జీతాలు రాలే!

– ఆందోళనలో ఆర్టీసీ కార్మికులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రతినెలా ఒకటవ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు వేస్తున్నామని చెప్తున్న టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఈనెల 3వ తేదీ వచ్చి దాటినా ఇంకా జీతాలివ్వలేదు. సంక్రాంతికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని యాజమాన్యం ప్రకటించింది. అయినా జీతాలు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న కార్మికుల్ని వేధిస్తున్నది. గతంలో కూడా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎప్పుడు ఇస్తారో చెప్పలేని స్థితి ఉండేది. సకాలంలో జీతాలు రాకపోవడంతో బ్యాంకు ఈఎమ్‌ఐలు కట్టలేక దాదాపు 80 శాతం మంది ఖాతాలు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓవర్‌ డ్రాఫ్ట్‌తో పాటు భారీగా అప్పులు ఇస్తానన్నారని ఆర్టీసీ ఖాతాలన్నింటినీ ఎస్‌బీఐ నుంచి యూనియన్‌ బ్యాంకుకు మార్చారు. మరి ఇప్పుడు యూనియన్‌ బ్యాంక్‌ ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఇవ్వడాన్ని విరమించుకుందా? లేక ఉద్దేశ్యపూర్వకంగానే యాజమాన్యం ఆలస్యంగా కార్మికుల జీతాలు నిలుపుదల చేసిందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ కార్మికులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక, ఈఎమ్‌ఐలు బౌన్స్‌ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీతాలు సక్రమంగా రావట్లేదనే ఏకైక కారణంతో కొందరు ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకున్నారనే ప్రచారం కూడా సంస్థలో జరుగుతుంది. మరోసారి వీఆర్‌ఎస్‌ను ప్రోత్సహించేదిశగా యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదేమో అని కార్మికులు చర్చించుకుంటున్నారు. శనివారం జీతాలు రాకుంటే సోమవారం (6వ తేదీ)నాటికైనా ఇస్తారా..లేదా అని సందేహాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ”అన్నీ బాగున్నాయి…సంస్థ దినదినాభివృద్ధి చెందుతుంది” అని వేదికలపై ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న యాజమాన్యం ఇప్పటికైనా దీనిపై తక్షణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అభద్రత తొలగించండి
వీఎస్‌ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌
జీతాలు సకాలంలో రావట్లేదనే అభద్రతాభావాన్ని కార్మికుల్లో తొలగించే చర్యలు యాజమాన్యం తీసుకోవాలి. యూనియన్‌ బ్యాంక్‌ ఓవర్‌డ్రాఫ్ట్‌ ఎందుకు ఇవ్వలేదో స్పష్టం చేయాలి. కార్మికుల ఖాతాలు ఎన్పీఏలుగా మారకుండా చర్యలు తీసుకోవాలి.
ఇచ్చేదే తక్కువ..అదీ టైంకి ఇవ్వకుంటే ఎలా?
ఎర్ర స్వామికుమార్‌, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఫ్‌ు
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే జీతాలే తక్కువ. అదీ సకాలంలో ఇవ్వకుంటే ఎలా? బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించాలి కదా? ఈఎమ్‌ఐలు బౌన్స్‌ అయితే బాధ్యత యాజమాన్యం తీసుకుంటుందా? 9 ఏండ్లుగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు పెంచలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

Spread the love