గిరిజన ద్రోహి మోడీ

–  రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర
–  బుల్డోజర్‌ రాజకీయాలను అడ్డుకుంటాం
–  మోడీ పతనానికి మిర్యాలగూడ నుంచే శ్రీకారం
–  కార్పొరేట్ల చేతిలోనే దేశ సంపద
–  ఇచ్చిన హామీలను కేసీఆర్‌ అమలు చేయాలి :
గిరిజన సంఘం బహిరంగ సభలో ఆదివాసీ అధికార్‌ మంచ్‌ జాతీయ నాయకులు బృందాకరత్‌

– రాష్ట్ర మహాసభ సందర్భంగా వేలాది మందితో భారీ ర్యాలీ
గిరిజనుల ద్రోహిగా మోడీ నిలిచారని, గిరిజన రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆదివాసీ అధికార్‌ మంచ్‌ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ బృందాకరత్‌ విమర్శించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా మొదటి రోజు బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హనుమానుపేట ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి ఎన్నెస్పీ క్యాంపు మైదానం వరకు మహాప్రదర్శన నిర్వహించారు. గిరిజనులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో బృందాకరత్‌ మాట్లాడారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజ్యాంగం కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే గిరిజన సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో కోత విధించారని అన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన మహిళలు పౌష్టికాహార లోపంతో అనారోగ్యానికి గురవుతుంటే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదివాసీ గిరిజనుల జనాభా ప్రకారం కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దేశ జనాభాలో 8.6% ఉన్న గిరిజనులకు 2.7శాతం మాత్రమే నిధులు ఇచ్చారని, ఇది గిరిజనుల పొట్ట కొట్టడమేనని చెప్పారు. ఉపాధి హామీ చట్టంలో కూలీలకు 200 రోజులు పని కల్పించాల్సి ఉండగా.. వంద రోజులే కల్పించి.. ఆ పనికి కూడా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. దేశవ్యాప్తంగా మోడీ బుల్డోజర్‌ రాజకీయం చేస్తున్నారని, దానిని అడ్డుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షకులు శ్రమించి కూడబెట్టిన దేశ సంపదను జనాభాలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్‌ వారికి దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ధనికులు, పేదల మధ్య తీవ్ర వ్యత్యాసం పెరిగిందన్నారు. కష్టపడుతున్న కార్మిక, కర్షకులను మోడీ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోడీ ధరలను రెట్టింపు చేశారన్నారు. దాని ఫలితంగా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అందించాల్సిన ఆహార పదార్థాలను ఇవ్వకుండా రేషన్‌ షాపులు ఎత్తేసే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు. డిజిటల్‌ ఇండియాలో కోవిడ్‌ సమయంలో గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ సౌకర్యాలు లేక చదువుకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీలకు కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారని, దీనిబట్టి చూస్తే గిరిజనుల పట్ల మోడీకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. అటవీ హక్కు చట్టానికి తూట్లు పొడిచి అడవుల నుంచి గిరిజనులను తరిమికొట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటాన్ని స్వాగతిస్తున్నామని, మోడీ చేసే విధానాలే కేసీఆర్‌ అమలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్‌ ఇటీవల హామీ ఇచ్చారని, ఆ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే సమరశీల పోరాటాలు చేస్తామన్నారు. మోడీ పతనానికి మిర్యాలగూడ వేదిక నుంచే శ్రీకారం చుడతామన్నారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి గిరిజన ప్రజలు అండగా నిలవాలన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో రంగారెడ్డికి గిరిజనులు మద్దతు ఇచ్చి తమ సత్తా చాటాలన్నారు
ప్రజల సొమ్ము లూటీ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు
 కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు అమ్ముతూ ప్రజల సొమ్మును లూటీ చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మోడీ -అదానీల బంధం దేశానికి ప్రమాదకరంగా మారిందని చెప్పారు. దేశ సంపదను బడాబాబులకు దోచిపెడుతున్న మోడీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. షేర్‌ మార్కెట్‌ అతలాకుతలం కావడానికి అదానీ కుంభకోణమే కారణమని చెప్పారు. దేశంలో మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులు ఏకమై దోచుకుతింటున్నాయన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, అటవీ హక్కుల చట్టం, ధరల నియంత్రణ చట్టం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజాయితీ ఉంటే అదానీపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.
కార్పొరేట్‌ శక్తులకు ఏజెంట్‌గా కేంద్రం: జూలకంటి
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు ఏజెంట్‌గా పని చేస్త్తోందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల వల్ల నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. గిరిజన చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వకుండా ఊరికో కోడి ఇంటికో ఈక లాగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, సాగు తాగునీరు అందివ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రతినిధుల సభను తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్‌ నివేదిక చదివి ప్రారంభించారు. ఈ మహాసభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్‌, రమావత్‌ రవి నాయక్‌, మూడావత్‌ రవినాయక్‌, కొర్ర శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love