నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సేవకులని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తెలిపారు.. ఆయన 284వ జయంతి సందర్భంగా మంగళవారం సీఎం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరా బాద్‌లోని బంజారాహిల్స్‌లో సేవాలాల్ పేరుతో నిర్మించిన భవన్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొ న్నారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి వారి జయంతి ఉత్సవాల నిర్వహణ మరో ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. అడవి బిడ్డలకే ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం సేవాలాల్ చేసిన కృషి గొప్పదన్నారు. తన ప్రజలను బయటి సమాజం నుంచి అనుక్షణం రక్షించు కునేందుకు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు. ఆయన కల్పించిన చైతన్యం, చేపట్టిన కార్యాచరణ దేశవ్యాప్తంగా ఉన్న లంబాడా/బంజారాలకు రక్షణ కవచంగా నిలిచిందని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని వివరించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.