్‌మాండవీయ, రెండు ప్రతిపాదనలొచ్చాయంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారని కేటీఆర్ గుర్తు చేశారు. అబద్ధాలనైనా ఎప్పుడూ ఒకేలా చెప్పే విధంగా కేంద్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలని ఈ సందర్భంగా మోడీని కేటీఆర్ కోరారు. అసలు తెలంగాణలోనే లేని తొమ్మిది వైద్య కళాశాలలను సృష్టించిన ఘనత కిషన్‌రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆయుష్ పేరిట హైదరాబాద్‌లో ఓ కల్పిత గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను కూడా ప్రకటించారని తెలిపారు. కేంద్రమంత్రులందరిలో కిషన్‌రెడ్డి ఆణిముత్యమంటూ ఎద్దేవా చేశారు.