– మూలాలు ఐడీఏ బొల్లారంలో..
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
గుజరాత్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ జూనియర్ క్లర్క్ పరీక్ష పేపర్ లీక్ మూలాలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం లోని కేఎల్ హైటెక్ పరిశ్రమలో దొరికాయి. దేశ వ్యాప్తంగా సంచ లనం సృష్టించిన ఈ కేసులో సర్ధాకర్ రోహన్ అనే వ్యక్తిని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు బొల్లారం కేఎల్ హైటెక్ పరిశ్రమలో అరెస్టు చేశారు. గుజరాత్ పంచాయతీ రాజ్ జూనియర్ క్లర్క్ పరీక్ష ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా రెండు గంటల ముందు సోషల్ మీడియాలో లీక్ కావడంతో పరీక్ష వాయిదా పడింది. పేపర్ లీక్ వెనుక మొత్తం 16 మంది ఉండగా అందులో ఒక వ్యక్తి సర్ధాకర్ రోహన్‌ను గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌కు చెందిన జీతూనాయక్ సహకారంతో ఈ పేపర్ లీకేజీకు పాల్పడినట్టు తెలుస్తోంది. సర్ధాకర్ రోహన్ బొల్లారంలోని కేఎల్ హైటెక్ పరిశ్రమలో ఆపరేటర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. సుమారు తొమ్మిది లక్షల యాభై వేల మంది అభ్యర్థులు ఈరోజు పరీక్ష రాసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి రెండు గంటల ముందు పరీక్ష పేపర్ లీక్ కావడంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రవాణా సౌకర్యం ప్రభుత్వం సమకూర్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి జరిగిన అరెస్టును బొల్లారం పొలీస్ ఇన్స్పెక్టర్ సురేందర్‌రెడ్డి ధృవీకరించారు.