జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తకాలు పనిముట్లు

– అసలు చరిత్రను అవగతం చేసుకోవాలి : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వందపూలు వికసించేందుకు, వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకుపోతున్నదని చెప్పారు. జ్ఞాన తెలంగాణను నిర్మించేందుకు పుస్తకాలు పనిముట్లుగా పనిచేస్తాయన్నారు. చరిత్రను వక్రీకరించే వాళ్లను గుర్తించాలంటే అసలు చరిత్రను అందరూ అవగతం చేసుకోవాలనీ, ఈతరం విధిగా పుస్తక పఠనాన్ని కొనసాగించాలని సూచించారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే 35వ జాతీయ పుస్తక ప్రదర్శన పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బుధవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జ్ఞాన ఆయుధంతో సత్యాగ్రహి మార్గంలో 14 ఏండ్లు రాష్ట్ర సాధన మహోద్యమాన్ని కొనసాగించి తెలంగాణను సాధించారని వివరించారు. పుస్తకాలు తయారుచేసిన వ్యక్తులే ఏ రంగంలోనైనా అత్యున్నత స్థానాలకు ఎదుగుతారని చెప్పారు. జ్ఞానమార్గంలో వచ్చిన అనేక శాస్త్ర సాంకేతిక విప్లవాలపైన్నే జాతులు, దేశాల పురోభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. ఒక సమాజం అత్యున్నత స్థాయికి ఎదిగి మార్గదర్శకంగా నిలబడాలంటే పుస్తకాలు ఇచ్చిన జ్ఞానమే పునాదిగా నిలుస్తుందని వివరించారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతికి ఇంకా సాధించాల్సిన పురోగతికి మధ్య మేధో సంఘర్షణల ఆలోచనలన్నింటినీ భద్రంగా రికార్డు చేసి ప్రపంచం చేతికందించేది పుస్తకాలేనని అన్నారు. భిన్న భాషా సంస్కృతుల పుస్తకాల కేంద్రంగా హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నిలిచిందని చెప్పారు. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులు నూతన ఆలోచనల పొదుగుగా నిలిచిన ఈ ప్రదర్శనను వినియోగించుకోవాలని సూచించారు. మతసామరస్యానికి ప్రతీకగా ముందుకు సాగుతున్నట్టుగానే బుక్‌ఫెయిర్‌ కూడా సర్వజనుల ఆకాంక్షలకు, ఐక్యతకు ప్రతిరూపంగా నిర్వహించాలని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో తాను ఒక రోజు పాల్గొంటాననీ, అది విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్‌, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వాహకులు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Spread the love