ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ కంపెని ఐ.ఆర్.బి. (ఐడియల్ రోడ్ బిల్డర్స్) మహారాష్ట్ర లోని కొల్హాపుర్‌లో రోడ్లను నిర్మించింది. ఈ కంపెనీ అధికారికంగా వసూలు చేయవలసిన దాని కంటె రెట్టింపు రుసుం ఏండ్ల తరబడి వసూలు చేసింది. దీనికి వ్యతిరేకంగా కీర్తిశేషులు గోవింద్ పండరీనాథ్ పన్సారే ఉద్యమాలు నడిపారు. ఎన్.డి.పాటిల్ వంటి ప్రముఖ నాయకులతో కలిసి టోల్ గేట్ రుసుమును ఆపడంలో ప్రధాన పాత్ర పోషించారు.
ప్రపంచీకరణ అమలులో భాగంగా ఇతర రాష్ట్రాల కంటే ముందుగా మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మిశ్రమ ప్రభుత్వం 1990 ల మధ్యలో ”నిర్మించు-నిర్వహించు-బదిలిచేయి” పద్ధతిలో రహదారులను ప్రయివేటీకరించి, నిర్మాణ, నిర్వహణలను ప్రయివేట్ కంపెనీలకు అప్పజెప్పి ‘టోల్ గేట్’ను ప్రవేశ పెట్టింది. అశోక్ బిల్డ్ కాన్, ఐ.ఎల్. అండ్ ఎఫ్.ఎస్. ట్రాన్స్పోర్టేషన్, సద్భావ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలతో పాటు ఐ.ఆర్.బి. గ్రూప్ సంస్థ ఈ పథకంలో ప్రధాన పాత్ర పోషించింది. దీని అనుబంధ సంస్థలు, ముంబయి ఎంట్రి పాయింట్ టోల్ వసూళ్ళను, ఐ.ఆర్.బి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ నిర్మాణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అశోక్ బిల్డర్స్ యజమాని గుజరాతీ ఐన అశోక్ కటారియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2018లో రూ.94,000 కోట్ల అప్పు ఎగ్గొట్టగా భారత ప్రభుత్వం ఈ కంపెనీ నియంత్రణను తీసుకుంది. గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన సద్భావ ఇంజినీరింగ్ ను గుజరాతీ విష్ణుభాయి ఎం. పటేల్ స్థాపించారు. శశిన్ వి. పటేల్ దాని సి.ఎం.డి.
రహదారి నిర్మాణ ఖర్చుకు కొంత లాభం కలిపి నిర్ణీత కాలం పాటు గుత్తేదారు వసూలు చేసుకునే విధంగా ‘టోల్’ (పన్ను) ను నిర్ణయిస్తారు. వాహనాల సంఖ్య పెరిగితే టోల్ తగ్గించాలి. నిర్ణీత కాలం తర్వాత టోల్ వసూలు చేయరాదు. ఆశ్చర్యకర మైన అంశమేమంటే ఎక్కడా ఇలా జరగడం లేదు. అన్ని విషయాల లాగానే, ”సంతృప్తి చెందిన” అధికారులు ఈ విషయాన్ని కూడా పట్టించుకోరు. టోల్ చెల్లించలేనివారు, చెల్లించడానికి ఇష్టపడనివారు ఉపయోగిం చడానికి చట్ట ప్రకారంగా సర్విస్ రోడ్ ఉండాలి. మరుగుదొడ్లు, అంబులెన్స్ సేవలు, రోడ్ల పక్కన వాహనాలు నిలుపుకొనుటకు తగిన స్థలం ఉండాలి. ఈ సౌకర్యాలున్న టోల్ లేని సర్విస్ రోడ్లు మనకు సాధారణంగా కనిపించవు. కర్నాటకలో ఈ సౌకర్యాలన్నీ కల్పించినా కూడా టోల్ రుసుం తక్కువగా ఉన్నది. టోల్ రుసుంను ప్రయివేట్ వాహనాల నుండి మాత్రమే వసూలుచేయాలని చట్టం చెపుతోంది. వాహనాలను కొన్నప్పుడు చెల్లించే ఇంధన పన్ను, రహదారి పన్ను ‘మొదటి పన్ను’ కాగా ఈ టోల్ ‘ద్వితీయ పన్ను’ కింద లెక్క. ఒకే సేవకు రెండు పన్నులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని న్యాయ నిపుణుల అభిప్రాయం. ఇవేవీ అమలుకాలేదు. ఈ అన్యాయాలనే పాన్సరే ప్రశ్నించారు. జులై 27, 1998న స్థాపించబడిన ‘డి.వి.జె. లీజింగ్ అండ్ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్’, అక్టోబర్ 30, 2006న పేరు మార్చుకొని, రియల్ ఎస్టేట్ కంపెని ఐ.ఆర్.బి.గ్రూప్‌గా అవతరించింది. ముంబయి కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు వీరేంద్ర డి. మైస్కర్ సి.ఎం.డి. ప్రధాన నిర్దేశకులైన దీపాలి వి. మైస్కర్, సురేశ్ జి. కేల్కర్ గుజరాతీలు. ఈ సంస్థ మొదట ముంబయి-పూణే ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించింది. సంఘసంస్కర్తల హత్యల్లో ఈ సంస్థలు మతోన్మాదులకు తోడ్పడ్డాయని అనుమానం.
