తెలుగు బాల సాహిత్యానికి వెలుగు సేవకుడు ‘డా.అమ్మిన శ్రీనివాసరాజు’

            బాల సాహిత్య రచన, ప్రచురణ వంటివి అందరు బాల సాహితీవేత్తలు చేస్తున్నదే… ఈ నేపథ్యంలో అటు వృత్తిరీత్యా నవ యువతరానికి పాఠాలను బోధిస్తూ, గిరిజనులు, ఆదివాసులకు అత్మనేస్తమై నిలిచి వారి గురించి రచనల్లో తెలియజేస్తూ, రచయితగా, విమర్శకునిగా, తెలుగు భాషా సాహిత్యాల పట్ల ‘అమ్మ’ ప్రేమతో నిలిచిన బాల సాహితీవేత్త డా. అమ్మిన శ్రీనివాసరాజు. ఈ రాజు గురించి ఇన్ని మాటలు చెప్పడానికి కారణం, చాలాకాలంగా బాలల సాహిత్య సమూహంలో వాట్సప్‌ వేదిక మీద ఆయన చేస్తున్న సేవ గొప్పది. ప్రతిరోజు సూర్యునికంటే ముందే ఆనాటి బాల సాహిత్య రచనలను అందించడం, మళ్ళీ వాటిని వారానికొకసారి ‘బాల రంజని’ పేరుతో అంతర్జాలంలో నిక్షిప్తం చేయడం తన బాధ్యతగా చేస్తున్నాడు. దీనికి తోడు ప్రతిరోజు ఆనాడు విశేషమున్న తెలుగు ప్రముఖున్ని నాలాంటి విద్యార్థుల కోసం అందిస్తున్నాడు. నాకు తెలిసిన వాటికంటే ఆయన రాతలతో నేను తెలుసుకున్నవి ఎక్కువ. అందుకే ఆయనకు బాలల పక్షాన ‘జేజేలు’.
రాజు ఖమ్మం జిల్లా వాజేడు మండలం లక్ష్మీపురంలో ఏప్రిల్‌ 21, 1971న పుట్టిండు. పళ్ళాలమ్మ-నూకరాజు అమ్మనాన్నలు. తెలుగు సాహిత్యంలో ఎం.ఏ., ఎం.ఫిల్‌, పిహెచ్‌డిలు చేసిన రాజు ఎం.ఫిల్‌ ‘న్యాయపతి రాఘవరావు -కథలు పరిశీలన’ బాల సాహిత్య విమర్శ మీద ఆయన ప్రేమను తెలుపుతోంది. రెందున్నర దశాబ్దాలుగా తెలుగు ఉపన్యాసకునిగా సేవలు అందిస్తున్న రాజు నూరుకు పైగా విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో తెలుగు చదివేలా స్ఫూర్తినివ్వడం విశేషం. అంతేకాదు ఏజన్సీ ప్రాంతం నుంచి ‘డాక్టరేట్‌’ పట్టా పొందిన మొదటివాడు మన అమ్మిన. తన సంతకం కింది ‘తెలుగు సేవకుడు’ అని గర్వంగా, గౌరవంగా రాసుకోవడం అమ్మినకే చెల్లింది… అందుకు ఆయన త్రికరణంగా చేస్తున్న పనే మరి.
కార్యకర్తగా కూడా రాజు రాజే… ఇరవై యేండ్లుగా గుంటూరు నుంచి వచ్చే ‘వికాస విద్య’ పత్రికకు సంపాదకులుగా ఉన్నాడు. ఇంకా ఖమ్మం ‘విద్యా విహారం’ మాసపత్రికకు కూడా బాధ్యుడు. భద్రాచలం సాహితీ స్రవంతి బాధ్యుల్లో ఒకరు. సాహితీ స్రవంతి చర్ల అధ్యక్షులుగా ఉన్నారు. తెలుగు రక్షణ వేదికలోనూ బాధ్యతగా బాధ్యతలు నిర్వహిచారు. రచయితగా అయిదు నూర్ల వ్యాసాలు ఈయన ఖాతాలోని మూల ధనం. ఆకాశవాణి ద్వారా వందలాది ప్రసంగాలు చేశారు. బాల సాహిత్యానికి సంబంధించిన ప్రసంగాలు ఈయన రచనల్లో విరివిగా ఉన్నాయి. తాను చేసిన సేవలకు అటు బాలల