గుడి ధ్వంసంపై ఆదివాసీల ఆగ్రహం

-ఫారెస్ట్‌ ఆఫీస్‌ ముట్టడి.. రాస్తారోకో
-పోలీస్‌ల జోక్యంతో శాంతించిన వైనం
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివాసీలు తరతరాలుగా కొలుస్తున్న సారలమ్మ దేవర గుడిని ధ్వంసం చేయడంపై ఫారెస్ట్‌ ఆఫీస్‌ను ముట్టడించారు. శుక్రవారం సాయంత్రం అటవీశాఖ అధికారులు గుడిని ధ్వంసం చేసిన విషయం విధితమే. దాంతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసి ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆదివాసీలకు మద్దతుగా శనివారం భారీ ర్యాలీగా తరలివచ్చి అటవీశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడే రాస్తారోకో చేశారు. దీంతో తాడ్వాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పస్రా- ఏటూర్‌ నాగారం163వ జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి. పస్రా సీఐ వంగ శ్రీనివాస్‌, స్థానిక ఎస్‌ఐ చవళ్ళ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆదివాసీలతో మాట్లాడారు. శాంతియుత మార్గంలో సమస్యకి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళన విరమించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అరుణ్‌ కుమార్‌ మాట్లాడారు.
సారలమ్మ గుడిని ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం ప్రకారం గుళ్ళు, మసీదులు, చర్చీలను మతాలకతీతంగా గౌరవించాలని, దానికి భంగం కలిగిస్తే నేరస్థులుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. పీసా చట్టం అమలులో ఉన్న ప్రాంతమని, ఇక్కడ ప్రభుత్వ శాఖలు అన్ని పీసా గ్రామ సభలకు అనుగుణంగా పని చేయాలన్నారు. గుడిని ధ్వంసం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలని, అప్పటి వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ఉద్యమ నేత, సర్పంచ్‌ ఇర్ప సునీల్‌ దొర, తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మైపతి అరుణ్‌కుమార్‌, మేడారం పుజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంకిడి బుచ్చయ్య, పునరుద్ధరణ కమిటీ మాజీ చైర్మెన్‌ కోర్నిబెళ్ళి శివయ్య, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి కొర్ని బెల్లీ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love