ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

– జనవరి 5న అనుబంధ చార్జిషీటు దాఖలు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన శరత్‌ చంద్రా రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, బినోరు బాబు, విజరు నాయర్లకు రౌస్‌ ఎవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టు మరో ఏడు రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది. మద్యం కుంభకోణంలో ఈడీ, సీబీఐ అరెస్ట్‌ చేసిన ఈ నలుగురు నిందితులు ప్రస్తుతం తీహార్‌ జైల్‌లో ఉన్నారు. గతంలో కోర్టు ఈ నలుగురికి విధించిన జ్యూడిషియల్‌ రిమాండ్‌ సోమవారంతో ముగిసింది. దీంతో శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, బినోరుబాబు, విజరు నాయర్‌లను ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకె నాగ్‌పాల్‌ ముందు హాజరుపరిచారు. ఈడి తరపు సీనియర్‌ అడ్వకేట్‌ నవీన్‌ కుమార్‌ మట్ట వాదనలు వినిపిస్తూ దర్యాప్తు కీలక దశకు చేరుకున్నదనీ, దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని నివేదించారు. నిందితులు కస్టడీలో అనేక విషయాలపై స్పష్టత ఇచ్చారనీ, ఈ కేసు దర్యాప్తు కీలకంగా సాగుతున్నదనీ, రిమాండ్‌ పొడిగించాలని కోరారు. దీంతో నలుగురు నిందితులకు మరో ఏడు రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించారు. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేశారు.
5న అనుబంధ చార్జిషీటు
జనవరి 5న మనీ లాండరింగ్‌ కేసులో అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. అయితే నిందితులపై విడివిడిగా కాకుండా అందరిపై ఒకే చార్జిషీటు దాఖలు చేయనున్నట్టు తెలిసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో తొలుత అరెస్ట్‌ అయిన సమీర్‌ మహేంద్రుపై గతే డాది నవంబర్‌ 26న ఈడీ తొలి చార్జిషీటు దాఖలు చేసింది. ఈ చార్జి షీటును డిసెంబర్‌ 20న సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకున్నది.

Spread the love