– బీజేపీ మూకదాడి.. సీపీఐ(ఎం) మద్దతుదారుడి హత్య
అగర్తల : త్రిపురలో ఎన్నికల అనంతర హింసాకాండ రాజుకుంటోంది. బీజేపీ గూండాల చేతిలో సీపీఐ(ఎం) మద్దతుదారుడు ఒకరు హత్యకు గురయ్యారు. కళ్యాణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ద్వారికపూర్ పంచాయితీలో బీజేపీ ‘ప్రధాన్’గా వ్యవహరించే కృష్ణ కమల్‌దాస్, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడి చేసి కొట్టడంతో సీపీఐ(ఎం) మద్దతుదారుడు దిలీప్ శుక్లా దాస్ మృతి చెందాడు. కృష్ణ కమల్‌దాస్, దిలీప్ శుక్లా దాస్ కుటుంబాలు ద్వారికపూర్లో పక్కపక్కనే నివసిస్తూఉంటాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇరు కుటుంబాల మద్య చిన్నపాటి వాదన జరిగింది. వాదనలో రెచ్చిపోయిన కృష్ణ కమల్‌దాస్, అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా రెచ్చిపోయి దిలీప్ శుక్లా దాస్‌పై దాడికి దిగారు. తీవ్రంగా కొట్టారు. కమల్‌దాస్ దాడి నుంచి దిలీప్ శుక్లాను అగ్నిమాపక సిబ్బంది రక్షించి కోవాయిలోని ఆసుప్రతికి తీసుకుని వెళ్లారు. అయితే దిలీప్‌కు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆతన్ని ఆస్పత్రికి ఆదివారం ఉదయం జీబీపీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయినా దిలీప్ శుక్లాను రక్షించుకోలేకపోయారు. ఆదివారం అతను మృతి చెందాడు. దిలీప్ మృతితో కళ్యాణ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విషాదచాయలు నెలకున్నాయి. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కృష్ణ కమల్దాస్ను అదుపులోకి తీసుకుని ఆదివారం కోవాయి కోర్టులో ప్రవేశపెట్టారు.
కాగా, మరోవైపు దిలీప్ శుక్లాదాస్ మృతదేహాన్ని స్వీకరించడానికి ప్రయత్నించిన జితేంద్ర చౌదరి నేతృత్వంలోని సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డకున్నారు. దీంతో మృతదేహాన్ని తమకు అప్పగించేందుకు పోలీసు అధికారులు నిరాకరించడాన్ని నిరసిస్తూ కుంజాబన్ ప్రాంతంలో హెరిటేజ్ పార్కు వద్ద సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.