– తెలంగాణ వృద్ధి కొనసాగాలి
– ఎఫ్‌టీసీసీఐ సమావేశంలో జయేష్ రంజన్
– స్కిల్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో తెలంగాణ మెరుగైన ప్రగతిని కనబర్చుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఇదే క్రమంలో ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ.. తయారీ రంగంలో నైపుణ్యవంతులైన మానవ వనరుల కొరత ఉండటం దురదృష్టకరమన్నారు. బుధవారం ఎఫ్‌టీసీసీఐ పోకర్ణ స్కిల్ సెంటర్‌ను ఆయన లాంచనంగా ప్రారంభించారు. తయారీ రంగంలో నైపుణ్యం కలిగిన మానవశక్తి ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుందన్నారు. ఈ రంగంలో నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో మారుతున్న కాలానికి అనుగుణంగా మానవశక్తిని నైపుణ్యం చేయడం ఈ రంగంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి అవసరాలను తీర్చడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తయారీలోని సముచిత, విశిష్టమైన రంగాలపై దష్టి సారించాలని సూచించారు. అనుభవపూర్వక అభ్యాసంపై దృష్టి పెట్టాలన్నారు. మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం సహకారం కోసం డిజిటల్ ఎంప్లారుమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)తో సంప్రదింపులను సులభతరం చేస్తామన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో విశేష వృద్ధినికనబర్చిందని.. వచ్చే 10, 15 ఏండ్లు అదే పెరుగుదల ఉండాలని రంజన్ ఆశించారు. కళాశాల, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో చేరిన 62000 మంది విద్యార్థుల్లో 44000 మంది కంప్యూటర్ సైన్స్‌ను, 14,500 మంది ఎలక్ట్రానిక్స్‌ను ఎంచుకున్నారన్నారు. మిగిలిన 3500 మంది ఇతర విభాగాలను ఎంచుకున్నారన్నారు. కాబట్టి పరిశ్రమ సమీప భవిష్యత్తులో కొన్ని రంగాలలో భారీ నైపుణ్యాల అంతరాలను ఎదుర్కునే ప్రమాదం ఉందన్నారు. ఈ స్కిల్ సెంటర్ ద్వారా ఏడాదికి 20వేల మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోకర్నా లిమిటెడ్ సిఎండి గౌతమ్ చంద్ జైన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, మాజీ ప్రెసిడెంట్ కె భాస్కర్ రెడ్డి, సీఈఓ కీర్తి నరవాణే తదితరులు పాల్గొన్నారు.