కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రచార ఆర్భాట, ఎన్నికల బడ్జెట్ తప్ప మరొకటి కాదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థికమంత్రి ఈ ఆర్థిక సంవత్స రంలో ప్రభుత్వ మూలధన వ్యయాలను రూ.10లక్షల కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. కానీ మూలధన వ్యయాల జాబితాని పరిశీలిస్తే అవి సంపన్నవర్గాల ప్రయోజనాల కోసమే ఉద్దేశించినవని అర్థమవుతున్నది. నేడు దేశంలో ప్రజల తలసరి ఆదాయం రూ.1,97,468 అయ్యిందని, ఇదేదో గొప్ప ఘనకార్యంగా ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 84శాతం నేడు అప్పులు ఉండడం గమనార్హం. 2004-14 మధ్య కాలంలో తలసరి ఆదాయంలో వృద్ధి 13.1శాతం కాగా, 2014-23 మధ్య ఇది 9.1 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తం గా చూసుకున్నప్పుడు మన దేశం 144వ స్థానంలో ఉండటం ఆలోచించాల్సిన అంశం. జీవన ప్రమాణాలలో (హెచ్‌డిఐ) చూస్తే 131వ స్థానంలో(191దేశాలలో), హుంగర్ ఇండెక్స్‌లలో 101స్థానం (107దేశాలలో) ఉంది. ఇదంతా ఎవరికీ తెలియదన్నట్టుగా వ్యవహ రించడం సరికాదు.కరోనా, నిరు ద్యోగం కారణంగా ప్రజల ఇబ్బందులు పెరిగినా ప్రభుత్వం ఆహార సబ్సిడీల మొత్తాలను పెంచకపోగా భారీగా తగ్గించింది. ఆహారసబ్సిడీ పథకంలో ఏకంగా రూ.90వేల కోట్లకు కేంద్రం కోత పెట్టింది. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేసే చర్య ఒక్కటంటే ఒక్కటీ కూడా బడ్జెట్‌లో ప్రస్తా వనకు నోచుకోలేదు. నిరు ద్యోగం తీవ్రంగా ప్రబలుతున్న వేళ ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాలనైనా కేంద్రం పట్టించుకుంటుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. బడ్జెట్‌లో ఆ ఊసే లేదు. ఎరువులపై సబ్సిడీని గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.50 వేల కోట్ల మేర తాజా బడ్జెట్‌లో కేంద్రం తగ్గించింది. ఫలితంగా వ్యవసాయం ఇంకా భారంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసీడీఎస్, జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ విద్యామిషన్, జాతీయ జీవనోపాధి మిషన్‌కు ప్రభుత్వం కేటాయిం పులు పెంచలేదు. అసంఘటిత కార్మికుల సంక్షేమానికి నిధులు లేవు. సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలన్న అంశాన్ని కూడా పట్టించుకోలేదు.ఈపీఎస్ పెన్షనర్లకు అసలు కేటాయింపులు చేయలేదు.
ఫైనాన్షియల్ రంగంలో మరిన్ని సంస్కరణలు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. బ్యాంకింగ్ రెగ్యు లేషన్ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టాలకు సవరణలు తెస్తామని చెప్పడం అనేది భవిష్యత్తు లో బ్యాంకింగ్ రంగ ప్రవేటీకరణకు మార్గం సుగమం చేయడమే. నగరాలు, పట్టణాల మౌలిక సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించని ప్రభుత్వం మరిన్ని సంస్కరణ తీసుకొచ్చేటువంటి ఉద్దేశంలో ఉంది. ఇకపోతే సామాన్య, మధ్య తరగతి ప్రజానీకానికి ఎప్పటిలాగే బడ్జెట్‌లో మొండిచేయి చూపించారు. కోవిడ్ మూలంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోయినా, వారికి ఎటువంటి ఊరట బడ్జెట్‌లో లభించలేదు. ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచారు.కొత్త పన్ను విధానంలో స్లాబ్స్ మార్చారు. రూ.7లక్షల ఆదాయం దాకా పన్ను లేదనే ప్రకటన కంటి తుడుపు చర్యే అని బడ్జెట్ పత్రాలు లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది.
సంపన్నులకు రాయితీలు..
