తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి (సన్నీ కోమలపాటి) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శౌరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి, దేవు శామ్యూల్, షైక్ రెహీమ్, మెల్కి రెడ్డి గాదె, గౌతమ్ కొండెపూడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ కోమలపాటి మాట్లాడుతూ, ‘ట్రైన్లో జరిగే కథ ఇది. నా నిర్మాతలకు సినిమా ఇండిస్టీ గురించి తెలియదు. నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు’ అని తెలిపారు. ‘హారర్ కథతో తెరకెక్కిన భిన్నమైన సినిమా ఇది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని 30వ తేదీన 220కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని నిర్మాతలు చెప్పారు. సాయి కుమార్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో ట్రైన్లో కథంతా సాగుతుంది. అయితే నన్ను ట్రైన్ ఎక్కించలేదు. నేనే ఈ కథను ముందుకు తీసుకెళ్తాను’ అని అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ,’ఈ సినిమా సెట్‌కి వెళ్లినప్పుడు నాకు బ్రేక్ ఇచ్చిన ‘ప్రేమ ఖైదీ’ సినిమా గుర్తొచ్చింది. కథ అంత బాగుంటుంది. నాకు ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు భరత్’ అని తెలిపారు.