జేఎల్‌ పోస్టులకు అందరూ దరఖాస్తు చేసుకునే అవకాశమివ్వండి

– టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి ఏఐఎస్‌ఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కరోనా కారణంగా గత విద్యాసంవత్సరంలో (2021-2022) చివరి ఏడాది పరీక్షలను ఆలస్యంగా నిర్వహించిన నేపథ్యంలో ఫలితాల విడుదలలో జాప్యం జరిగిందని ఏఐఎస్‌ఎఫ్‌ తెలిపింది. దీంతో కొన్ని కోర్సులకు సంబందించిన విద్యార్థులు జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వారందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ నేతృత్వంలో ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని కాకతీయ యూనివర్సిటీతోపాటు ఇతర విశ్వవిద్యాలయాల్లో పీజీ చివరి సెమిస్టర్‌ ఫలితాల విడుదలలో జాప్యం జరిగిందని తెలిపారు. దీంతో ఒకే విద్యాసంవత్సరంలో పీజీ పూర్తి చేసినప్పటికీ ఫలితాలు ఆలస్యం కావడంతో జేఎల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఆ వర్సిటీ అధికారుల సమన్వయ లోపంతో కేవలం కొన్ని సబ్జెక్టుల ఫలితాలు మాత్రమే విడుదలయ్యాయనీ, మరి కొన్ని సబ్జెక్టుల ఫలితాలు జేఎల్‌ నోటిఫికేషన్‌ అనంతరం వచ్చాయని వివరించారు. దీంతో ఆ విద్యార్థులు అందరు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అనితా రామచంద్రన్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని కమిషన్‌ చైర్మెన్‌తోపాటు సభ్యుల దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు రెహమాన్‌, సహాయ కార్యదర్శి గ్యార నరేష్‌, జూనియర్‌ లెక్చరర్‌ అభ్యర్థులు నాథన్‌, సాలెమూన్‌, నవీన్‌, జగన్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love