త్రిపురలో భారీ పోలింగ్‌

–  సాయంత్రం 4 గంటలకు 81.11 శాతం ఓటింగ్‌
– బీజేపీ హింసాకాండ ొ సీపీఐ(ఎం) కార్యకర్తలకు తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ : బీజేపీ హింసాకాండ, బెదిరింపుల నడుమ త్రిపురలో భారీ పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌కు నిర్ణీత సమయమైన సాయంత్రం 4 గంటలకు 81.11 శాతం మంది ఓటు వేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆ సమయంలో దాదాపు 1,500 బూత్‌ల్లో 1.35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దీంతో పోలింగ్‌ శాతం 85కి చేరుతుందని అంచనా. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 89.08 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగానే బూత్‌ల ముందు మహిళలతో పాటు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 4 గంటల వరకూ ఈ ప్రక్రియ సాగింది. సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వారికి టోకెన్లను జారీ చేశారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా 3337 పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్‌ జరిగింది. వీటిలో 1100 పోలింగ్‌ స్టేషన్ల సున్నితమైనవి కాగా 28 సమస్యాత్మకమైనవిగా గుర్తించి తగిన ఏర్పాట్లను చేశారు. వివిధ పార్టీల నుంచి మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రంలో మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 13.99 లక్షల మందికి పైగా ఉండగా, పురుష ఓటర్లు 14.15 మందికి పైగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మానిక్‌ సాహా బొరోడోవాలి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆయనపై ఆశిశ్‌ కుమార్‌ సాహాను కాంగ్రెస్‌ నిలిపింది.
బీజేపీ బెదిరింపులు..
లెఫ్ట్‌ నాయకులపై దాడులు
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార బీజేపీ నాయకులు ప్రజలు, ప్రతిపక్ష నాయకులపై బెదిరింపులు, దాడులకు దిగారు.సెపాహిజల జిల్లాలోని బొక్సానగర్‌లో కొంత మంది గుర్తితెలియని వ్యక్తులు సీపీఐ(ఎం) స్థానిక కమిటీ కార్యదర్శిపై దాడికి దిగారు. ఆయనకు గాయాలు కావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. గోమతి జిల్లాలో సీపీఐ(ఎం) పోలింగ్‌ ఏజెంట్లను తీవ్రంగా కొట్టారు. పశ్చిమ త్రిపుర జిల్లాలో సీపీఐ(ఎం) అభ్యర్థి పబిత్రకర్‌ పోలింగ్‌ ఏజెంట్‌కు సంబంధించిన వాహనాన్ని కాషాయమూకలు ధ్వంసం చేశాయి.బీజేపీ దాడిలో గాయపడిన సీపీఐ(ఎం) కార్యకర్తలు చందందాస్‌, షిపాన్‌ మజుందార్‌లను ఆస్పత్రిలో చేర్చారు. రాత్రి పేలుడు పదార్థాలను పేల్చి ఓటర్లలో భయాందోళనలు రేపేందుకు బీజేపీ సభ్యులు ప్రయత్నించారు.
బిషాల్‌గఢ్‌, శాంతిర్‌పూర్‌, రాంనగర్‌, ధన్‌పూర్‌, బముతియా, సూర్యమీనగర్‌, బ్రజాలాలో బీజేపీ సభ్యులు ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. బీజేపీ బెదిరింపులకు ఓటర్లు భయపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా చోట్ల దాడి చేసిన వారిపై ఓటర్లు నేరుగా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
రూ. 45 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం : ఈసీ
ప్రచారం సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో డబ్బు, మద్యం, మత్తు పదార్థాలు సహా రూ. 45 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. హెలికాప్టర్లు, విమానాల్లో త్రిపురకు అక్రమంగా డబ్బు తరలిస్తున్నారని ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వాధీనం చేసుకున్న ఉచితాలు 20 రెట్లు ఎక్కువని ఎన్నికల సంఘం తెలిపింది. సూర్యమణినగర్‌లో బీజేపీ కార్యకర్తలు 26,28,29 బూత్‌లపై దాడికి ప్రయత్నించారని త్రిపుర కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నప్పటికీ తమ సొంత పార్టీలకు అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసినందుకు త్రిపుర కాంగ్రెస్‌, బీజేపీలకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ నోటీసులు పంపారు.
త్రిముఖ పోరు
ఆది నుంచీ త్రిపుర ఎన్నికలు ఆసక్తిని రేపాయి. అధికార బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమిని మళ్లీ అధికారంలోకి రాకుండా నిరోధించి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే లక్ష్యంగా వామపక్షాలు, కాంగ్రెస్‌ ల కలయికతో కూటమి ఏర్పడింది. ఇక ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన టిప్రా మోతా రాష్ట్ర ఎన్నికలో బరిలో తొలి సారిగా నిలిచింది. దీంతో బీజేపీ-ఐపీఎఫ్‌టీ కూటమి, లెఫ్ట్‌-కాంగ్రెస్‌ కూటమి, టిప్రా మోతా ల మధ్య త్రిముఖ పోరు ఏర్పడింది. ఎన్నికల తుది ఫలితాలు వచ్చే నెల 2న వెలువడనున్నాయి.
మొరాయించిన ఈవీఎంలు
త్రిపుర ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 40 నుంచి 45 చోట్ల ఎన్నిలక మిషన్లు సరిగ్గా పని చేయలేదు. దీంతో ఆయా పోలింగ్‌ స్టేషన్లలో ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఓటర్ల సహనాన్ని ప్రశ్నించారు. మహిళలు, వృద్ధులు క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. మొరాయించిన ఈవీఎంల స్థానాల్లో కొత్తవాటిని అధికారులు అమర్చారు. అనంతరం ఎన్నికలు యథావిధిగా సాగాయి.

Spread the love