అధికారం చేపట్టగానే రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, గడువు తీరిన టోల్ గేట్లను రద్దుచేస్తానని వాగ్దానంచేశారు. అగ్రిమెంట్లు ముగిసిన ఆ కంపెనీలు ఆయనతో మాట్లాడిన తర్వాత, ఏ శక్తి పనిచేసిందో ఏమో గాని, నితిన్ గడ్కరి టోల్ వసూళ్ళ కొనసాగింపునకు అనుమతించారు. జమ్ము, కశ్మీర్ ఎన్నికల ముందు పనిగట్టుకొని ఆరు సార్లు ఆ రాష్ట్రాన్ని సందర్శించిన ప్రధాని, అక్కడి సైనిక శిబిరాల ముందర, మీరిక్కడున్నారు కాబట్టే మేమక్కడ దీపావళి జరుపు కోగలుగుతున్నామని సైనికులను తెగ పొగిడారు. అయితే అక్కడ ఈ మాట అనక ముందే సైనికులకు అప్పటిదాకా ఉన్న టోల్ గేట్ మినహాయింపును రద్దుచేసి గుత్తేదారులకు తన వంతు ”సేవ” చేయబోయారు. తర్వాత సైన్యాధికారుల విన్నపంతో ఈ గుత్తేదార సేవను విరమించారు.
2010లో సామాజిక కార్యకర్త సతీశ్ శెట్టిని పూణేలో చంపారు. ఈయన మహారాష్ట్రలో అనేక భూకుంభకోణాలను బయటపెట్టారు. అందులో లోనావలలో ఐ.ఆర్.బి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చేసిన భూముల ఆక్రమణలను కూడా ప్రశ్నించారు. సతీశ్ శెట్టి హత్య కేసులో ఐ.ఆర్.బి. కంపెనీని అనుమానించారు. కాని మోడీ సర్కారు రాగానే 2014లో ఈ కేసును కొట్టేశారు. 2013లో మహారాష్ట్రలో 53మంది సమాచార హక్కు కార్యకర్తలపై దాడిచేశారు. వారిలో 9మంది మరణించారు. ‘అంధశ్రద్ధా నిర్మూళన్’ వ్యవస్థాపకుడు, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రజా ఉద్యమ నాయకుడు, ప్రజా వైద్యుడు నరేంద్ర దాభోల్కర్‌ను పూణేలో ఆగస్టు 20, 2013న కాల్చిచంపారు. గోవింద్ పాన్సరే, ఆయన సతీమణి ఉమా పన్సారేలపై కొల్హాపూర్‌లో ఫిబ్రవరి 16, 2015న దాడిచేశారు. ఫిబ్రవరి 20, 2015న గోవింద్ పన్సారే మరణించారు. పూర్వ ఉపకులపతి ఆచార్య ఎం.ఎం. కల్బుర్గిని ఆగస్టు 30, 2015న చంపారు. ఈ ముగ్గురిని ప్రభాత సంచార సమయాన (మార్నింగ్ వాక్) ఒకే విధంగా, ఒకే భావజాల వ్యక్తులు హత్యచేశారు. వీళ్ళే సెప్టెంబర్ 5, 2017న ప్రజా పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ను చంపారు. హత్యలకు గురయిన వారంతా రాజకీయంగా బలహీనులే. గౌరీలంకేశ్ తప్ప తక్కినవారు వయసు మీరినవారే. కానీ ప్రగతిశీల భావజాల బలవంతులు. వీరి భావజాల వ్యతిరేక మతోన్మాదులు కక్ష సాధింపుగా వీరిని హత్య చేశారని ప్రజల అనుమానం.
క్లిష్టమయిన సామాజిక సమస్యలను, సామాజిక కార్యకర్తలైన దాభోల్కర్, పాన్సరేల ఉద్యమాలను ‘మేధావులు’ పట్టించుకోవడం లేదని నరేంద్ర దాభోల్కర్ కొడుకు, సామాజిక కార్యకర్త హమిద్ దాభోల్కర్ అన్నారు. ఈ పరిస్థితి మారకపోతే సామాజిక ఉద్యమ కారు లు, ప్రజా ప్రయోజకులు దేశంలో మిగలరు.
సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545