గాంధీజీ హత్య వెనుక కుట్ర

– వ్యక్తి చేసిన అఘాయిత్యంగా ప్రచారం
– తెరవెనుక సావర్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌…
– ‘గాంధీజీ హంతకుడు’ పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహాత్మాగాంధీ హత్యకు సంబంధించిన సమాచారం పాక్షికంగానే జనబాహూళ్య ప్రచారంలో ఉన్నదనీ, దాని వెనుక అతిపెద్ద సైద్ధాంతిక ఘర్షణ, కుట్ర ఉన్నాయని ప్రముఖ రచయిత ధీరేంద్ర కే ఝూ అన్నారు. ఈ కుట్రకోణాన్ని సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఉంచే ప్రయత్నం తాను చేసినట్టు చెప్పారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఆధ్వర్యంలో ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) లో ధీరేంద్ర కే ఝూ రచించిన ‘గాంధీజీ హంతకుడు’ (గాడ్సే జీవితం, ఆలోచనలు, అనుబంధాలు) తెలుగు అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎస్వీకే ట్రస్టు కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ తెలుగులోకి అనువాదం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ తిరుమలి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంగ్ల మూల పుస్తక రచయిత ధీరేంద్ర కే ఝూ ఆన్‌లైన్‌ ద్వారా సభలో పాల్గొని మాట్లాడారు. గాంధీ-గాడ్సేల ఆలోచనల సైద్ధాంతిక ఘర్షణను 2014 తర్వాత బీజేపీ ముందుకు తెస్తున్నదని వివరించారు. గాడ్సేను దేశభక్తుడిగా కొలిచే ప్రకటనలు వెలువడుతున్నాయనీ, అసత్య ప్రచారంతో చరిత్రను మార్చే ప్రయత్నం జరుగుతున్నదనీ చెప్పారు.
గాంధీ హత్యకు గల కారణలపై కేరవాన్‌ పత్రికలో వ్యాసం కోసం పరిశోధన చేసేటప్పుడు అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయనీ, వాటిని సాక్ష్యాధారాలతో ప్రజలకు చెప్పాలనే పరిశోధనను కొనసాగించి పుస్తకం రాసినట్టు తెలిపారు. ‘గాంధీజీ హంతకుడు’ తెలుగు అనువాద పుస్తక ఆవిష్కర్త ప్రొఫెసర్‌ తిరుమలి మాట్లాడుతూ మహాత్మాగాంధీని హత్య చేసింది గాడ్సే అనే ఓ వ్యక్తి కాదనీ, దాని వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌, సావర్కర్‌ కుట్ర ఉన్నదని స్పష్టం చేశారు. బ్రిటీష్‌ వాళ్లు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించాక, దేశంలో తిరిగి పీష్వాల పాలన తేవాలనేది సావర్కర్‌ ఆలోచన అనీ, గాంధీ హత్యతో దానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తే, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఆ ప్రయత్నాన్ని నిలుపుదల చేసిందన్నారు. సావర్కర్‌ మహాత్మాగాంధీ అంతటి ధైర్యవంతుడు కాదనీ, స్లీపర్‌సెల్‌గా ఉంటూ తన ఉద్రేక ప్రసంగాలతో యువకులను హిందూ తీవ్రవాదం వైపు నడిపించే ప్రయత్నం చేశారని చెప్పారు. గాడ్సే, ఆప్టే, కర్క్‌, పోవా వంటి వారు సావర్కర్‌ ప్రసంగాలకు ప్రభావితులైన వారేనని తేల్చిచెప్పారు. గాంధీజీ హత్య తర్వాత సావర్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తమకు ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించుకున్నా యనీ, కానీ చారిత్రక ఆధారాలు సేకరించి, ఈ కుట్రకోణాన్ని ప్రజలకు తెలిసేలా రచయిత కృషి చేశారని అన్నారు.
గాంధీజీ కంటే ముందు ఇదే సావర్కర్‌ గ్యాంగ్‌ జిన్నాను హత్య చేయాలని పథకం పన్నారనీ, కానీ మౌంట్‌బాటన్‌ ఆయనతో కలిసి ఉండటం వల్ల అది సాధ్యం కాలేదని వివరించారు. గాంధీజీ హత్యను ఓ వ్యక్తి చేసిన హత్యగా చిత్రీకరించేందుకు సావర్కర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం చేశాయన్నారు. గాడ్సే కూడా ఆ తరహాలోనే న్యాయస్థానంలో స్టేట్‌మెంట్స్‌ ఇచ్చాడని చెప్పారు. గాంధీ హత్య విషయం అప్పటి హౌంశాఖ మంత్రి సర్దార్‌ వల్లబారు పటేల్‌కు ముందే తెలుసు అనీ, ఆయన సకాలంలో సరైన చర్య తీసుకొని ఉంటే, ఈ దారుణం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.
గాంధీజీ లాగా ధైర్యంగా మాట్లాడేశక్తి సావర్కర్‌కు లేదనీ, ఆయనో పిరికివాడంటూ పలు ఉదాహరణ చెప్పారు. పుస్తక అనువాదకులు ఎస్‌ వినయకుమార్‌ మాట్లాడుతూ గాంధీజీ హత్య, ముంబయిలో సావర్కర్‌ సదన్‌పైకి ప్రజల దాడిని నియంత్రించడం, గుజరాత్‌లోని గోద్రా, అహ్మదాబాద్‌ అల్లర్లకు సారూప్యత ఉన్నదని వివరించారు. డిక్టేటర్‌ఫిప్‌పై గాడ్సే, సావర్కర్‌కు మక్కువ ఎక్కువని చెప్పారు. చిప్పావన్‌ బ్రాహ్మణుల మీదే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఆధారపడి ఉంటుందనీ, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని గాంధీ సవాలు చేస్తున్నారనే కోపం వారికి ఉన్నదని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఎడిటర్‌ కే ఆనందాచారి మాట్లాడుతూ జనవరి 30 నాటికి గాంధీ హత్య జరిగి 75 ఏండ్లు పూర్తిఅవుతాయనీ, దాని పూర్వాపరాలపై చర్చ జరగాలని అన్నారు. గాంధీ హంతకులను దేశభక్తులుగా కీర్తించబడుతున్నారనీ, అసత్యాలు సత్యాలుగా రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏండ్లనాటి గుజరాత్‌ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారాలపైనా ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. కార్యక్రమంలో నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్‌ గౌరవ సంపాదకులు గుడిపూడి విజయరావు, జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ వాసు, కొండూరి వీరయ్య పాల్గొన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్‌ మేనేజర్‌ డీ కృష్ణారెడ్డి వందన సమర్పణ చేశారు.

Spread the love