గజదొంగ గంగన్న

గంగన్న గజదొంగ అని లోకానికి తెలీదు. అసలు దొంగలెవరూ తాము దొంగలమని చెప్పుకోరు. లోకం తనంతట తానే ఆ విషయాన్ని శోధించి సాధించాల్సిందే. లోకంలో అనేక వృత్తులున్నవి. తమ నేమ్‌ ప్లేట్ల మీద ఎం.ఎల్‌.ఏ అనో, మంత్రి అనో, అయ్యేయెస్‌ అనో డాక్టర్‌ అనో మరోటనో రాసుకోగలిగిన వాళ్ళున్నారు. కానీ ఈ వృత్తికి ఆ గుర్తింపు లేదు. గంగన్న గజదొంగ అనో గజదొంగ గంగన్న అనో రాసుకోవడానికి విజిటింగ్‌ కార్డు పంచుకోడానికి లేదు. గజదొంగ గంగన్న కేకాదు ఏ దొంగకీ ఈ సౌకర్యం, వెసులుబాటు లేదు. ఆ దొంగ ఘరానా దొంగైతేనేం కన్నపు దొంగైతేనేం. గజదొంగ గంగన్న పెద్దగా చదువుకోలేదు. అసలు చదువుకీ దొంగతనానికీ లింకే లేదు. ఆ మాటకు వస్తే బాగా చదువుకున్నవాడికి అరవై నాలుగు కళల్లో ఒకటయిన ‘చోరీకళ’ కి సంబంధం లేదు. సరస్వతికి లక్ష్మీకీ మధ్య పచ్చి పిండి ముద్ద వేస్తే కాలి రొట్టె అవుతుందని తెలిసిందేగా. చదువూ చట్టుబండలూ లేకపోవడం వల్ల మనుషులు బాగా రాణించే వృత్తుల్లో ‘చోరవృత్తి’ ఒకటి. ఏది చేసైనా సరే పురుషుడు పురుషార్థి కావాలి కదా. గంగన్న దొంగతనాన్ని పురుషార్థంగా ఎంచుకున్నాడు. అయితే ఆ విషయాన్ని గంగన్నే కాదు ఏ దొంగా పైకి చెప్పుకోలేడు చెప్పడు.
దగా, ధోకా, కపటం, మోసం, తెగింపు, బరితెగింపు, లోతులు చూడ్డం, గోతులు తియ్యడం గజదొంగ గంగన్న పెట్టుబడి… అయితే ఈ లక్షణాలేవీ పైకి కనపించవు. ఓ నిరంతర శ్రామికుడు ఓ బడా వ్యాపారవేత్త ఓ ప్రముఖుడూ ఓ సంపన్నుడూ ఓ జాతిరత్నం అని అందరూ అనుకునేలా ఉంటాడు. అందరూ మట్టి ఇటుకలతో గోడలు కట్టి సంతృప్తి పడవచ్చు కానీ కొందరు నోట్ల కట్టల్ని ఇటుకలుగా వాడి ఏడుకాదు ‘ఎన్నో ఏడుల’ అంతస్తుల్ని కడ్తారు. అలాంటి మేడ మీద మేడ కట్టడం మొదలు పెట్టాడు గంగన్న. గంగన్న అప్రతిహతమైన ప్రతిభను మొదట్లో ఎవరూ గుర్తించనేలేదు. ఏదైనా ప్రతిష్ఠాత్మకమైన పత్రిక ముఖచిత్రంగా తన కలర్‌ ఫొటో వేస్తే బాగుండుననుకున్నాడు. కానీ ప్రతిభను గుర్తించే పత్రికలేవీ. ఎవరూ గుర్తించకపోతే మనల్ని మనమే ‘ప్రమోట్‌’ చేసుకోవాలి మన పేగుల వీణ మనమే వాయించాలి కదా అనుకొన్న గంగన్న పత్రికలన్నీ తనవే అయితే తను బ్రష్షు నోట్లో వేసుకున్నప్పటి నుంచి రాత్రి గురకపెట్టే దాకా తన గురించే బాకా బాజా ఊదుతాయని డోలూ సన్నాయి వాయిస్తాయని ‘కొంటేపోలా’ అనుకున్నాడు. కొనేశాడు. జేబులో ‘ప్రెస్సు’ ఉన్నవాడి దర్జా, ఠీవీ మామూలుగా ఉండవు కదా. అలా గజదొంగ గంగన్న ప్రముఖుడై పోయాడు. పొద్దున్నే పళ్ళుతోముకో కుండానే జనం టీవీలు ఆన్‌ చేస్తారు కదా. వాళ్ళట్లా ‘ఆన్‌’ చెయ్య గానే గంగన్న ముఖం కనిపిస్తే ఆ ‘థ్రిల్లే’ వేరప్పా అనుకు న్నాడు గంగన్న. ఓ జేబులో ప్రెస్సూ మరో జేబులో టీవీ ఉంటే జేబులు నిండుగా ఉంటయి అంతే ‘కొంటే పోలా’ అనుకున్నాడు. కొనేశాడు. జేబులో టీవీలు ఉన్నవాడి ఎదుర్రొమ్ము ‘ఉక్కే’ కదా. గంగన్న సుప్రభాతం, గంగన్న స్తోత్రరత్నావళి, గంగన్న చరి తము, కనుమా వంటివి టీవీ ల్లో ఊరువాడా దాటిపోయినయి. అలా గంగన్న ప్రసిద్ధుడైపోయాడు. గంగన్న ఓ నాడు అర్జంటు పని మీద ఎగురుతూ వెళ్ళడానికి విమానశ్రయం చేరుకున్నాడు. కాస్త ‘ఆలీసం’ అయ్యిందని విమానం గాలిలో రెక్కలూపుకుంటూ వెళ్ళిపోయింది. ప్రముఖుడు ప్రసిద్ధుడు అయిన గంగన్న ఎక్కకుండానే ఎగిరిపోవడానికి దానికి ఎన్ని గుండెలు అనుకున్న గంగన్న ‘కొంటే పోలా’ అనుకున్నాడు. కొనేశాడు విమానాన్ని కాదు విమానాశ్రయాల్ని. ఇప్పుడిహ గంగన్న చెపితే తప్ప విమానాలు రెక్కలు విప్పవు. వాటన్నిం టికీ పైలట్‌ గంగన్నే! గంగన్న టైమును సెకన్లల్లోకాదు కరెన్సీ నోట్లతో లెక్కించసాగాడు. దేశదేశాల్లో గంగన్న ప్రతిభ వెలిగి పోసాగింది. ఎక్కడికయినా ఎగిరి వెళ్ళిపోయే గంగన్నకు ఓ నాడు నీటిలో తేలుతూ పోవాల్సిన పనిబడింది. రేవు దగ్గరికి వెళ్తే ౖ’పడవెల్లిపోయింది రో ఓ గంగన్నా’ అన్నారు. గంగన్న గంగ వెర్రులెత్తిపోయాడు. ప్రముఖుడు, ప్రసిద్ధుడు అయిన గంగన్న ‘కాలి ధూళి’ సోకకుండానే పడవ వెళ్ళిపోవడమా అని ముక్కున వేలేసుకుంటూ అనుకున్నాడు. ‘కొంటే పోలా’ అనుకున్నాడు. కొనేశాడు. పడవల్ని కాదు పధ్నాల్గు రేవుల్ని. ఇలా ఏది అనుకుంటే అది అలా కొనేస్తున్న గంగన్నని చూస్తే ప్రభుత్వానికి ముచ్చటేసింది. అరే మన దగ్గర తట్టూ తవుడూ తొక్కాతోలూ అనేకం ఉన్నాయి కదా. పని చేయని వాటిని లాభాలు చూపనివాటిని చూస్తూ ఉసూరుమనటం కంటే అయినవాడికి గంగన్నకు అమ్మేసి ఉషారుగా ఉందాం అనుకుంది. అయ్యా మేం బాగానేఉన్నాం ఆరోగ్యం బానే వుంది అని ఏడ్చి మొత్తుకుంటున్న వాటిని కూడా గంగన్నకు బలవంతంగా అప్పచెప్పి చేతులు దులిపేసుకుంది. మన చేతికి మట్టి అంటుకోకూడదు అనే విలన్ల వారసుడు కదా గంగన్న. పడవలు కొన్నా, విమానాలు కొన్నా, సంస్థలు కొన్నా అసలు ఏది కొన్నా తన నోట్లు లెక్కపెట్టింది లేదు. అన్నీ బ్యాంకు వాళ్ళే లెక్కపెట్టారు. గంగన్న చుట్టూ ‘ఏరుకో కోరుకో ఏం కావాలో కోరుకో’ అంటూ ప్రదక్షిణలు చేశారు. ‘హారతిదేగైకొనుమా’ అని మంగళ హారతులు పట్టారు. ఇంత జరుగుతున్నా గంగన్న గజదొంగ అని ఎవరూ తెల్సుకోలేదు. తెల్సిన వాళ్ళు నోరు విప్పలేదు. గంగన్న ప్రభుత్వం అమ్మే సంస్థలన్నీ అయిపో వచ్చినయని ‘కొంటే పోలా’ అనుకుని ప్రభుత్వాన్నీ కొనేశాడు. ఆణిముత్యం అని జాతి పగడం అని గంగన్న శతకం పఠించే వాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టారు. మాయలఫకీరు ప్రాణం సప్త సముద్రాల అవతల చిలకలో ఉన్నదన్న సంగతి సముద్రాల అవతల ఉన్నవాడు బయట పెట్టాడు. గంగన్న ఉత్తుత్తి గంగన్న కాదు గజదొంగ గంగన్న అన్న విషయం తెల్సి గుడి దగ్గర బిచ్చగాడు కూడా తన ‘బొచ్చె’ ను అప్పుకింద లాక్కు వెళ్తారేమోనని భయపడసాగాడు.
-చింతపట్ల సుదర్శన్‌,
9299809212

Spread the love