దేశంలోని వంద మంది సంపన్నుల దగ్గర రూ.54.12లక్షల కోట్లు, అందులో ఎగువున ఉన్న పది మంది శతకోటీశ్వరుల దగ్గర రూ.27.52 లక్షల కోట్లు పోగుబడ్డాయి. శతకోటీశ్వరులపై ఒకే ఒక్క మారు మూడు శాతం పన్ను వేస్తే ఐదు సంవత్సరాలపాటు హెల్త్ మిషన్‌ను నిరాఘాటంగా నిర్వహించ వచ్చు. రెండు శాతం పన్ను వేస్తే రానున్న మూడు సంవత్సరాల వరకు పౌష్టికాహారం అందించడానికి నిధుల కొరత ఉండదు. 2017-2021 మధ్య గాలివాటంగా, అప్పనంగా లాభాలు సంపాదించిన కంపెనీలపై 20శాతం పన్ను వేస్తే రూ.1.79లక్షల కోట్లు వస్తుంది. దీంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50లక్షల మందికి సంవత్సరానికి సరిపడే వేతనాలు ఇవ్వ వచ్చని అదానీ, అంబానీలపై ఒకటి, రెండు శాతం పన్ను వేసినా దేశంలో చాలా సమస్యలను పరిష్కరించ వచ్చునని రకారకాల మార్గాలను ఆక్సాఫామ్ నివేదిక సూచించింది. కానీ ప్రభుత్వం ఆవేమీ పట్టించుకోలేదు. కుబేరులపై అదనపు పన్ను వేయ లేదు. పైగా పైపెచ్చు కార్పొరేట్‌లపై సర్ చార్జీను 39శాతం నుండి 27శాతంకు తగ్గించారు.
ప్రభుత్వ రంగసంస్థలు పుట్టిందే చావడానికన్నట్టు, ప్రస్తుత ప్రభుత్వం వాటి పీకనుములే చర్యలు తీసు కుంటోంది. 2014-19 కాలంలోనే రూ.2లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని చేపట్టారు. క్రితం ఏడాది బడ్జెట్‌లో జాతీయ హైవే అథారిటీ, రైల్వే, చమురు, సహజవాయు సంస్థల ఆస్తులను అమ్మేస్తామని ప్రకటించారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఖనిజ వనరులు, బ్యాంకింగ్, మైనింగ్, ఆర్థిక సర్వీసుల్లో ప్రభుత్వం నామమాత్రంగా కొనసాగనుంది. ఈ ఏడాది కూడా రూ. 60,000కోట్ల ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రాష్ట్రాలకూ కోతలే…
సామాన్య మధ్య తరగతిపై ధరా భారం కొనసాగుతున్నా, ద్రవ్యోల్బణం నివారణకు ఎలాంటి నివారణా చర్యలు లేవు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే పరిస్థితి ఉన్నా, దాని నుంచి సామాన్యులకు ఊరట నిచ్చే ఎలాంటి చర్యను బడ్జెట్‌లో ప్రతిపాదించలేదు. ధరల స్టీరీకరణ నిధి ప్రస్తావనే లేదు. అసంఘటిత రంగ కార్మికుల రక్షణకు, కోట్లాది మంది నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు నోటి మాటలు తప్ప కేటాయింపులు లేవు. రాష్ట్రాలకు చేసే కేటాయింపుల్లోనూ కోతలు పెట్టి సమాఖ్య స్ఫూర్తిపై దాడిని కొనసాగించింది.14వ ఆర్థిక కమిషన్ రాష్ట్రాలకు 42శాతం నిధులు మంజూరు చేయాలని నిర్దేశిస్తే, 2021-22లో 33.2శాతం నిధులు పంపిణీ చేశారు. ఈ బడ్జెట్‌లో కేవలం 30.4శాతం మాత్రమే రాష్ట్రాల వాటాగా ప్రకటించారు. ఒక పక్క నెలకు రూ.1,60,000కోట్లు జిఎస్‌టి వసూళ్ళు పెరిగాయని ఆర్భాటంగా ప్రకటిస్తూ, రాష్ట్రాలకు మాత్రం చట్టబద్ధంగా రావలసిన నిధులను కేటాయించడం లేదు. విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తేనే, అదనంగా అప్పులు చేసుకోవడానికి అనుమతిస్తామని ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించేశారు. ఏతా, వాతా బడ్జెట్ ఆసాంతం డిజిటలైజేషన్, గ్రీన్ ట్రాన్సిషన్, కార్పొరైటైజేషన్, ప్రధాన మంత్రి పేరుతో పథకాల ఉచ్చారణ తప్ప వేరేవి లేవు. దేశం ముందున్న నిరుద్యోగం, ఉపాధి లేమి, అదుపులేని ధరా భారం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణత వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే దృక్కోణం ప్రభుత్వ విధానాల్లో లోపించింది. కనుక, విస్తృత పోరాటాల ద్వారానే, విశృంఖలంగా ముందుకుపోతున్న ఈ ప్రభుత్వానికి కళ్లెం వేయాలి.
– పి. సతీష్
9441797900