తారకరత్నను కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు: చిరంజీవి

నవతెలంగాణ – హైదరాబాద్
సినీ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న కుప్పంలో యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనకు కుప్పంలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎక్స్ పర్ట్ డాక్టర్లతో కూడిన వైద్య బృందం చికిత్సను అందిస్తోంది. మరోవైపు తారకరత్న గురించి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆయన త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పారు. తారకరత్నను ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ‘డియర్ తారకరత్న నీకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి’ అని ఆకాంక్షించారు.

Spread the love