న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణను సీబీఐ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది. ఈ అంశంపై ఫిబ్రవరి 2న విచారణ చేపడతామని రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పేర్కొంది. మద్యం కుంభకోణంలో మనీల్యాండరింగ్ సెక్షన్ల కింద ఈనెల 6న ఈడీ 13,657 వేల పేజీలతో సప్లమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. 428 పేజీలతో ఈడీ కంప్లైంట్ కాపీని న్యాయమూర్తికి సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్‌లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై ఈడీ అభియోగాలు మోపింది. రాబిన్ డిస్టిల్లరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జ్ విజరు నాయర్, బిజినెస్ మెన్ బినోరు బాబుల, అమిత్ అరోరా పేర్లను నిందితులుగా చేర్చింది. కాగా, ఈ సప్లమెంటరీ ఛార్జ్ షీట్ పై విచారణ శనివారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా? వద్దా అనే అంశంపై ఫిబ్రవరి 2న విచారణ చేపడతామని స్పష్టం చేశారు.