తెలంగాణకు టీడీపీ అవసరం

– ఖమ్మం శంఖారావంసభలో చంద్రబాబు
– పార్టీ ఎక్కడ ఉంది అనేవారికి ప్రజల ఉత్సాహమే సమాధానం
– తెలుగు ప్రజల కోసం జీవితాంతం పని చేస్తా
– వెళ్లిపోయినవారందరూ తిరిగి రావాలని ఆహ్వానం
– ఎన్టీఆర్‌ ఆత్మగౌరవాన్ని కాపాడితే.. నేను ఆత్మవిశ్వాసం పెంచా..
– రెండు రాష్ట్రాలను కలిపేస్తామని కొందరు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు..
– పని చేసుకుంటూ పోతే దేశానికి ఆదర్శమవుతాయి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణకు టీడీపీ అవసరం ఉందని టీడీపీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. అంతుకుముందు జిల్లా సరిహద్దులోని నాయకన్‌గూడెం నుంచి కార్యకర్తలు ర్యాలీగా ఆయన్ను తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ”తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనే వారికి ఇవాళ ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహమే సమాధానం.’ అని అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, వాటి పాటికి అవి పనిచేసుకుంటూ వెళితే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కొందరు బుద్ధిలేనివాళ్లు రెండు రాష్ట్రాలను కలుపుతామంటున్నారని, జ్ఞానం ఉన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని న్నారు. ఏపీలో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి, అక్కడి ప్రజలను ఆదుకుంటానని, కాసాని జ్ఞానేశ్వర్‌ వంటి నేతలను అభివృద్ధి చేసి తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. తెలంగాణలోనూ టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకువచ్చింది టీడీపీ అని, హైదరాబాదును అభివృద్ధి చేసింది టీడీపీ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఓటు అడిగే హక్కు అందరికంటే టీడీపీకే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ ఎవరూ లేరని, కానీ ఎవరూ లేకపోయినా ఇవాళ ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే ఎంతో ధైర్యం కలుగుతోందని వివరించారు. తెలంగాణలో టీడీపీ నేతలు ఇప్పటిదాకా చురుగ్గాలేనివారు ఈ సభను చూసైనా క్రియాశీలకంగా మారాలని చంద్రబాబు సభాముఖంగా పిలుపునిచ్చారు. ‘9ఏళ్లు సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఎవరూ లేరు. పదేండ్లు ప్రతిపక్ష నేతగా ఉండటం కూడా రికార్డే. రాబోయే రోజుల్లో నా రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేరు. ఎందుకంటే మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు.’ అని చంద్రబాబు అన్నారు. ‘నన్ను 40 ఏళ్లు ఆశీర్వదించిన తెలుగు జాతికోసం జీవితాంతం పనిచేస్తానని అన్నారు. ‘నేను ఫౌండేషన్‌ వేయకపోతే హైదరాబాద్‌ ఇంత అభివద్ధి అయ్యేదా?’ అని ప్రశ్నించారు. వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలు తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నానని, తెదేపాకు అవసరం అనుకున్న వాళ్లు మళ్లీ పార్టీలోకి రావాలి కోరారు. ఎప్పటికప్పుడు నాయకత్వానికి అండగా ఉంటా. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి అభిప్రాయపడ్డారు. 1999.. 2000 సంవత్సరంలో విజన్‌2020 ఇచ్చాను.. ఇప్పుడు అదంతా అమలయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు 2029 విజన్‌ ఇచ్చాను. డిజిటల్‌ విభాగంలో మనతో పోటీ పడేవారు ఎవరూ లేరు. మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలకు సీఈవోలుగా మనవారే ఉన్నారు అని చంద్రబాబు అన్నారు. వయసులో పెద్దవాడినైనా యువత కోసం టీనేజర్‌లా ఆలోచిస్తానని వ్యాఖ్యానించారు. 30 ఏళ్ల తరువాత ప్రపంచం ఎలా మారబోతుందో చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఐటీ అభివద్ధి కోసం హైటెక్‌ సిటీ కట్టానని, కంపెనీలు తేవడం కోసం ప్రపంచమంతా కాళ్లకు బలపం కట్టుకుని తిరిగానని ఆయన గుర్తుచేసుకున్నారు. తమకు ఐటీ ఇచ్చారని, టీడీపీని ఆదరించేందుకు యువత ముందుకొస్తోందని అన్నారు. గతంలో టీడీపీ ఏం చేసిందో ప్రజలు గుర్తుచేసుకోవాలని, తాను కోరేది అధికారం కాదని.. ప్రజల అభిమానమని చంద్రబాబు తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడితే, తాను ఆత్మవిశ్వాసాన్ని పెంచానని తెలిపారు. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదని, శక్తి, వ్యవస్థ అని విశ్లేషించారు. తమ్ముళ్లు తెలుగుదేశం అవసరముందా? లేదా? అంటూ ప్రశ్నించారు. నాయకుడంటే ఎన్టీఆర్‌ అని, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని కొనియాడారు. ఐటీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయుల మేథోశక్తికి పోటీ లేదన్నారు. కరోనా వ్యాక్సిన్‌ ఇక్కడే తయారు చేయబడిందన్నారు. సెల్‌ఫోన్‌ తీసుకొచ్చేందుకు ప్రధానులను మెప్పించానన్నారు. ఎన్టీఆర్‌తోనే బీసీలకు రాజకీయ జీవితం ప్రారంభమైందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి దేశవిదేశాల్లోనూ చర్చనీ యాంశమైందన్నారు. ఖమ్మం తరహాలో తెలంగాణవ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సింహగర్జన చేపడ తామని ప్రకటించారు. పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నేత కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందమూరి సుభాషిణి, రాష్ట్ర నాయకులు కంభంపాటి రామ్మోహన్‌రావు, నర్సింహులు, అరవింద్‌ కుమార్‌గౌడ్‌, ఎన్‌. నర్సారెడ్డి, జోత్స్న, కాట్రగడ్డ ప్రసన్న, సామా భూపాల్‌రెడ్డి, వాసిరెడ్డి రామనాథం, గడ్డి పద్మావతి, ప్రదీప్‌చౌదరి, తాళ్లూరి జీవన్‌, నెల్లూరి దుర్గా ప్రసాద్‌, మాదాటి శ్రీనివాసరెడ్డి, కాపా కృష్ణమోహన్‌, కాసాని వీరేష్‌ పాల్గొన్నారు.

Spread the love