కేంద్రాన్ని ఎండగట్టండి

– రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించండి
– ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీయండి
– దేశ ప్రజల గొంతు వినిపించండి
– విపక్షాలను కలుపుకెళ్లండి
– పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంటరీ బడ్జెట్‌ సమావేశాల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదనీ, ప్రతి బడ్జెట్‌లోనూ వివక్ష ప్రదర్శిస్తూ, ఆర్ధిక అంశాలపై ఆంక్షలు విధించడం, రైతుల విషయంలో వివక్ష చూపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనీ, వీటన్నింటినీ దష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు ఉభయసభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ప్రాజెక్టులు, ఆర్థిక పరమైన అంశాలపై రాజీలేని పోరాటం చేస్తూ, జాతీయ అంశాలపై కూడా స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలని చెప్పారు. ప్రజా సమస్యలపై గొంతుని వినిపిస్తూ కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దష్టికి తీసుకురావాలన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథాలో అన్ని మార్గాలను అనుసరించాలనీ, ఆ దిశగా బీఆర్‌ఎస్‌తో కలిసివచ్చే అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని చెప్పారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో అనేక అంశాలను చర్చించారు. పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు (రాజ్యసభ), నామా నాగేశ్వర్‌రావు (లోక్‌సభ), ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, కె.ఆర్‌. సురేష్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్‌ రావు, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, మాలోత్‌ కవితా నాయక్‌, పసునూరి దయాకర్‌, బొర్లకుంట వెంకటేశ్‌, పోతుగంటి రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలు దేశ సమగ్రతకు, అభివద్ధికి ఆటంకాలుగా మారాయని చెప్పారు. దేశ ప్రజలు తమ కష్టార్జితంతో కూడబెట్టుకుంటున్న సంపదనంతా తమ కార్పొరేట్‌ స్నేహితులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ”తమకు అనుకూల కార్పొరేట్‌ శక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రేమ కురిపిస్తూ లక్షల కోట్ల రుణాలను రద్దు చేస్తున్నది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు వాటాలను అప్పనంగా కట్టబెడుతున్నది. వారి కంపెనీల డొల్లతనం బైటపడుతూ షేర్ల విలువ హఠాత్తుగా పడిపోతుంటే, లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులోనే నష్టపోతున్న వాస్తవాన్ని దేశం గమనిస్తున్నది” అని చెప్పారు. ఆర్థిక అవకతవకలకు దోహదం చేసే విధంగా దేశ సంపదనంతా ప్రయివేటు పరం చేస్తూ ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారని అన్నారు. లాభాలను ప్రయివేటుకు కట్టబెడ్తూ, నష్టాలను దేశ ప్రజల మీద రుద్దుతున్నారనీ, ఇలాంటి ప్రమాదకర ఆర్ధిక విధానాలపై పార్లమెంటు ఉభయ సభల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గొంతెత్తి, ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. ఫెడరల్‌ స్పూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలనూ ప్రస్తావించాలన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న ఆర్థిక ఆటంకాలనూ కేంద్రానికి గుర్తుచేయాలనీ, సమాధానాలు రాబట్టే ప్రయ్నతం చేయాలని తెలిపారు. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనీ, అప్రజాస్వామికంగా రాష్ట్రాలను నిర్వీర్యపరిచే చర్యలకు పాల్పడుతున్నారనీ చెప్పారు. రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తిస్తూ, కేంద్ర రాష్ట్రాల నడుమ సంధాన కర్తలుగా వుండాల్సిన గవర్నర్ల వ్యవస్థను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న తీరును ఉభయ సభల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర కేబినెట్‌ సహా, శాసనసభ, శాసనమండలి తీసుకున్న నిర్ణయాలను సైతం ఉద్దేశపూర్వకంగా గవర్నర్లు పెండింగులో పెడుతున్నారని తెలిపారు. వీరి వైఖరిని పార్లమెంటు సాక్షిగా ఎండగట్టాలని సూచించారు. దేశ భవిష్యత్తు కోసం పార్లమెంటులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద పోరాటానికి కలిసివచ్చే పార్టీల ఎంపీలను కలుపుకుని పోవాలన్నారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ నిత్యావసర వస్తువుల ధరలు, భారమవుతున్న సామాన్యుల బతుకులను పార్లమెంటులో ప్రస్తావించాలన్నారు. నిరుద్యోగం, ఉపాధి, ప్రయివేటీకరణ అంశాలతో పాటు విభజన హామీలపై కూడా కేంద్రాన్ని నిలదీయాలని చెప్పారు. ఆ దిశగానే బీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో తమ గొంతును వినిపించాలని స్పష్టంచేశారు.

Spread the love