కోమటిరెడ్డిది అబద్ధపు ప్రచారం

–   చిట్‌చాట్‌లో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్రంలో హంగ్‌ వస్తుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యా లయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. బీబీసీ మీడియా సంస్థలపైన ఐటీ దాడులు చేయడం ప్రజాస్వామ్యనికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మీడియాను అణచివేతకు గురిచేయాలనే కేంద్రం ఆలోచన సరైంది కాదన్నారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగాయని తెలిపారు. దేశంలో, రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ప్రసంగంలో సమగ్ర సమాచారం లభించిందన్నారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా సీఎం దేశంలో నెలకొన్న పరిస్థితులను వివరించారని చెప్పారు. రాష్ట్రంలో అద్భుతమైన పథకాల అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సెస్సుల పేరుతో రాష్టం నుంచి రూ.20 లక్షల కోట్లు వసూలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. నిధుల విడుదలలో రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందన్నారు. ముందస్తు ఎన్నికలు రావని, షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారమే తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పొలిటికల్‌ స్టెప్‌ ఉంటుందని చెప్పారు. బండి సంజరు వ్యాఖ్యలు ఆయన పార్టీ నేతలకే వర్తిస్తాయని, బీజేపీ నేతలు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యారని విమర్శించారు.

Spread the love