రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
‘ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతి పాట మిలియన్స్ వ్యూస్‌ని సాధించింది. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే ఈచిత్రానికి ఖచ్చితంగా రీసౌండ్ వస్తుందనే నమ్మకం ఉంది. రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చేశాను. అది బ్లాక్‌బస్టర్ అయ్యింది. రవితేజ నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ‘బెంగాల్ టైగర్’కి మించిన ఆల్బమ్ అవుతుంది. ఇందులో రవితేజ క్లాసు, మాసు రెండు పాత్రలకు తగ్గట్టు పాటలు డిజైన్ చేశాం. ‘కిక్’ సినిమాలో ‘ఒరేరు ఆజామూ.. లగెత్తరో’ అని రవితేజ చెప్పిన డైలాగు చాలా పాపులర్. దీనికి పాటలు చేస్తున్నపుడు పాట చివరిలో ఏదో ఒక మెరపు ఉండాలనిపించింది. పాటలో చివర్లో ‘ఓ సిసిరోలియో ఏరా అప్పుడే ఆపేశావ్ ఇంకోసారి దరువేసుకో’ అనే డైలాగ్‌ని రవితేజతో పాడించాం. ఇందులో వింటేజ్ రవితేజ కనిపిస్తారు. దాని ప్రకారం ఆయన ఎలా ఉంటారో మీరే ఊహించుకోవచ్చు. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన జింతాక్, వాట్స్ హ్యాపెనింగ్, మాస్ రాజా, డుడు.. పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మరో పాట ఉంది. అది నేనే రాసి, పాడాను. ఇందులో ఊహించని మలుపులతో సాగే కథనం హైలెట్‌గా ఉంటుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాలు మనం చూశాం. ఆయన మీద మనకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే చిత్రమిది. ప్రస్తుతం 15 సినిమాలు చేస్తున్నాను. వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా మరో పది సినిమాలు వస్తాయి’ అని చెప్పారు.