తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

నవతెలంగాణ-కంటేశ్వర్
కేంద్ర బడ్జెట్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే 29 వేల కోట్ల రూపాయలు తగ్గించి 60 వేల కోట్లకే పరిమితం చేశారని దీన్ని సవరించి 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ హమాల్వాడి చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు కదం రాజు,నర్ర కల, నాయకులు రేఖ, బులిబాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో తగ్గిస్తూనే వస్తున్నారు. ఇది భవిష్యత్తులో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్మూలించే కుట్రలో భాగమేని ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే 29 వేల కోట్లు తగ్గించారు. అంటే 60 వేల కోట్లు ప్రకటించారు. పాత పెండింగ్ బిల్లులు 22 వేల కోట్లు ఉన్నాయి. అవి మినహాయిస్తే 38 వేల కోట్ల రూపాయలు మాత్రమే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పంచాలి. మన తెలంగాణ రాష్ట్రానికి 2000 కోట్లు రావడం గగనకష్టం. ఇప్పటికే 89 వేల కోట్లు కేటాయించిన సంవత్సరమే 50 నుంచి 100 రూపాయల కూలి దాటలేదు.
ఈ సంవత్సరం మరింత కూలి తగ్గే ప్రమాదం ఉంది. 70% గా ఉన్న పేద ప్రజల శ్రమని నిలువునా దోచుకోవటం, ఇది దుర్మార్గం, ప్రజావ్యతిరేక చర్య, అదే కార్పొరేట్ సంస్థలకు 12 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసి., రైతాంగానికి రుణమాఫీ చేయాలంటే చేతులు రావటం లేదు. ఈ బడ్జెట్లో భూనిర్వాసితుల సమస్యలు ఊసే లేదు. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి ఉపయోగపడకపోగా నష్టం చేసే బడ్జెట్ అని అభిప్రాయపడుతున్నాం. కాబట్టి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నా, కూలి రేట్లు పెరగాలన్నా, 200 రోజుల పని దినాలు పెరగాలన్నా, రోజుకు 600 రూపాయలు కూలి పడాలన్నా కనీసం 2 లక్షల 40 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో మార్పుల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా డిమాండ్లని అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం అని తెలియజేశారు.

Spread the love