క్రీడా పద్దు రూ.134.80 కోట్లు

– బడ్జెట్‌ ప్రసంగంలో దక్కని చోటు
– తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ 2023-24
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడా రంగానికి మరోసారి నిరాశే ఎదురైంది. స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణం, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వగల స్థాయిలో ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాల కల్పనపై తరచుగా హామీలిచ్చినా.. ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రీడలకు రూ.134.80 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌లో క్రీడలకు రూ.81.01 కోట్లు కేటాయింపులు చేయగా..ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.53.79 కోట్లు అదనంగా ఇచ్చారు. అయితే, వీటిలో అత్యధికంగా రూ.45 కోట్లు తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు కేటాయించారు. రాష్ట్రంలో నూతన క్రీడా సదుపాయాలు, మౌళిక వసతులు కల్పించే దిశగా ఎటువంటి పురోగతి లేదు. స్టేడియాల నిర్మాణం, ఆధునీకరణ, సదుపాయల కోసం రూ.30 కోట్లు, రాష్ట్ర క్రీడా సంఘాలకు నిధులు, క్రీడాకారుల నగదు ప్రోత్సాహకాల నిమిత్తం రూ.15 కోట్లు, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌)కు రూ.20.74 కోట్లు, వరంగల్‌-కరీంనగర్‌ క్రీడా పాఠశాలలకు రూ.16.53 కోట్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు రూ. 45 కోట్లు, తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు రూ.7.3 కోట్లు కేటాయింపులు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అనుగుణంగా ప్రపంచ శ్రేణి సౌకర్యాల కల్పన దిశగా బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కలేదు.
ప్రసంగంలో లేని ప్రస్తావన : ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ కీలక బడ్జెట్‌ ప్రసంగంలో సైతం క్రీడా రంగానికి చోటు లభించలేదు. 89 పేజీల ప్రసంగ పాఠంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ ప్రాధాన్యతల గురించి ఆర్థిక శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ప్రస్తావించారు. కానీ ఎక్కడా క్రీడల ఊసత్తలేదు. బడ్జెట్‌ ప్రసంగంలో క్రీడలను విస్మరించటంతోనే క్రీడా రంగం అభివృద్దిపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది తేటతెల్లమైంది.

Spread the love