నుంచి ప్రేమ, బాల సాహితీవేత్తల నుంచి అభిమానాన్నే కాక ఇటు వివిధ సంస్థల నుంచి విశేష సత్కారాలు అందుకున్నారు. వాటిలో విశ్వసాహితి-వంశీ పురస్కారం, ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్‌ సత్కారం, అద్దంకి జానపద పరిషత్‌ పురస్కారం, శ్రీశ్రీ కళా పీఠం పురస్కారం, తెలుగు భాషా దినోత్సవంతో పాటు ఇటీవల మందడపు నాగయ్య స్మారక పురస్కారం అందుకున్నారు.
రచయితగా నూరుకు పైగా కథలు రాశారు డా.అమ్మిన శ్రీనివాసరాజు. వాటిలో కొన్నింటిని ‘గ్రీష్మంలో వసంతం’ పేర కథా సంపుటిగా తెచ్చారు. తన కథలను, కవిత్వాన్ని సామాజిక చేతన, చైతన్యానికి వాహికగా ఎలా మలచుకోవాలో బాగా తెలిసిన రచయిత అమ్మిన. అందులోనూ తాను పుట్టి పెరిగిన, ఉద్యోగం చేస్తున్న ప్రాంతం ఆదివాసీల ఆలవాలం కాబట్టి అక్కడి ప్రజలు, వారి జీవితం, ఆచారాలు, సంస్కృతలు వంటివి తన అవగాహన మేరకు అచ్చులో అందించాడు. ఇంకా అందిస్తున్నారు. విమర్శకునిగా అమ్మిన తెచ్చిన పుస్తకం ‘అక్షరాభిషేకం’. దీనికే మందపు పురస్కారం వచ్చింది.
బాల సాహితీవేత్తగా వందల కథలు రాసిన అమ్మిన వాటిని ‘రసగుల్లాలు’, ‘పూతరేకులు’, ‘చంద్రవంకలు’ పేరుతో ప్రచురించారు. వీరి కథ ‘అడవిలో అందాల పోటీ’ మహారాష్ట్ర ప్రభుత్వ రెండవ భాష తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఏడవ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. ఇవేకాక బాలల వ్యక్తిత్వ వికాసంపై ప్రజాశక్తిలో దాదాపు ముప్పైకి పైగా రచనలు అచ్చయ్యాయి. ఈయన కథలు స్థానికతను, బాలల పరిసరాలు, వస్తువులను దాటిపోవు. తన నేటివిటీ తన కథల్లో ఉండడం ఈయన రచనల్లోని ప్రత్యేకత. మూస విధానానికి, నీతి బోధన వంటివాటిలో అన్నింట్లో వస్తున్నట్టే బాలల సాహిత్యంలోనూ మార్పు రావాలని తపించే బాలల మనసు ఈయనది. ఆయన ప్రతి రచనలో అది చూడొచ్చు. ముఖ్యంగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా వాస్తవికతకు దగ్గరగా పిల్లల రచనలు ఉంటేనే పిల్లలు యిష్టపడతారని భావించడమేకాక అలానే తన కలాన్ని కూడా నడిపిస్తారు. అన్ని కథల గురించి పేర్కొనను గానీ ఇటీవల వచ్చిన ‘అన్నప్రాసన’, ‘అడవిలో అందాల పోటీ’, ‘వనంలో వసంతవ’ వంటివి చూడొచ్చు. బాల సాహిత్య వికాస విస్తార ప్రచారోద్యమంలో ముందువరుసలో నిలిచిన కార్యకర్త, తెలుగు సేవకుడు, ఖమ్మం జిల్లా అందించిన భాషాగని డా. అమ్మిన శ్రీనివాసరాజుకు జేజేలు! జయహో! బాల సాహిత్యం.

– డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

Spread the love