త్రిపురలో హింస


త్రిపురలోని ఛరిలాంలో నవంబరు 30న సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులపై చెలరేగిన హింసాకాండ బీజేపీ బరితెగింపునకు, దాని క్రూరత్వానికి నిదర్శనం. నాలుగున్నరేండ్లగా తీవ్ర నిర్బంధం కొనసాగిస్తున్న ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల కార్యాలయాలను బలవంతంగా మూసివేయించి రౌడీయిజం చలాయిస్తోంది. మహనీయడు లెనిన్‌ విగ్రహాల కూల్చివేతతో మొదలైన బీజేపీ హింసాత్మక పాలన ప్రజల ప్రాణాలను తోడేసేందుకు వెనుకాడటం లేదు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి కృత్రిమ బలం సృష్టించుకొని ఆదివాసీ నేషనల్‌ పార్టీ ఆఫ్‌ త్రిపుర (ఐఎన్‌పిటి)తోనూ చేతులు కలిపి అత్యంత అప్రజాస్వామిక రీతుల్లో 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సూది మొనంత అవినీతి మరక లేకుండా సుపరిపాలన అందిస్తున్న వామపక్ష కూటమి ప్రభుత్వాన్ని అనైతిక పొత్తులతో దెబ్బతీసి నాటి నుంచి వినాశకర పాలన సాగిస్తోంది. ప్రతిపక్షాలను లక్ష్యంగా చివరకు దాని భాగస్వామ్య ఐఎన్‌పిటిని కూడా లక్ష్యంగా చేసుకొని తీవ్రమైన అణిచివేత ధోరణలను కొనసాగిస్తూ వస్తోంది. రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించకుండా బెదిరింపులకు, దాడులకు తెగబడుతోంది. ప్రజాస్వామ్య నిరసనలకు, ప్రదర్శనలకు అనుమతించకుండా పోలీసు రాజ్యాన్ని సాగిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఛరిలాంలో బుధవారం చోటుచేసుకున్న దౌర్జన్యకాండ బీజేపీ దురాగతాలకు తాజా ఉదాహరణ.
నాలుగున్నరేండ్లలో దుర్మార్గ పాలన సాగిస్తున్న బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా విప్లవ్‌ దేవ్‌ను తొలగించి మానిక్‌ సాహాను గత మే నెలలో తీసుకొచ్చినా… కాషాయ పార్టీ పట్ల ప్రజాగ్రహం చల్లారడం లేదు. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ధరల పెరుగుదలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) ఇస్తున్న పిలుపులకు, ధరాఘాతం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వామపక్షాల ప్రదర్శనలకు, సభలకు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. 2018 ఎన్నికల్లో తనకు పెద్ద మద్దతుదారుగా నిలిచిన ఐఎన్‌పిటి ప్రజల్లో ప్రాభవం కోల్పోయింది. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయించిన నేతలు బీజేపీ అధినాయకత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తితో అక్కడ కొనసాగలేక ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో తమకు నూకలు చెల్లుతాయనే అంచనాతోనే బీజేపీ మారణకాండకు తెగబడుతోంది. ప్రజల్లో భయోత్పాతం సృష్టించి ప్రత్యర్థి పార్టీలను మానసికంగా దెబ్బతీస్తేనే తమ ఆగడాలు యథేచ్ఛగా సాగుతాయనే భ్రమలతో ఆ పార్టీ బరితెగింపులకు పాల్పడుతోంది. ఛరిలాంలో స్థానికంగా క్రియాశీలకంగా ఉండే షాహిద్‌ మియాను హత్య చేసిన తీరు, కార్యకర్తలపై మారణాయుధాలతో దాడులకు తెగబడిన వైనం, షాహిద్‌ మియా అంతిమ సంస్కారాలకు అనుమతి ఇవ్వకుండా పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించి, ఆయన కుటుంబ సభ్యులపైనా లాఠీఛార్జి చేయించి క్రౌర్యాన్ని ప్రదర్శించిన తీరు దారుణం.
కార్పొరేట్లకు ప్రజా సంపద దోచిపెడుతూ ప్రతిగా ఎన్నికల బాండ్ల రూపంలో అవి సమకూర్చుతున్న రూ.వేలాది కోట్లతో కొనుగోళ్లకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ అధికారం కోసం మారణకాండకు కూడా వెనుకాడబోం అనే ఫాసిస్టు తరహా ప్రమాదకర సంకేతాలనిస్తోంది. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలంటే ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులన్నీ ప్రతిఘటించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బీజేపీని అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను పరిరక్షించుకోవడమే త్రిపుర ప్రజల ముందున్న ప్రథమ కర్తవ్యం. హింసోన్మాద బీజేపీని కట్టడి చేద్దాం రండి అంటూ వామపక్షాలు ఇస్తున్న పిలుపు సహేతుకమైనది. బీజేపీని ఒంటిరి పాటు చేసి ఓడిస్తేనే ప్రజలకు, దేశానికి రక్ష.

Spread the love