తమిళనాడు గవర్నర్‌ తీరుని ఎండగట్టిన ఆంగ్ల పత్రికలు

న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌ టిఎన్‌. రవి వ్యవహరించిన తీరును బుధవారం పలు ఆంగ్ల పత్రికలు ఖండించాయి. గవర్నర్‌ వ్యవహరించిన తీరును తమ సంపాదకీయాల్లో ఎండగట్టాయి. రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించాల్సిన గవర్నర్‌ ఆ పని చేయకుండా స్టాలిన్‌ ప్రభుత్వంపై పెత్తనం చలాయించేందుకు ప్రయత్నిస్తుండటం వివాదానికి దారితీస్తోంది. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో తమిళనాడు గవర్నరు ఆర్‌ఎస్‌ రవి ప్రారంభ ప్రసంగంలో కొన్ని భాగాలు మినహాయించడం, ముఖ్యమంత్రి స్టాలిన్‌ వాటిని గుర్తు చేయడంతో శాసనసభ నుంచి వాకౌట్‌ చేయడంతో గవర్నర్ల వ్యవస్థ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తింది. హిందూ, డెక్కన్‌ హెరాల్డ్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లు ముక్త కంఠంతో గవర్నర్‌ వ్యవహరించిన తీరును ఎండగట్టాయి. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన అధికారాలను అధిగమించి, తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ‘డెక్కన్‌ హెరాల్డ్‌’ పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సెషన్‌లో సాంప్రదాయ ప్రసంగంలో గవర్నర్‌ కొన్నిపేరాలను చదవకుండా వదిలివేయడం మాత్రమే కాకుండా దానిలో సొంత పదాలను చేర్చారని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఒరిజినల్‌ ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేయడంతో గవర్నర్‌ సభ నుండి వాకౌట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు, విధానాలను వివరించే ప్రసంగాన్ని తగ్గించే, అదనంగా జోడించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది. నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా ఉన్నప్పటికీ… గవర్నర్‌ చర్య ఆమోదయోగ్యం కానిదని, ఉల్లంఘన కింద వస్తుందని స్సష్టం చేసింది. గవర్నర్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడానికి ఎలాంటి కారణం లేదని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది. గవర్నర్‌ తన బాధ్యతల గురించి సమగ్రంగా తెలుసుకోవాల్సి వుందని, కార్పొరేట్‌ ఆధిపత్యాన్ని వదులుకోవాల్సి వుందని ‘ది హిందూ’ తన సంపాదకీయంలో స్పష్టం చేసింది. తమిళనాడు గవర్నర్‌ ప్రవర్తన రాజ్యాంగ విలువల ఉల్లంఘనగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విమర్శించింది. గవర్నర్‌ ప్రవర్తన రాజ్యాంగ విలువలను దెబ్బతీసిందని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వ్యాఖ్యానించింది.A

Spread the love